వక్రీకరణ
best inspiring stories in telugu 2021
స్కూల్ ప్రాంగణంలో పిల్లలందరూ ఒక విద్యార్ధి కోసం చర్చించుకుంటున్నారు. పిల్లలు మాత్రమే కాదు, స్కూల్ ఉపాధ్యాయులు సైతం అదే విద్యార్ధి కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు. అతడు ఆరోజే కొత్తగా స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. అడ్మిషన్ తీసుకుని ఇంకా రెండు గంటలు గడవక ముందే స్కూల్ మొత్తం ఆ విద్యార్ధి గురించి చర్చలతో మారు మ్రోగిపోయింది.
ఆరోజు అతను మొదటి సారిగా తన క్లాసులోకి అడుపెడుతున్నాడు. అతనికి తెలుసు, ఆ స్కూల్‌లో అందరూ అతనికి ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తున్నారని. అయినా అతనిలో ఇసుమంత గర్వం కూడా లేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, అపరిమితమైన వినయంతో ఆ విద్యార్ధి క్లాస్ రూమ్ ద్వారం దగ్గర నిలిచి క్లాసులో పాఠం చెబుతోన్న ఉపాధ్యాయునికి లోపలికి అనుమతించమని కోరాడు.
క్లాసు రూమ్ అంతా నిశ్శబ్ధం ఆవరించింది. ఉపాధ్యాయుడు అతడిని చూసి ఆశ్చర్యపడుతూ పిల్లల వైపుకి చూసాడు. అందరూ బిక్క మొహం వేసుకుని ఉపాధ్యాయుని వంక చూసారు. ఉపాధ్యాయుడు ఆ విద్యార్ధి వైపుకి తిరిగి నెమ్మదిగా కళ్ళజోడు తీస్తూ లోపలికి రమ్మన్నట్టు సైగ చేసాడు.

అతడు తన ముఖంలో చిరునవ్వుతో సంతోషంగా లోపలికి అడుగుపెట్టాడు. నల్ల బల్ల దగ్గర నిలుచుని మొదటిసారిగా తన తరగతి గది మొత్తం చూసుకున్నాడు. తర్వాత అతను కూర్చోవాల్సిన బల్ల కోసం వెతుకుతూ కళ్ళు త్రిప్పాడు. మొదటి వరుసలో కూర్చున్న ఇద్దరు విద్యార్ధులు నెమ్మదిగా తమ పుస్తకాలు, వస్తువులను తీసుకుని వెనుక బల్లలకు సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోయారు.
అతడు వాళ్ళను చూస్తూ కృతజ్ఞత తెలుపుతున్నట్టు కళ్ళను కదిపాడు. తర్వాత వినయంతో వెళ్లి ముందు వరుసలో కూర్చుని ఇక క్లాసుని ప్రారంభించండి అన్నట్టు ఉపాధ్యాయుని వంక చూసాడు. ఉపాధ్యాయుడు తడబడుతూ కళ్ళజోడు పెట్టుకుని క్లాసుని ప్రారంభించాడు. అతడు చెబుతున్న ప్రతీ అంశాన్ని ఆ విద్యార్ధి వినయంగా తన పుస్తకంలో రాసుకుంటున్నాడు.

కాసేపట్లో క్లాసు ముగిసింది. ఉపాధ్యాయుడు తన కళ్ళజోడు సందులోంచి ఆ విద్యార్ధిని చూస్తూ బయటకు వెళ్లేందుకు పుస్తకాలను సర్దుకున్నాడు. ఆ విద్యార్ధి ఉపాధ్యాయుడిని చూసి చిన్నగా నవ్వాడు. ఉపాధ్యాయుడు చేయి జారిన పుస్తకాలను గబగబా సర్దుకుని క్లాసు రూమ్ బయటకు వేగంగా నడిచాడు.
మళ్ళీ క్లాసు రూమ్ నిశ్శబ్దంగా మారిపోయింది. అతడితో సరదాగా మాట్లాడటానికి అక్కడ ఎవరూ లేరు. అది అతనికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ అతను ప్రత్యేకమైన వాడు కనుక అలాంటి విషయాలు ఎంతో తేలికగా తీసుకోవాలి అనుకున్నాడు.
ఐదు నిముషాలలో మరో ఉపాధ్యాయుడు ఆ క్లాసుకి వచ్చాడు. పిల్లలందరూ గౌరవంతో లేచి స్వాగతం చెప్పారు. వారితో పాటుగా అతడు కూడా లేచి నిల్చున్నాడు. ముందు వరుసలో ఉన్న అతడిని ఉపాధ్యాయుడు గుర్తించాడు. వెంటనే అందర్నీ కూర్చోమని చెప్పాడు. అందరూ కూర్చున్నారు. తర్వాత ఉపాధ్యాయుడు ఆ విద్యార్ధి వైపు చూసి లేచి నిల్చోమని చెప్పాడు.

ఉపాధ్యాయుడు చెప్పినట్టు అతడు గౌరవంతో చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఉపాధ్యాయుడి తదుపరి ప్రశ్న కోసం సమాధానం చెప్పడానికి సిద్దపడుతూ అతడు ఉపాధ్యాయుని వైపు చూసాడు. ఉపధ్యాయుడు అతడిని పట్టించుకోకుండా కుర్చీలో కూర్చుని తన చేతిలోని పుస్తకాన్ని పేజీలు త్రిప్పుతూ చదువుతున్నాడు. తర్వాత నల్ల బల్ల వద్ద నిల్చుని యథా విధిగా పాఠం చెప్పడం ప్రారంభించాడు.
గంట సమయం గడిచింది. బయట లంచ్ బెల్ మ్రోగింది. ఉపాధ్యాయుడు పుస్తకాన్ని తీసుకుని బయటకు నడిచాడు. కదలకుండా నిల్చోవడం వలన ఇబ్బంది పడుతూ ఉన్న ఆ విద్యార్ధి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని సేదతీరుతూ బల్లపై కూర్చున్నాడు.

తర్వాత పిల్లలు అందరూ పుస్తకాలు సర్దుకుని చేతిలో క్యారేజీలతో భోజనానికి సిద్దమయ్యారు. అతనితో మాట్లాడటానికి అక్కడ ఎవరూ సముఖంగా లేరని గ్రహించిన ఆ విద్యార్ధి ఒక ప్రక్క ఒంటరిగా కూర్చుని తన భోజనం ముగించాడు.
కాసేపట్లో మళ్ళీ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ క్లాసులో అయినా చక్కగా నోట్సు రాసుకోవచ్చని అనుకుని పుస్తకం బయట పెట్టుకుని ఉపాధ్యాయుని కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. అంతలో ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చాడు. పిల్లలు అందరూ లేచి నిలుచున్నారు. ఉపాధ్యాయుడు మొదటి వరుసులో ఉన్న అతడిని చూసాడు. వెనుక వరుసలో కూర్చున్న ముగ్గురు విద్యార్ధుల వైపు చూసి ముందుకు రమ్మని పిలిచాడు.

పుస్తకాలు సర్దుకుని ముగ్గురు విద్యార్ధులు ముందుకు వచ్చారు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మాత్రమే నా ఎదురుగా కూర్చోవాలి అంటూ అతడిని చిట్టచివరి బల్ల వద్దకు వెళ్లి నిల్చోమన్నాడు. అతడు నెమ్మదిగా తన పుస్తకాలను తీసుకుని చిట్టా చివరి టేబుల్ వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చున్నాడు,
Best inspiring stories in telugu 2021
- ఈ కథలను కూడా చదవండి
- మరచిపో నేస్తమా – Heart touching story with moral
- ధర్మ సంకటం – An unconditional love of a father
- సాలిగ్రామ యోధుని కథ – A warrior of self confidence
ఆ రోజు జరిగిన క్లాసులు అన్నీ అలా అతడికి ప్రతికూలంగానే జరిగాయి. కొందరు ఉపాధ్యాయులు అతడి ప్రవర్తన మీద హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తోటి విద్యార్ధులు అతడితో మాట్లాడేందుకు ఎవరూ సముఖంగా లేరు. మరికొంత మంది విద్యార్ధుల అతడిని స్కూల్ నుండి తొలగించమని, అతడు క్లాసులో ఉంటే తమ చదువులు పాడవుతాయి అనే అభ్యర్ధనలు వెల్లువెత్తాయి.

చివరిగా క్లాసు చెప్పిన ఉపాధ్యాయుడు నేరుగా హెడ్ మాస్టర్ వద్దకు వెళ్ళాడు. ఏడాది కాలంలో నాలుగు స్కూళ్ళ నుండి బహిష్కరించబడిన వ్యక్తిని తమ స్కూల్‌లో మీరు ఎందుకు చేర్చుకున్నారో ఎవరికీ అర్ధం కావట్లేదని, అలా తీసుకున్న నిర్ణయం వలన స్కూల్ పేరు ప్రతిష్టలు చెడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అలాగే తక్షణమే పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా హెడ్ మాస్టర్ వద్ద విలపించాడు.
హెడ్ మాస్టర్ బాగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించడానికి స్కూల్ విడిచిపెట్టే ముందు ప్రాంగణంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించాడు. విధ్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు అందరినీ ఆ సమావేశానికి హాజరు అవ్వమని హుకుం జారీ చేసాడు.
హెడ్ మాస్టర్ చెప్పినట్టు అందరూ స్కూల్ ప్రాంగణానికి చేరుకున్నారు. హెడ్ మాస్టర్ ఒక ఎత్తైన ప్రదేశంలో నిల్చుని ఆరోజు వచ్చిన ఫిర్యాదుల గురించి ప్రసంగిస్తూ, ఆ విద్యార్ధిని ఎదురుగా వచ్చి నిల్చోమన్నాడు. మొదటి రోజే బహుశా ఈ స్కూల్ నుండి నన్ను బహిష్కరిస్తున్నారు కాబోలు అని మనసులో అనుకుంటూ భయం భయంగా ఆ విద్యార్ధి హెడ్ మాస్టర్ వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

హెడ్ మాస్టర్ ఆ విద్యార్ధి వైపు చూసి నీ మీద ఈ ఒక్క రోజులో వందకు పైగా ఫిర్యాదులు అందాయి. నిన్ను ఈ స్కూల్ నుండి బహిష్కరించమని ఇక్కడ చాలా మంది కోరుకుంటున్నారు. కాబట్టి నేను అడిగినదానికి సూటిగా సమాధానం చెప్పు అన్నాడు. ఆ విద్యార్ధి భయంతో వణికిపోతూ వినయంగా సరే అన్నట్టు తలను ఊపాడు.
హెడ్ మాస్టర్ తనలో తాను ఎదో ఆలోచించుకుని “సరే, నిన్ను గడిచిన ఏడాది కాలంలో వేర్వేరు స్కూళ్ళ నుండి ఎన్ని సార్లు బహిష్కరించారు?” అని ప్రశ్నించాడు. వెంటనే నాలుగు సార్లు అని అతడు సమాధానం చెప్పాడు. పిల్లలందరూ ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నారు. తక్షణమే ఈ స్కూల్ నుండి కూడా బహిష్కరించండి అన్నట్టు మిగిలిన ఉపాధ్యాయులు గుర్రుగా చూస్తున్నారు.
- ఈ కథలను కూడా చదవండి
- క్రోధం – Best motivatonal story
- గుప్త నిధి – గుడ్డి లక్ష్యం- Best motivational story
- ఏది విజయం – Inspiring Stories of Success
- ప్రాణం ఖరీదు – Best Self Motivation Story
హెడ్ మాస్టర్ అతడి వైపు చూసి సరే, అయితే మొదటిసారిగా స్కూల్ నుండి నిన్ను ఎందుకు బహిష్కరించారో చెప్పు అన్నాడు. “సార్, నేనొక అనాధని. ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గడప గడపకు పేపర్ వేస్తాను. తర్వాత ఇంటికి వచ్చి ఎంతో త్వరగా బయల్దేరి స్కూల్‌కి వెళ్ళేవాడిని. కానీ చాలా సార్లు సమయానికి స్కూల్‌కి చేరుకోలేక పోయేవాడిని. చివరికి ఒకరోజు స్కూల్ వారి క్రమ శిక్షణ చర్యలలో భాగంగా నన్ను అక్కడ నుండి బహిష్కరించారు. తర్వాత సమయాన్ని సర్దుబాటుకు అనుమతించిన ఒక ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయ్యాను అన్నాడు.

హెడ్ మాస్టర్‌కు అతడిపై జాలి వేసింది. చుట్టూ ఉన్న మిగిలిన విద్యార్ధుల వైపు చూసాడు. అందరూ ఎదో పొరపాటు పడినట్టు తలలు దించుకున్నారు. హెడ్ మాస్టర్ తిరిగి అతడి వైపు చూసి “సరే, రెండో స్కూల్ నువ్వు కోరుకున్నట్టే ఉంది కదా. మరి వాళ్ళు నిన్ను ఎందుకు భహిష్కరించారో చెప్పు” అన్నాడు.
ఆ విద్యార్ధి చేతులు కట్టుకుని వినయంగా “ఆ స్కూల్ నేను కోరుకున్నట్టు అంతా బాగానే ఉంది సర్. కానీ నా అరకొర సంపాదనతో అక్కడ ఫీజులను సమయానికి చెల్లించలేకపోయాను. కాస్త సమయం ఇస్తే ఎలాగైనా చెల్లిస్తాను అని వారిని ప్రాధేయపడ్డాను. కానీ స్కూల్ యాజమాన్యం నాకు మరో అవకాశం కూడా ఇవ్వకుండా టీసీ ఇచ్చి పంపేసారు. అయినా నాకు పెద్దగా బాధ అనిపించలేదు. ఎందుకంటే అక్కడ రోజంతా క్లాసులో రేపు కట్టాల్సిన ఫీజుల కోసమే ఆలోచనలు. ఇంకా ఇక్కడ నేను ఎలా ప్రశాంతంగా చదువుకోగలను సర్. అందుకే ఈసారి సమయంతో పాటు ఫీజులు కూడా నాకు అనుకూలంగా ఉన్న మరో స్కూల్ వెతుక్కుని అక్కడ చేరాను” అన్నాడు.
ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. హెడ్ మాస్టర్ మాత్రం ఆ నిరుపేద అనాధకు చదువు మీద ఉన్న శ్రద్దకు ఆశ్చర్యపోయాడు. “మరి అంతా బాగానే ఉంది కదా, మరి మూడో స్కూల్ నుండి నిన్ను ఎందుకు భహిష్కరించారు” అని హెడ్ మాస్టర్ అతడిని ఆదుర్దాగా అడిగాడు.

“అప్పటి వరకు ఫీజులు కట్టడానికి పడిన ఆందోళనలు అన్నీ తొలగిపోయి ఆ స్కూల్‌లో సంతోషంగా అడుగు పెట్టాను. అక్కడికి కొన్ని రోజులలో పరీక్షలు వచ్చాయి. మొదటి రెండు స్కూళ్ళలో జరిగిన జాప్యాల కారణంగా ఆ పరీక్షలలో యాజమాన్యం ఆశించిన స్థాయిలో నేను ర్యాంకులు సంపాదించలేకపోయాను.
తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం నన్ను పిలిపించి నీకు ఫీజులు తక్కువ తీసుకుని, ఇటువంటి పరపతి కలిగిన పెద్ద స్కూల్‌లో తీసుకున్నది నీ మీద జాలితో అనుకున్నావా, లేదా ఇదేమైన సత్రం అనుకున్నావా, నీ తెలివి తేటలకు నువ్వేదో మా స్కూల్‌కి ర్యాంకులు తెచ్చి పెడతావు అనుకున్నాము. మా అంచనా తప్పు అయింది. ఇక నీతో మాకు ఎటువంటి ఉపయోగం లేదు అంటూ వాళ్ళు కూడా టీసీ ఇచ్చి పంపేసారు సర్ అన్నాడు ఆ విద్యార్ధి.
హెడ్ మాస్టర్ గుండె బరువెక్కిపోయింది. చుట్టూ ఫిర్యాదులు చేసిన ఉపాధ్యాయుల వైపు చూసాడు. అందరూ తమ పొరపాటుకు తలలు దించుకుని పశ్చాత్తాపంతో హెడ్ మాస్టర్ వైపు చూసారు. హెడ్ మాస్టర్ ఆ విద్యార్ధి భుజం మీద ప్రేమగా చేయి వేసి మరి నాలుగో స్కూల్ నుండి ఎందుకు భహిష్కరించారు అని అడిగాడు.
ఆ విద్యార్ధి నాలుగో స్కూల్ కోసం చెప్తూ, సర్ గడిచిన మూడు స్కూళ్ళలో ఎదుర్కున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురుపడకుండా నెల రోజుల పాటు తిరిగి నాకు సరిపడే ఒక మంచి స్కూల్ కనుగొన్నాను. నేను కోరుకున్నట్టే ఆ స్కూల్ నాకు అద్భుతంగా అనిపించింది. గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఏవీ అక్కడ నాకు కనిపించలేదు. ఇక సంతోషంగా అక్కడే చదువుకోవచ్చు అనుకున్నాను. నెల రోజుల సమయం అంతా సజావుగా సాగింది.

తర్వాత ఒక రోజు స్కూల్‌లో ఎదో సమస్య. నేను ఆరోజు యథాప్రకారం స్కూల్‌కి వెళ్లి సంతోషంగా క్లాసులు వింటున్నాను. అంతలో స్కూల్ ఆఫీసులో అత్యవసరంగా జరుగుతున్న ఉపాధ్యాయుల సమావేశానికి నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళాక నన్ను భహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసారు” అన్నాడు.
హెడ్ మాస్టర్ ఆశ్చర్యపడుతూ “నిన్ను ఎందుకు భహిష్కరిస్తారు. ఆ సమస్యకు నువ్వు ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా ఎదైనా కారణమా?” అని అడిగాడు. “లేదు సర్, నాకు ఆ సమస్యకు ఏ సంబంధం లేదు. కానీ అప్పటి నుండి నా గత చరిత్ర నా జీవితానికి శాపంగా మారిపోయింది. వాళ్ళు ఆ సమావేశంలో నా గత చరిత్ర ఆధారంగా నా ప్రవర్తనను అంచనా వేసి నన్ను అక్కడి నుండి బహిష్కరించారు. మొదటి మూడు స్కూళ్ళలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం వెతకొచ్చు కానీ నాలుగో స్కూల్‌లో ఎదురైన అనుభవం జీవితకాలం నన్ను నీడలా వెంటాడుతుంది. ఇప్పుడు ఈ స్కూల్‌లో కూడా నాకు చదివే యోగం లేకుండా చేస్తోంది అదే కదా సర్” అని దీనంగా హెడ్ మాస్టర్ వైపు అతడు చూసాడు.

ఆ పిల్లవాడి మాటలకు హెడ్ మాస్టర్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దూరంగా చూస్తున్న ఉపాధ్యాయులు అతడి మాటలకు చలించిపోయారు. హెడ్ మాస్టర్ కళ్ళజోడు తీసి కళ్ళను తుడుచుకుని తిరిగి సర్దుకున్నాడు. తర్వాత అతని తలపై నిమురుతూ “లేదు, నువ్వు ఇక్కడే చదువుకుంటావు, ఇక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు” అన్నాడు. ఆ విద్యార్ధి కళ్ళలో ఒక వెలుగు ప్రత్యక్షమైంది. నిజంగానా అని ఆశ్చర్యపడుతూ హెడ్ మాస్టర్ కాళ్ళకు నమస్కరించాడు.
అంతలో మిగిలిన విద్యార్ధులు అంతా అతని దగ్గరకి వచ్చి క్షమాపణ కోరారు. అతడితో స్నేహం చేసేందుకు గుంపులు గుంపులుగా వచ్చి చుట్టూ గూమిగూడారు.

హెడ్ మాస్టర్ మిగిలిన ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు “చూడండి గతాన్ని మాత్రమే ఆసరాగా చేసుకుని ఒకరి ప్రవర్తనని పూర్తిగా నిర్ణయించలేము. అందులో ఎన్నో సున్నితమైన అంశాలు దాగి ఉండొచ్చు. ఒకవేళ అతని ప్రవర్తన సరైనది కాకపోయినా దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మన అందరికీ ఉన్నది. శిల్పాన్ని చెక్కమని మరో శిల్పాన్ని మనకి ఎవరైనా ఇస్తారా? రాయిని శిల్పంగా చేక్కితేనే కదా అది శిల్పకళ అవుతుంది” అన్నాడు. ఉపాధ్యాయులందరూ సిగ్గుతో తల దించుకున్నారు.