ధర్మ సంకటం:-
An unconditional love of a father
కిరణ్మయి ఒక సాధారణ మధ్య తరగతి గృహిణి. ఆమె భర్త భానుప్రకాష్ ఒక కార్పోరేట్ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నాడు. ఏడేళ్ళ నిరీక్షణ అనంతరం వాళ్ళకి కలిగిన ఏకైక సంతానం విన్నీ. అప్పటి నుండి వాళ్ళ జీవితంలో సరికొత్త వసంతాలు చిగురించాయి. విన్నీని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భానుప్రకాష్‌కు విన్నీ అంటే పంచప్రాణాలు. సాయంత్రం అవ్వగానే ఎన్ని పనులున్నా డ్యూటీ నుండి నేరుగా ఇంటికి వచ్చేసేవాడు. విన్నీకి ప్రస్తుతం మూడేళ్ళ వయస్సు. ఈ మూడు సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయో వాళ్ళకే తెలీదు.

భానుప్రకాష్‌కు తన హెడ్ ఆఫీస్ నుండి అనుకోకుండా ఒక రోజు ఫోన్ కాల్ వచ్చింది. మొదటిగా హెడ్ ఆఫీస్ వాళ్ళు భానుప్రకాష్‌కు అభినందనలు తెలిపారు. తర్వాత అతనికి ప్రమోషన్ ఇస్తున్నట్టు, అలాగే అమెరికాలో ఒక కీలకమైన ప్రాజెక్టు యొక్క మేనేజింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు సెలక్టు చేస్తున్నట్టు తెలిపారు. భానుప్రకాష్ ఆనందానికి అంతులేదు. ఆఫీసులో మిగతా సహుద్యోగులు చుట్టూ చేరి అతనిని అభినందనలతో ముంచెత్తడం ప్రారంభించారు.
భానుప్రకాష్ ఆ సంతోషమైన క్షణాలను తన భార్యతో పంచుకోవాలని వెంటనే ఇంటికి ఫోన్ చేసాడు. కిరణ్మయి ఆ శుభవార్తను వినగానే తన కళ్ళలో ఆనంద భాష్పాలు, అంతలోనే ఆమె గుండెల్లో ఎదో లోటు. “అమెరికా క్యాంపు ఎన్ని రోజులు ఉండవచ్చు” అని దిగులుగా అడిగింది. “అయ్యో! ప్రమోషన్ వచ్చిందన్న ఆనందంలో అసలు విషయం అడగడమే మర్చిపోయాను, అయితే వివరాలు అన్నీ తెలుసుకుని ఇంటికి వచ్చాక చెప్తాను. నాకోసం ఈ సంతోషకరమైన సమయంలో ఎదో ఒక స్పెషల్ రెడీ చేసి ఉంచు” అన్నాడు భానుప్రకాష్.

Unconditional love of a father towards a Baby Girl
సాయంత్రం ఆరు గంటలకు కాలింగ్ బెల్ మ్రోగింది. కిరణ్మయి తన భర్తకు స్వాగతం తెలుపుతూ సంతోషంగా తలుపు తీసింది. కానీ భానుప్రకాష్ ముఖంలో ఆ సంతోషం కనిపించలేదు. కిరణ్మయిని చూసి “అనుకున్నంత సంతోషపడే విషయం కాదు” అన్నట్టు మొహం పెట్టి నేరుగా లోపలకి వెళ్లి నిద్రపోతున్న విన్నీని చూసి నుదురు మీద ప్రేమగా నిమిరాడు. వెంటనే ఎదురుగా ఉన్న సోఫాలో సేదతీరుతూ ఆలోచనలో పడ్డాడు. “ఏమైంది, ఏదైనా సమస్యా?” అని ప్రక్కన కూర్చుని ప్రేమగా అడిగింది కిరణ్మయి. “అమెరికాలో ఏడాది పాటు ఉండాలి. విన్నీని విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండటమే కష్టం, అలాంటిది ఏడాది కాలం” అంటూ మరోసారి నిట్టూర్చాడు భానుప్రకాష్. “అయితే ఇప్పుడు ఏం చేద్దాం” అని అతని ప్రక్కన కూర్చుని అడిగింది కిరణ్మయి.

భానుప్రకాష్ కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాసను పీల్చుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి “నాకోసం ఏం స్పెషల్ చేసావ్?” అని విషయాన్ని దారిమల్లిస్తూ అడిగాడు. “మీకు ఇష్టమైన పాయసం చేసాను” అని చెప్పింది కిరణ్మయి. “అయితే వెంటనే తీసుకురా, విన్నీని మిస్ అవ్వకుండా నిర్ణయం తీసుకోవడం నాకెంతో సంతోషం కలిగించిన విషయం. అందుకని ఇప్పుడు మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి” అన్నాడు కళ్ళు పెద్దవిగా చేస్తూ భానుప్రకాష్.
ప్రమోషన్ వదులుకున్న భానుప్రకాష్ ఎప్పటి లాగానే సాధారణంగా ఆఫీసుకి బయల్దేరుతూ, తన బూట్లను శుభ్రం చేసుకుని కాళ్ళకి తొడుగుతూ ఉన్నాడు. ఇంతలో కిరణ్మయి ఓ వైపు ఇంటి పని చేస్తూ చంకలో విన్నీని ఎత్తుకుని క్యారేజీ బాక్సుని గబగబా తెచ్చి భానుప్రకాష్ చేతికి అందించింది. క్యారేజీ అందుకుని విన్నీ బుగ్గల్ని నిమురుతూ బైక్ స్టార్ట్ చేసాడు భానుప్రకాష్. అతను ముందుకు కదిలే లోపు దూరంగా ఎవరో తమ ఇంటివైపు రావడం గమనించి బైక్ అక్కడే నిలిపి చూస్తున్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక సంచి పట్టుకుని దగ్గరకు వచ్చి “సార్, మీకు ఈ ఉత్తరం వచ్చింది” అని భానుప్రకాష్ చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు.
భానుప్రకాష్ ఆ ఉత్తరాన్ని వెనక్కి త్రిప్పి చూసాడు. వచ్చిన చిరునామా వివరాలు ఏమీ లేవు. ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది అన్నట్టు కిరణ్మయి వంక ప్రశ్నార్ధకంగా చూసాడు. నాకు కుడా తెలియదు అన్నట్టు కిరణ్మయి తల ఊపింది. భానుప్రకాష్ బైక్ స్టాండ్ వేసి కవర్‌ను చించి లోపల ఉన్న లేఖని బయటకి తీసి చూసాడు.

“డియర్ భానుప్రకాష్,
నేను డాక్టర్ సుధాకర్, మీరు నన్ను గుర్తుపడతారు అనుకుంటున్నాను. మూడేళ్ళ క్రితం నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కుడా నాకు లేదు. గడిచిన మూడేళ్ళుగా ఈ నిజం నన్ను నిలువునా దహించివేస్తోంది. నేను చేసిన ఈ పాపానికి మీరు ఏ శిక్ష విధించినా పర్వాలేదు.
ఈ విషయం మీరు అంత సులువుగా జీర్ణించుకోలేనిది. అయినప్పటికీ చెప్పక తప్పడం లేదు. మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మీ పాప నిజానికి మీ బిడ్డ కాదు. మూడేళ్ళ క్రితం మా ఆసుపత్రిలో మీ భార్య ఒక మగ బిడ్డని ప్రసవించారు. కొన్ని పరిస్థితుల ప్రభావం చేత తప్పు అని తెలిసినా నా చేతులతో నేనే మీ బిడ్డని మరొక ప్రసవ తల్లి వద్ద ఉంచి వాళ్ళ బిడ్డను మీకు చేర్చాను. ఇప్పుడు మీ బిడ్డ వాళ్ళ వద్ద పెరుగుతున్నట్టు వాళ్ళకి కుడా తెలియదు”.

భానుప్రకాష్ బైక్‌ను వదిలేసి జారుతున్న గుండెను ఆపలేని విధంగా నేల మీద జారబడ్డాడు. కిరణ్మయి ఏమైందో అర్ధంకాక పరిగెత్తుకుని వచ్చి విన్నీని కింద దించి ఉత్తరాన్ని తీసుకుని చదవడం ప్రారంభించింది.
“శ్రీమతి కిరణ్మయి భానుప్రకాష్ గారు, అసలు నేను ఎందుకు అలా చేయవలసి వచ్చిందో కుడా చెప్తాను. మీతో పాటుగా ప్రసవించిన స్త్రీ పేరు ఆమని. ఆమె భర్త జలంధర్. గతంలో ఒకసారి ఆమె ఐదవ నెల గర్భవతిగా ఉన్నప్పుడు మా ఆసుపత్రిలో స్కాన్ చేసి బిడ్డ క్షేమంగానే ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ చూసి అంతా బాగా ఉందని నేను కుడా చెప్పాను. అయితే అక్కడకి ఐదు నెలల తర్వాత ఆమెను నేను మళ్ళీ అదే ఆసుపత్రిలో చూసాను. ఆమెను పలకరించి తన బిడ్డ కోసం అడిగాను. కానీ ఆమె నా వైపు దీనంగా చూస్తూ పిండంలో ఎదో సమస్య ఉందని పిండాన్ని తొలగించారు అని చెప్పింది. అంతే కాకుండా గతంలో ఒకసారి ఇలానే జరిగింది అని అప్పుడు కూడా గర్భశోకం మిగిలింది అని కన్నీరు పెట్టుకుంది.
అక్కడకి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆమెను ఆసుపత్రిలో చూసాను. అప్పడు ఆమెకు మూడవ నెల. ఈసారి తనకు ఏమీ కాదు అని బరోసా ఇచ్చి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత రోజు ఆమె సమస్య ఏమి అయి ఉంటుందని తెలుసుకునేందుకు రహస్యంగా మా సిస్టమ్స్ లో స్టోర్ చేసిన పాత స్కానింగ్ రిపోర్టులు చూసాను. ఒక్కసారి షాక్‌కు గురి అయ్యాను. గతంలోని రెండు రిపోర్టులు కూడా శిశువులు ఎంతో క్షేమంగా ఉన్నట్టు స్పష్టంగా ఉన్నాయి. మరి రెండుసార్లు పిండాన్ని ఎందుకు తొలగించి ఉంటారు అని ఇంకోసారి రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి చూసాను. అయితే ఎంత ఆలోచించినా నాకు ఏమీ అర్ధం కాలేదు. బాగా ఆలోచించి ఇంకోసారి పరీక్షించాను. అప్పుడు అనుమానించాల్సిన ఒక విషయం నాకు తారసపడింది. వెంటనే ఆ రెండు రిపోర్టులను ప్రక్క ప్రక్కన పెట్టి చూసాను. రెండు రిపోర్టులలోనూ ఆమెకు పుట్టబోయేది ఆడ శిశువులు.

అప్పుడు తెలిసింది జలంధర్ ఒక దుర్మార్గుడు అని. అతడు తన డబ్బు పలుకుబడితో ఏదైనా చేయగలడు. మగ బిడ్డ కావాలని భార్య ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఒక మూర్ఖుడు. జలంధర్‌కు నేను ఎదురు వెళ్ళడం సాధ్యం కాని పని. కానీ ఇంకోసారి ఆమనికి ఈ అన్యాయం జరగకుండా ఎదో ఒకలా ఆపాలి అనుకున్నాను. ఎందుకంటే ఈసారి ఆమె ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.
అక్కడకి నెల రోజుల తర్వాత అనుకోకుండా ఆసుపత్రిలో ఆమనిని చూసాను. స్కానింగ్ కోసం వచ్చినట్టు ఆమె తెలిపింది. స్కాన్ చేసిన వెంటనే ల్యాబ్‌లో రిపోర్ట్ తీసుకుని చూసాను. మళ్ళీ షాక్‌కు గురయ్యాను. ఈసారి కుడా ఆమనికి పుట్టబోయేది ఆడబిడ్డ. తర్వాత ఎంతో కష్టపడి రిపోర్టులను తారుమారు చేసి అసలు రిపోర్ట్ స్థానంలో వేరొకరి మగ శిశువు రిపోర్టు కాపీని ఉంచి వెళ్ళిపోయాను.
నెలలు నిండిన ఆమనిని ఒకరోజు మా హాస్పిటల్‌లో జలంధర్ అడ్మిట్ చేసాడు. అప్పుడు నాలో కొన్ని భయాలు మొదలయ్యాయి. తల్లి కడుపులోనే కడకు చేర్చిన ఆ కసాయి తండ్రి ఈ నేల మీద ఆ శిశువుని బ్రతకనిస్తాడా అని.
సరిగ్గా అదే రోజున మిసెస్ భానుప్రకాష్, మీరు కుడా మా హాస్పిటల్‌లో డెలివరీ కోసం అడ్మిట్ అయ్యారు. తప్పు అనిపించినా ఒక ప్రాణాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యంతో కాన్పు సమయంలో శిశువుల్ని మార్చేసాను.
ఒకరికి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో మీకు అన్యాయం చేసాను. తర్వాత జలంధర్ చేసిన పాపానికి దేవుడు అతనికి తగిన శిక్ష విధించాడు. ఆరు నెలల క్రితం ఒక యాక్సిడెంట్‌లో అతను చాలా తీవ్రంగా గాయపడ్డాడు. బహుశా ఇది అతనికి మరొక జన్మ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అతని ప్రవర్తనలో చాలా మార్పుని నేను గమనించాను.
అందువల్ల నేను చేసిన ఈ పొరపాటుని సరిదిద్దుకునేందుకు నిజాన్ని అందరి ముందు ఒప్పుకోవడానికి సిద్దంగా ఉన్నాను. మీ బిడ్డని మీకు చేరుస్తాను. అలాగే వాళ్ళ బిడ్డకు వాళ్ళకు అప్పగిస్తాను. దయచేసి ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలియజేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను”. (క్రింద జలంధర్ ఇంటి చిరునామా వ్రాయబడి ఉంది)

భానుప్రకాష్ విన్నీ వైపు దీనంగా చూసాడు. పరిగెత్తుకుని వెళ్లి విన్నిని ఎత్తుకుని ముద్దులు పెడుతూ చిన్నపిల్లాడి లాగా ఏడ్చేశాడు. కిరణ్మయి కూడా గుండెల నిండా భారంతో ఆ తండ్రి కుమార్తెలను పెనవేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా అర్ధంకాని ఆ పసిపాప తల్లిదండ్రుల అక్కున చేరి తన చిన్ని అరచేతులతో వాళ్ళ కన్నీరు తుడుస్తూ ఉంది. అంతలో భానుప్రకాష్ ఫోన్ రింగ్ అయ్యింది. ఆఫీసుకి ఈరోజు రావట్లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. భానుప్రకాష్ కిరణ్మయి వైపు చూసి ప్రశ్నార్ధంగా చూసాడు. వెంటనే ఒకసారి మన బాబుని చూడాలని ఉందండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది కిరణ్మయి. అతను సరే అన్నట్టు తలను ఊపాడు.
ఉత్తరంలో డాక్టర్ సుధాకర్ చెప్పిన జలంధర్ ఇంటి చిరునామా భానుప్రకాష్ ఇంటి నుండి సుమారు ఆరు గంటల ప్రయాణ దూరంలో ఉంది. తల్లిదండ్రులు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా విన్నీ వాళ్ళను చూసి షికారుకి తీసుకుని వెళ్తున్నారని సంబరపడిపోతూ వాళ్ళ నాన్నకి ముద్దులు పెడుతూ ఉంది. అది చూసిన కిరణ్మయి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగి ప్రయాణానికి కావాల్సిన వస్తువులను సర్దుతోంది.
నాన్నా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని విన్నీ భానుప్రకాష్ భుజాలపై ఒరిగిపోయి ఆదుర్దాగా అడిగింది. కిరణ్మయి తన భర్త కళ్ళలోకి దీనంగా చూసింది. భానుప్రకాష్ కళ్ళలో నీళ్ళు తిరిగేసాయి. విన్నీని దగ్గరకు తీసుకుని “నువ్వే కనిపెట్టాలి. నాన్న చెప్పలేడు” అన్నాడు.

కారు స్టార్ట్ చేసి ముందుకు కదిలారు. ఎప్పడూ షికారుకు వెళ్ళేటప్పుడు అమ్మా, నాన్న ఎంతో సరదాగా ఉండేవారు కదా, ఈరోజు ఏంటి ఇలా సైలెంట్‌గా ఉన్నారు అని నాన్నను చూస్తూ అడిగింది విన్నీ. ఏమీ లేదురా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే వినాలని మేము సైలెంట్‌గా ఉన్నాం అన్నాడు భానుప్రకాష్ ఒక చేతితో తన కూతురి జుట్టుని నిమురుతూ. “ఓహ్, అదా, సరే, అలాగైతే ఈరోజు మీరు కారు ఆపే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను మా అమ్మ నాన్నల కోసం” అని విన్నీ ముద్దు ముద్దుగా అన్నాది.

దారిపొడవునా విన్నీ చెప్పినట్టు విరామం లేకుండా మాట్లాడుతూనే ఉంది. ఆరుగంటల సమయం అరగంటలా గడిచిపోయింది. అప్పటికే కాస్త చీకటి పడింది. భానుప్రకాష్ గుండె తెలియని భారంతో నిండిపోయింది. గమ్యం చేరువవుతున్న కొద్దీ విన్నీ దూరం అవుతోంది అన్న భావన అతని మనసుని చిధ్రం చేస్తోంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
తన తండ్రిని విన్నీ ఎప్పుడూ అలా చూడలేదు. విన్నీ మాట్లాడుతూ “అమ్మా, అప్పుడప్పుడు నువ్వు నాన్నతో గొడవపడి నువ్వు మాత్రమే ఏడుస్తూ ఉంటావ్, మరి నాన్న ఎప్పడూ ఏడవరా అని అడిగాను నిన్ను. అప్పుడు ఏం చెప్పావు అంటే నేను పెద్దయ్యాక నాకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపాల్సి వస్తుందని, అప్పుడు మొదటిసారి ఏడుస్తారని అన్నావు”. మరి ఇప్పుడే ఎందుకు ఏడుస్తున్నారు అమ్మా?” అని తన తండ్రి మొహంలోకి సూటిగా చూస్తూ దిగులుగా అడిగింది విన్నీ.

భానుప్రకాష్ నోట మాటరాలేదు. కిరణ్మయి గుండె శబ్దం ఆమె మౌనాన్ని దహిస్తోంది. అంతలో కిరణ్మయి ఎదురగా ఉన్న ఒక ఇంటిని చూపిస్తూ మనం వెతుకుతున్నది అదే ఇల్లు అన్నట్టు వ్రేలుతో చూపించింది. భానుప్రకాష్ ఆ ఇంటికి ఎదురుగా కారు ఆపాడు. నిశ్శబ్దం పూర్తిగా కమ్మేసింది. ఇద్దరూ కలసి విన్నీ వైపు చూసారు. తర్వాత ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. కిరణ్మయి భానుప్రకాష్ వైపు చూసి కళ్ళు ఆర్పి తెరిచింది. నిజంగానా అన్నట్టు కళ్ళు పైకి ఎగరేస్తూ కదిపాడు భానుప్రకాష్. అవును అన్నట్టు ఆమె కళ్ళు మూసి తెరిచింది.
ఇద్దరూ కలసి చెరోవైపు విన్నీకి గట్టిగా ముద్దు పెట్టారు. ఏమీ అర్ధం కాక అయ్యో పిచ్చి అమ్మానాన్న అన్నట్టు చూసింది. భానుప్రకాష్ కళ్ళు తుడుచుకుని మరోసారి విన్నీకి ముద్దులు పెట్టాడు. కిరణ్మయి పెదవులపై చిన్నగా నవ్వు చిగురించింది.
కారు దిగి ముగ్గురూ సరదాగా ఇంటిలోకి వెళ్లారు. విన్నీ మునుపటిలాగా చాలా సంతోషంగా ఉంది. భానుప్రకాష్ ఈరోజు నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు అని అడిగాడు. మీకు నచ్చింది చేస్తాలే, ముందు స్నానం చేసి కాసేపు నిద్రపోండి రాత్రంతా కారు నడిపారు అని షర్ట్ బటన్స్ తీస్తూ పలికింది కిరణ్మయి. మరి ఆఫీసు సంగతి ఏంటి? అన్నాడు అతను. మన పాప కోసం ఇంకోరోజు సెలవు అని విన్నీ జుట్టు నిమురుతూ పలికింది ఆమె.
Ultimately Parents Unconditional Love

“గౌరవనీయులైన సుధాకర్ గారు,
పరిస్థితుల ప్రభావం చేత జరిగిన ఈ పొరపాటుకు మీ మీద మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ఆ పొరపాటుని సరిదిద్దాలన్న మంచి మనసు మీకు ఉన్నప్పటికీ ఆ పొరపాటుతో పెనవేసుకున్న బంధాలు విడదీయలేనివిగా మారిపోయాయి. రక్తం పంచుకున్న కన్న బిడ్డని చూడాలని మా మనసు ఎంతో తహ తహతహ లాడింది. మా ఇంటి గడప నుండి వాళ్ళ గడపకి చేరువయ్యే ప్రతీ అడుగు మా పాప మీద పెంచుకున్న అసాధారణమైన ప్రేమ మా హృదయాలను కట్టిపడేసింది. అందుకే గడప వరకు వెళ్లి వెనక్కి వచ్చేసాం.
డాకర్, ఇక ఈ జన్మలో విన్నీ మాత్రమే మా కూతురు. పెంచిన ప్రేమ ప్రేగు బంధాలను సైతం జయించింది. మేము అనుభవించిన బాధ ఆమనికి కలగకూడదు. అందుచేత మేము వెనక్కి వచ్చేసాం. మా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ నిజాన్ని ఇకపై మీ మనసులో సమాధి చేస్తారని ఆశిస్తున్నాం”.
చదువుతూ ముగించింది కిరణ్మయి. సరే పోస్టు చేసి వచ్చేస్తాను అని లెటర్ తీసుకుని బయల్దేరాడు భానుప్రకాష్.
Very Heart Touching Story
Thank you.