సహాయం
Best inspirational Moral Stories
ఒక ఊరిలో వేర్వేరు ధనిక కుటుంబాలకు చెందిన ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిలో మొదటివాడు శ్రావణ్. అతడు ఎంతో తెలివైన వాడు, అలాగే మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. రెండవ వాడు శ్రేయాన్. శ్రేయాన్ చాలా బుద్ధిమంతుడు, అలాగే అందరి వద్ద ఎంతో అణకువగా ఉండేవాడు.

శ్రేయాన్ అంటే కళాశాలలో ఇష్టపడని లెక్చరర్లు ఉండరు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ సత్యప్రసాద్‌కు అతడంటే ఎనలేని మక్కువ. ఎంతో ధార్మిక చింతన అలాగే సేవాపూరిత ఆలోచనలు కలిగిన సత్యప్రసాద్ తన ఆలోచనలకు వారసుడు శ్రేయాన్ అని నమ్మేవాడు.
ఒకరోజు వారు చదువుకునే కళాశాలకు దగ్గరలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పసిపిల్లలను అనాధలుగా విడిచి వారి తల్లిదండ్రులు ప్రాణాలను కోల్పోయారు. ఆ వార్తను తన స్నేహితుడి ద్వారా శ్రేయాన్ విన్నాడు. రెండు రోజుల తర్వాత అటువైపుగా వెళ్తూ ఆ అనాధ పిల్లలకోసం ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు. తన పాకెట్ మనీ నుండి కొంత సొమ్ముని వెచ్చించి ఆ అనాధ పసిపాపాయి పుట్టినరోజుని ఘనంగా జరిపించాడు.
మరుసటి రోజు తన కాలేజీ స్నేహితులు అందరితో ఆ విషయాన్ని చెప్పాడు. శ్రేయాన్ మంచి మనసుకు అందరూ అతడిని మెచ్చుకోవడం ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ ఆనందానికి అవధులు లేవు. అతడిలో మరింత ప్రేరణ కలిగించడానికి ఏకధాటిగా ప్రశంశల వర్షం కురిపించాడు. చేసిన సహాయాన్ని పదిమందితో పంచుకోనిదే దానికి విలువ ఉండదు అనేది శ్రేయాన్ ఉద్దేశ్యం. ఇప్పుడు అది మరింత బలీయంగా అతడి మనసులో నాటుకుపోయింది.
శ్రేయాన్ ను అందరూ మెచ్చుకోవడం శ్రావణ్ మనసులో అసూయను రగిల్చింది. సహాయం చిన్నదైనా సమాజం ఆ సహాయాన్ని గుర్తించే విధానం అతనిలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి అదే మార్గాన్ని ఎంచుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు.
అతడు కుడా తన వెంట కొన్ని ఆహార సామగ్రీలను మరియు బట్టలను వెంటబెట్టుకుని ఆ అనాధ పిల్లలను పరామర్శించడానికి వెళ్ళాడు. అదనంగా ఆధునికి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తను చేసే సహాయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అలాగే ఒక ప్రణాళికా బద్దంగా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించాడు.
శ్రేయాన్ తను చేసిన మంచిని సమాజం గుర్తించాలని తలచాడు. శ్రావణ్ సమాజం గుర్తించాలి కాబట్టి మంచి పనులు చేయాలని అనుకున్నాడు. ఆ విధంగా పరస్పర వైవిధ్యమైన ఆలోచనలతో ఇరువురు ముందుకు సాగడం ప్రారంభించారు.
శ్రావణ్ తను కోరుకున్నట్టు అక్కడ చిత్రీకరించిన హృదయ విదారకమైన సన్నివేశాలను సోషల్ మీడియాలో ప్రచురించడం ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలోనే అతడి మంచి మనసుకు సమాజం దాసోహం అయింది. అతనికి వస్తోన్న ఆదరణకు అతడు నిర్ఘాంతపోయాడు. అటువంటి గొప్పదైన ఆదరణతో శ్రావణ్‌కు సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన కలిగింది.
సమాజంలోని పేదరికం మరియు బలహీనతలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వారికి ఆసరాగా నిలబడేందుకు శ్రావణ్ పూనుకున్నాడు. వారి ధీన స్థితిని తనకు అనుకూలంగా రికార్డు చేసి వాటి ద్వారా ప్రపంచం అతనిని గుర్తించే విధంగా మలుచుకున్నాడు.
కొన్ని రోజుల్లో అతని పేరు సమాజంలో నలుమూలలా మారుమ్రోగి పోయింది. అతన్ని ఇష్టపడేవారి జాబితాలో లక్షల్లో జనం చేరిపోయారు. ఇక వారి సొంత గ్రామంలో సరేసరి. అతడిని ఆ గ్రామ ప్రజలు దేవుడిగా కొలవడం ప్రారంభించారు.
అనుకోకుండా ఒకరోజు భీకరమైన తుఫాను ఆ గ్రామాన్ని తాకింది. వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నీరు వరదలై పారింది. గ్రామానికి బాహ్య సమాజంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. విధ్యుత్ సరఫరా పునరుద్దరణ చేయడానికి కనీసం నెల రోజులు సమయం పట్టవచ్చు అని గ్రామస్తులు తెలుసుకున్నారు.

ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ కు ఆరోజు రాత్రి గ్రామ శివారులో ఉన్న అనాధ పిల్లలు గుర్తుకు వచ్చారు. శ్రేయాన్ మరియు శ్రావణ్ ఇద్దరూ రెండు కళ్ళుగా మారి, తుఫాన్ సమయంలో వారికి అండగా ఉంటారు. వాళ్ళ కోసం నేను దిగులు చెందాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకున్నాడు. అయినప్పటికీ ఒకసారి బాధ్యతగా వెళ్లి చూసి వద్దామని అనుకున్నాడు.
తర్వాత రోజు ఉదయం వర్షం నెమ్మదించిన సమయంలో అతడు శివారు ప్రాంతానికి బయల్దేరాడు. తనతో పాటుగా వాళ్ళకి కావల్సిన ఆహార పదార్ధాలను మరియు సరకుల సంచి తీసుకుని వెళ్ళాడు.
- ఈ కథలను కూడా చదవండి
- మరచిపో నేస్తమా – Heart touching story with moral
- ధర్మ సంకటం – An unconditional love of a father
- వక్రీకరణ | Best inspiring stories in telugu 2021
- సాలిగ్రామ యోధుని కథ – A warrior of self confidence
అనాధ పిల్లలను చూడగానే సత్యప్రసాద్ మనసు చలించిపోయింది. వాళ్ళని దగ్గరకు తీసుకుని తలను నిమురుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు బాగానే ఉన్నామని వారికి కావాల్సిన వస్తువులన్నీ ఒక వ్యక్తి వచ్చి అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వారికి సహాయం శ్రేయాన్ చేస్తున్నాడా లేదా శ్రావణ్ చేస్తున్నాడా అని తెలుసుకోవాలని సత్యప్రసాద్‌కు సందేహం కలిగింది.
మీకు ఆహారాన్ని శ్రావణ్ అన్నయ్య తెస్తున్నాడా లేదా శ్రేయాన్ అన్నయ్య తెస్తున్నాడా అని సత్యప్రసాద్ ఆ పిల్లవాడి నుదిటిపై చేయి పెట్టి ప్రేమగా అడిగాడు. సార్, ఆ అన్నయ్య పేరు నాకు తెలియదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు అమ్మ నాన్నని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళింది కూడా ఆ అన్నయ్యనే. వాళ్ళని బ్రతికించాలని ఎంతో ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అప్పటి నుండి అతడే మాకు అన్నీ. మాకు ఏ లోటూ లేకుండా ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు అన్నాడు.
సత్య ప్రసాద్ ఆ పిల్లవాడి సమాధానానికి ఎంతో సంతోషపడుతూ అటువంటి విద్యార్ధులు తన కళాశాలలో చదవడం ఎంతో గర్వంగా ఉందని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి వాళ్ళిద్దరిలో ఎవరో తెలుసుకోవాలని తపన అతనిలో మరింత పెరిగింది. కాని పిల్లలు అతడిని గుర్తించడం ఎలాగా అని ఆలోచిస్తూ గోడ మీద తగిలించిన పసుపురంగు చొక్కా మీదకి అతడి దృష్టి మళ్ళింది. అది శ్రావణ్ తీసుకొచ్చి ఇచ్చినట్టు సత్యప్రసాద్‌కి గుర్తు వచ్చింది.
వెంటనే ఆ చొక్కా తీసుకువచ్చి ఇదిగో ఈ చొక్కా కొని తెచ్చాడు కదా, ఆ అన్నయ్యే కదా? మీ మంచి చెడులను ప్రస్తుతం చూసుకుంటున్నది అని అడిగాడు. పిల్లవాడు మరో ఆలోచన లేకుండా లేదు సార్, ఆ అన్నయ్య తర్వాత ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. ఇది వేరే అన్నయ్య. అయినా ఆ అన్నయ్య ఇప్పుడు రాలేడు సార్. అని చెప్పి పిల్లవాడు ఆపేసాడు.
సత్యప్రసాద్, ఏమి ఎందుకు రాలేడు. ఏమైంది అని అడిగాడు. “మరేమో ఆ అన్నయ్య వీడియో తీయాలంటే కరెంటు ఉండాలి కదా సార్. మన ఊరికేమో కరెంటు రావడానికి మరో నెలరోజులు పట్టేలా ఉంది” అంటూ కల్మషం లేని పసి హృదయంతో శ్రావణ్ ను వెనకేసుకొస్తున్న పిల్లవాడి అమాయకత్వానికి సత్యప్రసాద్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అంటే, వీళ్ళని ఆదుకుంటున్నది శ్రేయాన్ అన్నమాట. సమాజం ఎంత విచిత్రమైనది. గుర్తించాల్సిన గొప్ప వ్యక్తిని స్వల్పంగా గుర్తిస్తున్నారు. కేవలం మాటలతో గారడీ చేసే వ్యక్తిని అందలానికి ఎక్కిస్తున్నారు అని మనసులో అనుకున్నాడు.
అలా అయితే మీకు సహాయం చేస్తున్నది శ్రేయాన్ అన్నమాట అన్నాడు. శ్రేయాన్ ఎవరు సార్, అతడు మీకు తెలుసా అని పిల్లవాడు ఆశ్చర్యంగా అడిగాడు. ఓహ్, తెలియకనేమి. అతడు నా విద్యార్ధి. అతడి గురించి ఇకపై నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. మానవత్వం ఇంకా మిగిలి ఉన్నది అంటే అలాంటి వారి వల్లనే అన్నాడు సత్యప్రసాద్. ఇన్నాళ్లుగా తమకి సహాయం చేస్తూ తన పేరు కూడా చెప్పని ఆ గొప్ప వ్యక్తి గురించి ప్రిన్సిపాల్ మాటల్లోనైనా తెలుసుకోవాలని ఆ పిల్లవాడిలో ఆశక్తి మొదలైంది.
ప్రిన్సిపాల్ శ్రేయాన్ కోసం చెప్పడం ప్రారంభిస్తూ క్లాసులో ఎంతో బుద్దిమంతుడనీ అలాగే ఎంతో క్రమశిక్షణ కలిగిన వాడని చెప్పాడు. చదువులో కూడా ఎంతో తెలివైన వాడని చెప్పాడు. అయితే అతడు నీ చెల్లాయి మొదటి పుట్టిన రోజుని జరిపించాడని కాలేజీలో ఇతర విద్యార్ధులు చెప్పినప్పుడు అతని పట్ల అభిమానం మరింత రెట్టింపు అయింది అన్నాడు.
పిల్లవాడు సత్యప్రసాద్ వైపు చూసి నిరాశ చెందుతూ సార్, మీరు చెప్పిన అన్నయ్య చెల్లాయి పుట్టినరోజు తర్వాత మళ్ళీ ఇక్కడకు రాలేదు. అయితే మీరు చెప్పిన వ్యక్తి అతను కాదు సార్ అన్నాడు.
సత్యప్రసాద్ కళ్ళు బైర్లు కమ్మాయి. శ్రేయాన్ ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసాడా? ఈరోజు వాళ్ళు ఈ స్థాయిలో గుర్తింపు సాధించారు అంటే అది మీ వలన కాదా, కనీసం కృతజ్ఞత లేకుండా మిమ్మల్ని ఇలా వదిలేయడానికి వాళ్ళకి మనసెలా వచ్చింది? అని సత్యప్రసాద్ ముగ్ధకంఠంతో అన్నాడు.
పిల్లవాడు నెమ్మదిగా దగ్గరకు వచ్చి “సార్, మీరు ఏమి అంటున్నారో నాకు అర్ధం కావడం లేదు” అని అమాయకంగా చూస్తూ దిగులుగా మొహం పెట్టాడు. సత్యప్రసాద్ తడబడుతూ అబ్బే, ఏమీలేదు, సరే ఆలస్యం అయింది. మీకోసం చాలా తినుబండారాలు తెచ్చాను. తీసుకుని తినండి. నేను అప్పుడప్పుడూ వస్తూ ఉంటాను మీరు జాగ్రత్త అని చెప్పి బయటకి వచ్చేసాడు.
మనసులో రగులుతున్న ఎన్నో సందేహాలతో ఆలోచిస్తూ గ్రామం వైపుకి ప్రయాణించాడు సత్యప్రసాద్. తుఫాను రిత్యా గ్రామంలోని పరిస్థితులను సమీక్షించడానికి నిరుపేదలైన కొందరి గుడిసెల వద్ద ఆగి వారి యోగ క్షేమాలని అడిగి తెలుసుకున్నాడు. ఇంటి పైకప్పు చెదిరి మరమ్మత్తు చేస్తూ కనిపించిన యాదగిరి “దేవుడు ఇచ్చిన కూడు కూడా నేలపాలైంది బాబూ” అని ఏడుస్తూ కనిపించాడు.
సత్యప్రసాద్ గుండె కలచివేసింది. ఏమైంది యాదగిరి అని ఆప్యాయంగా అడిగాడు. రాత్రి శ్రావణ్ బాబు ప్రతీ గుడిసె ముంగిట మాకు తినడానికి కావాల్సిన కూడు పెట్టి వెళ్ళాడు. కానీ ఈ రక్కసి తుఫాన్ మా నోటికి అది కూడా అందకుండా నేల పాలు చేసింది అన్నాడు.
బాధపడకు యాదగిరి, మీ కుటుంబానికి కావాల్సిన ఆహారపదార్ధాలు నేను సమకూరుస్తాను అన్నాడు సత్యప్రసాద్. యాదగిరి కృతజ్ఞతతో అతడికి నమస్కరించాడు. అది సరే యాదగిరి, నిన్న రాత్రి శ్రావణ్ ప్రతి గడపలో మీకు కావాల్సిన సరుకులు ఉంచాడు అన్నావు కదా. అప్పుడు నీవు అతడిని చూసావా అని అడిగాడు. యాదగిరి లేదు అన్నట్టు తలను ఊపాడు. అంటే మీలో ఎవరూ శ్రావణ్‌ను చూడలేదా అని చుట్టూ ఉన్న గ్రామస్తులని అడిగాడు. లేదు బాబు అని అందరూ సమాధానం చెప్పారు. సత్యప్రసాద్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకు బాబు అలా అడుగుతున్నారు అని వాళ్ళంతా మళ్ళీ అడిగారు. ఏమీలేదు ఊరికే అడిగాను అని చెప్పి యాదగిరికి కొంత సొమ్ము ఇచ్చాడు. తర్వాత ఆలోచిస్తూ అక్కడి నుండి వచ్చేసాడు.
సత్య ప్రసాద్ దిగులుగా శ్రేయాన్ ఇంటివైపు వెళ్ళాడు. శ్రేయాన్ అతడిని చూసి ఒక్క క్షణంలో బయల్దేరి బయటకు వచ్చాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడిగాడు. ఏమీ లేదు, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అతడిని తీసుకుని అలా మాట్లాడుతూ గ్రామ శివారు ప్రాంతం వైపుకి నడవడం ప్రారంభించారు.
శ్రేయాన్ నీవు ఆరోజు యాక్సిడెంట్ జరిగి తల్లిదండ్రులని కోల్పోయిన పసి పిల్లలకు ఎంతో గొప్పగా ఆదుకున్నావు. ఆరోజు నీ మంచి మనసుకి నేను ఎంతగానో సంతోషపడ్డాను. కానీ ప్రస్తుతం తుఫాన్ పరిస్థితులలో వారు ఎలా ఉన్నారో చూడాలనిపించలేదా, కనీసం ఒక్కసారన్నా వెళ్లి వాళ్ళని చూసావా అని అడిగాడు. అయ్యో లేదు సార్. అయినా ఎందరికో ఎన్నో సార్లు మంచి చేసాను. కానీ నా మంచితనాన్ని గుర్తించే వారే కరువైనారు. కొందరికి నా మంచితనమే అలుసై పోయింది. ఇంక నేను ఎవరికోసం చేయాలి అని శ్రావణ్ యొక్క ఉన్నతిని అతనితో పోల్చుకుంటూ తనకి అన్యాయం జరిగినట్టు వాపోయాడు శ్రేయాన్.

అదిసరే, గ్రామంలో కూటికి లేని నిరుపేదలకు తుఫాన్ నిమిత్తం శ్రావణ్ ఏదైనా సహాయం చేసాడా అని అడిగాడు. అలాంటిది ఏమీ లేదు సర్. చేద్దామనే అనుకున్నాడు కానీ కొన్ని రోజులుగా కరెంట్ లేకపోవడంతో వీడియో తీయడానికి పరికరాలు ఏమీ పని చెయ్యట్లేదు. లేదంటే ఎదో ఒకటి చేసేవాడు. ఇప్పుడు చేసినా ఆ సహాయం వృధాగా పోతుంది కదా అన్నాడు.
సత్యప్రసాద్ కు ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మేసాయి. అంటే పసిపిల్లవాడు అమాయకంతో గ్రహించిన వాస్తవం నేను నా విచక్షణతో తెలుసుకోలేకపోయానా. ఇంతకాలం నేను గర్వంగా చెప్పుకున్నది ఇలాంటి వారికోసమా అని సిగ్గుపడ్డాడు. అంటే గ్రామంలో నిరుపేదలకు సహాయం చేసిన అజ్ఞాత వ్యక్తి, అలాగే ఆ పసిపిల్లలకు సహాయం చేసిన వ్యక్తి బహుశా ఒక్కరే కావచ్చు. అతను ఎవరో ఇప్పుడే తెలుసుకోవాలి అనుకున్నాడు.
శ్రేయాన్ తో మాట్లాడుతూ సరే, నిన్ను ఎవరూ గుర్తించకపోతే లేదు. అలా వెళ్లి వాళ్ళని ఒకసారి చూసొద్దాం, నాతోరా అన్నాడు. అతడు మరో మాట మాట్లాడకుండా సత్యప్రసాద్ వెనుక నడుచుకుంటూ అక్కడకు వెళ్ళారు. సర్, ఏంటి మళ్ళీ వచ్చారు. ఏదైనా మర్చిపోయారా అని పిల్లవాడు సత్యప్రసాద్ ను అడిగాడు. శ్రేయాన్ కలగజేసుకుని ఏంటి సర్, మీరు ఇదివరకే ఇక్కడకు వచ్చారా అన్నాడు. అవును వచ్చాను. ఒక చిన్న విషయం మర్చిపోయాను అందుకే మళ్ళీ వచ్చాను అని చెప్పాడు.
- ఈ కథలను కూడా చదవండి
- ప్రాణం ఖరీదు – Best Self Motivation Story
- ఏది విజయం – Inspiring Stories of Success
- గుప్త నిధి – గుడ్డి లక్ష్యం – Best motivational story in telugu
- క్రోధం – Best motivatonal story in telugu
“ఏంటి సర్ మర్చిపోయారు” అని పిల్లవాడు చుట్టూ చూస్తున్నాడు. అంతలో ఆ అన్నయ మీకు భోజనం తీసుకుని ఏ సమయంలో వస్తాడు అని అడిగాడు సత్యప్రసాద్. సమయం అయింది సర్. ఈ సమయానికి వచ్చెస్తూ ఉంటాడు అని పిల్లవాడు చెప్పాడు. ఎవరికోసం అడుగుతున్నారు సర్ అని ప్రక్క నుండి నెమ్మదిగా అడిగాడు శ్రేయాన్. ఈరోజు నీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అలాగే నేను కూడా అతడిని చూడబోతున్నాను. ఆ గొప్ప వ్యక్తి నా విద్యార్ధులలో ఒకడని ఆనందంతో ఇక్కడకు వచ్చాను కానీ నాకు ఇక్కడ నిరాశ మిగిలింది. కనీసం ఆ వ్యక్తిని చూసాక అయినా నా మనసు కాస్త కుదుటపడుతుందని అనుకుంటున్నాను అన్నాడు.
శ్రేయాన్ సిగ్గుతో తలను దించుకున్నాడు. అంతలో బయట ఏదో అడుగుల శబ్దం వినిపించింది. ఒక వ్యక్తి ఎంతో ఆనందంతో పిల్లలూ అని పిలుచుకుంటూ లోపలకి వచ్చాడు. అక్కడ ఉన్న తన స్నేహితుడు శ్రేయాన్ మరియు ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ ని చూసి ఆశ్చర్యపోయాడు.
సర్ ఏంటి సర్ మీరిద్దరూ ఇక్కడ అని ఆదుర్దాగా ఆడిగాడు. పిల్లవాడు కలగజేసుకుని అన్న ఈ సారు మాకోసం బోలెడన్ని తినుబండారాలను తీసుకువచ్చారు. ఈయన చాలా మంచివారు ఈయన నీకు ముందే తెలుసా అని అడిగాడు.
ఈయన నా గురువు. ఈయన మాటల వలన నాలో ఎంతో పరిపక్వత వచ్చింది. జీవితం యొక్క విలువని తెలుసుకున్నాను, ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నాను అన్నాడు ఆ వ్యక్తి.
తన ఆలోచనలను ఆచరణలో ఒక్క విద్యార్ధి పెట్టినా తన జన్మ ధన్యమైనట్టే అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు సత్యప్రసాద్. ఇప్పుడు తన కళ్ళతో అతడిని నేరుగా చూడటం అతనికి పట్టరాని ఆనందం కలిగింది. ఎందుకంటే అతడు ఎవరో కాదు. తన విద్యార్ధి శ్రీకర్.
సత్యప్రసాద్ వెంటనే మాట కలుపుతూ అది సరే, పిల్లలు నీకోసం చాలా చెప్పారు. కాని నీ పేరు ఏమిటో మాత్రం తెలియదు అన్నారు. వారి వద్ద నీ గురించి దాచడంలో ఆంతర్యం ఏమిటి అని అడిగాడు సత్యప్రసాద్.
సర్, ఏంటి సర్ అన్ని తెలిసి తిరిగి నన్నే అడుగుతారు. నా పేరు నేను అనే ఒక అహాన్ని సూచిస్తుంది. అది చేసిన సహాయానికి ఎప్పుడూ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది. అందుకే నేను నాలోని అహానికి తెలియకుండా ఏదైనా చేయాలని అనుకున్నాను. నేను చేసే మంచి పని ఏదీ దానికి తెలియనివ్వను. మీరు కూడా చెప్పొద్దు సర్, రహస్యంగా ఉంచండి అంటూ నెమ్మదిగా అన్నాడు.
సత్యప్రసాద్ ఒకవైపు అతనిలోని పరిపక్వతకు నివ్వెరపోయి మరో వైపు అతని చమత్కారానికి నవ్వుకున్నాడు. చేసిన మేలు పదిమందితో పంచుకోనిదే దానికి విలువ లేదు అని ఎవరో మహానుభావుడు చెబితే విన్నాను. దాని గురించి ఏమంటావు అంటూ శ్రేయాన్ వైపు చూసాడు.
అయ్యో సర్, నేను దీనిని మేలు అని ఎప్పటికీ అనుకోను. ఇది కేవలం నా స్వార్ధం కోసం చేస్తున్నాను. స్వార్ధం కోసం చేసిన దానిని చెప్పుకుంటే సమాజం హేళన చేస్తుంది అన్నాడు.
సత్యప్రసాద్ కు అతడి ఆంతర్యం అర్ధం కాలేదు. ఏమిటి ఇదంతా నీ స్వార్ధం కోసం చేస్తున్నావా. ఇది స్వార్ధం ఎలా అవుతుంది అని అడిగాడు.
ఎలా అవుతుంది అంటే అని ఆలోచిస్తూ, ఒక్క క్షణం సర్. అయ్యో మాటల్లో పడి పిల్లలకు భోజనం పెట్టడం మర్చిపోయాను అంటూ ప్రక్కకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్లేట్ తీసుకుని అన్నం వడ్డించి పిల్లలు ఇద్దరికీ చెరో ముద్ద తినించాడు.
పిల్లలు తమ ఆకలి గురించి మర్చిపోయారు. అతడు అందిస్తున్న ఆప్యాయత, అనురాగాల గోరుముద్దలకు వారి కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అతని పట్ల ప్రేమ అందులో మెరుపు వలె ప్రకాశిస్తూ వారి కళ్ళు ఏదో తెలియని ఆకర్షణతో ఈ ప్రపంచాన్ని మైకంలో నేట్టేస్తున్నాయి.
అతడు ఆ మైకంలో లీనమైపోతూ తనను తాను మైమరచిపోతున్నాడు. అంతా గమనిస్తున్న సత్యప్రసాద్ శ్రీకర్ అసలు నీకు ఏమైంది ఎందుకు అలా స్తంభించిపోయావు అని అడిగాడు.
ఒక్కసారి ఇలా వచ్చి చూడండి సర్ అని అతడు పిలిచాడు. సత్యప్రసాద్ ఏదీ అర్ధం కాక శ్రీకర్ ప్రక్కన కూర్చున్నాడు. చెప్పు శ్రీకర్ ఏమైంది అని అడిగాడు. ఒక్కసారి ఈ పసిపిల్లల కళ్ళలోకి చూడండి సర్ అని అతడు అన్నాడు.
సత్యప్రసాద్ నోట మాట రాకుండా అలా చూస్తూ “నిజంగా ఇది అద్భుతం. ఇంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరేదీ లేదు” అన్నాడు. అలా అయితే ఇప్పుడు చెప్పండి. ఇదంతా చేస్తున్నది నా స్వార్ధం కోసం కాదంటారా, ఇంత ఆనందాన్ని కోరుకోవడం స్వార్ధమే కదా అన్నాడు.
సత్యప్రసాద్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. శ్రీకర్ భుజాలను పట్టుకుని గర్వపడుతూ ఎదుటి వ్యక్తి ఆనందంలో తమ ఆనందాన్ని చూడగలగడం నిజంగా దైవలక్షణం. అది సంపాదించిన క్షణం ఈ ప్రపంచం అంతా ఆనందమయం. అతడికి ఆనందం తప్ప మరేదీ లేదు. అతడికి ఈ ప్రపంచంతోనూ, పేరు ప్రఖ్యాతుల తోనూ దేనితోనూ సంబంధం లేదు. నువ్వు దానిని సాధించావు. నిజంగా నీవు ఎంతో అదృష్టవంతుడవు అన్నాడు సత్యప్రసాద్.
సర్, దయచేసి నన్ను అంత గొప్పవాడిని చేయకండి. దానం, సహాయం ఒక చేతితో చేస్తే మరో చేతికి తెలియకూడదు అని మీరు చెప్పిందే చేశాను. అందులో నా గొప్పతనం ఏదీ లేదు అన్నాడు శ్రీకర్.
సత్యప్రసాద్ కలగజేసుకుని అవును తుఫాన్ కాలంలో గ్రామంలోని పూరి గుడిసెల ముంగిట్లో వాళ్ళ ఆకలి తీర్చేందుకు అర్ధరాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. అది కుడా నువ్వేనా అని సరదాగా అడిగాడు.
సర్, నెమ్మదిగా మాట్లాడండి. నాలోని వాడు వినేస్తాడు అని అన్నాడు. ఒక్కసారి ఇద్దరూ పెల్లున నవ్వుకున్నారు. తాత్వికమైన ఈ చర్చ అర్ధం కాని పిల్లలు తమకు ఇష్టమైన వాళ్ళ నవ్వులో వాళ్ళ నవ్వుని కూడా కలిపేసారు.

అంతా గమనిస్తున్న శ్రేయాన్ సత్యప్రసాద్ చేతులు పట్టుకుని సర్ నన్ను క్షమించండి. చేసిన మంచిని సమాజం గుర్తించలేని నాడు చేయడమే వృధా అనుకున్నాను. కాని ఇక్కడకు వచ్చాక నేను ఎంత పొరపాటు పడ్డానో అర్ధం అయింది.
ఆరోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను మరియు శ్రావణ్ అక్కడే ఉన్నాము. అప్పుడు నేను కనీసం అంబులెన్స్ కు ఫోన్ చేసి చెప్పాలని ప్రయిత్నించినా మనకెందుకు అని నన్ను బలవంతంగా లాక్కెళ్ళాడు. సరిగ్గా అప్పుడే శ్రీకర్ రావడం చూసాను. అతడు వాళ్ళని స్వయంగా తన చేతుల మీద హాస్పిటల్ కి చేర్చాడు. వారి ప్రాణాల కోసం శాయశక్తులా ప్రయత్నించాడు. వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన తర్వాత అంతా తానే అయ్యి అంత్యక్రియలు జరిపించాడు. అక్కడ మేము చేసింది కేవలం ఉడుత సాయం. మా గొప్పతనం పేరు ప్రతిష్టలు వీడి కాళ్ళ గోరుకి కూడా సరిపోవు అని శ్రీకర్ ని ప్రేమతో హత్తుకున్నాడు.
శ్రేయాన్ లో వచ్చిన మార్పుకి సత్యప్రసాద్ చాలా ఆనందించాడు. తర్వాత శ్రీకర్ వైపు చూసి పిల్లలను నాకు తెలిసిన ఒక మంచి స్కూల్ ఉంది అక్కడ చేర్పిద్దాం. అక్కడ అన్ని వసతులతో పాటు వాళ్ళకి ఏ లోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏమంటావు శ్రీకర్ అని అడిగాడు. సర్, చాలా థాంక్స్. వాళ్ళ భవిష్యత్తుకి ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అన్నాడు. నన్ను కూడా ఎదో ఒకటి చేయనివ్వండి. వాళ్ళకోసం ఎదో ఒకటి చేసి నా తప్పుని సరి దిద్దుకుంటాను అన్నాడు శ్రేయాన్. సత్యప్రసాద్ చిరునవ్వు నవ్వాడు.
శ్రేయాన్ ఎదురుగా వచ్చి సర్ నాకు ఒక సందేహం. మరి ఇప్పుడు శ్రావణ్ సంగతి ఏంటి. వాడు జనాన్ని అలా మోసం చేయడం గురించి ఏమిచేద్దాం. ఇప్పుడు సమాజ సేవ చేస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ అంతా బూటకం. కెమెరా ముందు ఒకలా వెనుక ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పాడు.
చూడు శ్రేయాన్ ప్రజలకు ఎలా ప్రేమించాలో తెలుసు, ఎలా ద్వేషించాలో కూడా తెలుసు కానీ ఎలా ఆలోచించాలో తెలియదు. పెద్ద పెద్ద పాలకుల నుండి చిన్ని చిన్న బురిడీ గాళ్ళ వరకు వారి గారడీలకు ప్రజలు ఎప్పటికీ దాసోహమే. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది అన్నాడు.
వాహ్! అదరగొట్టేసారు సర్. వాళ్ళ సంగతి ఏమోగాని మేము మాత్రం ఎప్పటికీ మీకు దాసోహం అయ్యాం అని మోకాళ్ళ మీద కుర్చుని నమస్కరించాడు శ్రీకర్. అందరూ ఒక్కసారిగా నవ్వారు.