గెలుపు – ఓటమి:-
key to success in life
కిరణ్ రాథోడ్ ఒక మొండి మనిషి, అతని జ్ఞాన పరిధిలో ఉన్న విషయాన్ని ఎంతో ఖచ్చితమైనదని విశ్వసిస్తాడు. అంతేకాకుండా అతను గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి కావడంతో అతనితో వాదనలో నెగ్గిన వారు ఈ భూమి మీద లేరు అనే గర్వంతో ఉండేవాడు. ఒకసారి తన కాలేజీ రోజుల్లో తోటి విద్యార్ధితో ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఏకపక్షమైన వాదన చేసాడు. అదృష్టవశాత్తు అతని చుట్టూ అతని వంటి స్వభావికులు ఎక్కువగా ఉండటం వలన ఆ వాదనలో తనకు తానే నెగ్గినట్టు ప్రకటించుకుని కొంతమంది విద్యార్ధుల అనుకూల మద్దతును కూడగట్టుకున్నాడు. అప్పటితో అతనిలోని అహం భావన మరింత పెచ్చుమీరింది. అటుపైన అతనికి తెలిసిన విషయాలతో పాటు తెలియని విషయాలపై కూడా వాదనలు చేయడం ప్రారంభించాడు. జన ప్రాచుర్యం వస్తూ ఉండటంతో కిరణ్ చేస్తున్న గుడ్డి వాదనలకు కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అతను అంచెలంచెలుగా ప్రాచుర్యం పొందుతూ ప్రఖ్యాత విమర్శకుడిగా మీడియా దృష్టిని సైతం ఆకర్షించగలిగాడు.

“సాధారణంగా మనిషి అతని జీవితంలో ఎదగడానికి వేసే మొదటి అడుగులు ఎంతో క్లిష్టమైనవి. మొదట్లో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కుని ధృడంగా ఎదురు నిల్చి పోరాటం చేసినవాడు శిఖరాగ్రాలకు చేరగలుగుతాడు. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించిన జనాదరణ విషయానికి వస్తే ప్రారంభంలో అతని చర్యలను లేదా అభిప్రాయాలను జనంలోకి తీసుకెళ్లడం ఎంతో క్లిష్టమైన పరిణామం. తర్వాతి క్రమంలో అతని పరివర్తనము ఎలా ఉన్నప్పటికీ అతనికి ఉన్న అసాధారణమైన ప్రాచుర్యం దృష్ట్యా ప్రజలు అతన్నే అనుకరిస్తూ ఉంటారు”.
కిరణ్ రాథోడ్ క్రమేపి జాతీయ న్యూస్ చానెళ్ళలో సైతం ఒక వెలుగు వెలిగాడు. వివాదస్పదమైన చర్చలు అన్నింటిలోనూ అతను తనదైన శైలిలో వాదనలు చేస్తూ ఒకవైపు ప్రసార మాధ్యమాలకు మరోవైపు తన వ్యక్తిగత ఆదాయానికి కాసుల వర్షం కురుపించాడు. ఎక్కడ వివాదాస్పదమైన వాదనలు జరుగుతాయో అవే తన ఎదుగుదలకి పునాదులు అని అతను భావించాడు. అందుకు ప్రమాణంగా తన గతానుభవం నుండి ఎన్నో విషయాలను సునిశితంగా గమనించాడు. తక్షణమే ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకోవాలన్న తలంపుతో దేశంలోని ప్రతిష్టాత్మకమైన కొందరి వ్యక్తుల జాబితాని సేకరించాడు.

కిరణ్ తన అసాధారణ ప్రాచుర్యంతో ప్రసార మాధ్యమాలు అన్నిటినీ సంప్రదించి ఇంటర్వ్యూల ద్వారా ప్రముఖమైన వ్యక్తులే లక్ష్యంగా వారిపై విమర్శలు చేయడం ప్రారంభించాడు. దానికి ప్రతిగా కొందరు ప్రముఖులు అతని వాఖ్యలకు ప్రతిస్పందించడం ప్రారంభించారు. కిరణ్ తను కోరుకున్నట్టే అంతా జరుగుతోంది అని భావించి వారితో ప్రత్యక్ష్య చర్చలకు సవాళ్ళు విసిరాడు. నేరుగా ప్రశ్నించడం, ముక్కు సూటితనం, సరికొత్త వ్యక్తిత్వం, అనే అంశాల ప్రాతిపదికన ప్రజలను తన వైపు ఆకర్షించుకోవాలన్న తపనతో ఎదుటివారి వ్యక్తిగత జీవితాలను సైతం దూషిస్తూ చేస్తున్న అతని ప్రయాణానికి ఎవరూ ఎదురు నిలవలేకపోయారు.

జాతీయ స్థాయి ప్రాచుర్యంతో సంతృప్తి చెందని అతని అహం అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాలన్న తపనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన ఒక ప్రముఖ వ్యక్తితో వివాదానికి పావులు కదిపాడు. అతని మీద తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా మాత్రమే ముఖాముఖి ప్రత్యక్ష వాదనలకు అవకాశం లభిస్తుందని, తర్వాత సులభంగా ప్రపంచ వ్యాప్తంగా తనపేరు మారు మ్రోగిపోతుందని భావించిన కిరణ్ అదేపనిగా ఆ వ్యక్తిపై విమర్శలు చేయడం ప్రారంభించాడు.
కిరణ్ రాథోడ్ ఈ ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అయ్యాడనే చెప్పవచ్చు. కొన్ని మీడియా ప్రసారాల ద్వారా కిరణ్ వాఖ్యలను వీక్షించిన ఆ ప్రముఖ వ్యక్తి అతనే స్వయంగా కిరణ్‌తో పరస్పర వాదోపవాదాల కోసం ఒక వేదిక ఏర్పాటును నిర్దేశించాడు. విషయం తెలుసుకున్న కిరణ్ చాలా సంతోషించి రాబోయే పేరు ప్రఖ్యాతిల గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు ప్రణాళికలు ఎన్నో చేసుకున్నాడు.
కిరణ్ తాను ఎన్నాళ్ళగానో కోరుకున్న సమయం రానే వచ్చింది. ప్రపంచం మొత్తం వీక్షిస్తుండగా ఆ ప్రముఖ వ్యక్తితో ముఖాముఖీ భేటీ. ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితిలోనూ వృధా చేయకూడదు అని భావించిన కిరణ్ తన విమర్శలను పెచ్చు స్థాయికి తీసుకెళ్లాలని భావించాడు.

అది ఒక భారీ వేదిక. ప్రత్యక్షంగా వేల మంది ఆ ప్రాంగణంలో కూర్చుని ఉన్నారు. ఆ వేదిక మీద ఆ ప్రముఖ వ్యక్తి ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. అంతర్జాతీయ మీడియా చానెళ్ళ వారు చుట్టూ ప్రసారాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. పట్టరాని ఆనందంతో కిరణ్ వేదిక మీదకి వెళ్తూ, తను ఎంత గొప్పవాడిని అనుకుంటూ అంతః గర్వంతో మొదటి అడుగుగా ఆ వ్యక్తిని చులకన చేసే భంగిమలో కూర్చుని చర్చను ప్రారంభించాడు.

కిరణ్ తన వాక్చాతుర్యంతో తనదైన శైలిలో నెమ్మదిగా విమర్శలను గుప్పించడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఆ విమర్శలను ఎంతో సున్నితంగా స్పందిస్తూ సమాధానం చెప్తూ ఉన్నారు. కిరణ్ అడిగే ప్రతీ ప్రశ్నకు అతని వద్ద సమాధానం ఉంటోంది. పరిస్థితి అదుపుతప్పుతూ ఉండటం వలన కిరణ్ పరిస్థితిని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు నేరుగా వ్యక్తిగతమైన విమర్శల దాడిని ప్రణాళికలో భాగంగా ప్రారంభించాడు. కిరణ్ ప్రయత్నం ఫలించింది. అతని అభిమానులు అంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. సభా ప్రాంగణం ఎంతో ఉత్కంటభరితంగా మారిపోయింది. కిరణ్ కోరుకున్న క్షణాలు అవే. అతనిలోని ఆత్మ విశ్వాసం మరింత పతాక స్థాయికి చేరుకుంది. ఆ ప్రోద్భలంతో కిరణ్ అంచెలంచెలుగా విమర్శనాస్త్రాలను మరింత ఘాటుగా సంధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

దాదాపు రెండు గంటలపాటు ఆ ప్రముఖ వ్యక్తితో జరిగిన సంభాషణలో కిరన్ ఎంతో సంతృప్తికరంగా ఉన్నాడు. అతను కోరుకున్న దానికంటే మరింత పైచేయి సాధించనన్న విశ్వాసంతో చర్చను ముగించి బయటకు వచ్చాడు. బయట ప్రాంగణం అతని అనుచరులతో కోలాహలంగా ఉంది. అతనితో ఫోటోలు దిగేందుకు కొందరు ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కిరణ్ మరింత గర్వంతో రాబోయే తన ఖ్యాతిని గురించి తలచుకుంటూ ఇంటికి బయల్దేరాడు.
రెండు రోజుల్లో కిరణ్ ఆ ప్రముఖ వ్యక్తితో జరిపిన చర్చ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అది కిరణ్ ఊహించిన దానికంటే వందలరెట్లు. కిరణ్ సంతోషానికి అంతులేదు. స్థానిక మీడియా సంస్థల నుండి డిబేట్ల కోసం మరిన్ని ఆహ్వానాలు అందడం ప్రారంభమయ్యాయి.

తమిళనాడు శివారు ప్రాంతం
అది ఒక విశాలమైన ప్రదేశం. అక్కడ ప్రతీ వ్యక్తీ తమ జీవితాన్ని ఏంతో అందంగా మలచుకోవాలని దృఢమైన ఆత్మ స్థైర్యంతో నిశ్చలంగా ఉన్నారు. అక్కడ కనిపించేది అంతా ఆనందమే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఎంతో చింతిస్తూ, తీవ్రమైన ఆలోచనతో దిగులుగా ఉన్నాడు. అతని పేరు రామానుజన్. ఎంతో సున్నితమైన మనస్తత్వం కలవాడు. అతను నెమ్మదిగా నడుచుకుంటూ ఒక విశాలమైన వెదురు గుడిసె లోనికి వెళ్ళాడు. అది అందమైన ప్రకృతిని తన గోడలలో ఇమడ్చుకున్న ఎంతో సహజమైన గది. అక్కడ ఒక వ్యక్తి ధ్యానంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. రామానుజన్‌కు ఆ వ్యక్తి అంటే ఎనలేని భక్తి. అటువంటి వ్యక్తిని ఒక మూర్ఖుడు ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ తూలనాడటం రామానుజన్ మనసుని కలిచివేసింది.
రామానుజన్ రాకను గమనించిన ఆ వ్యక్తి అతని ముఖ కవళికలను బట్టి రామానుజన్ మనసులో మెదులుతున్న శంసయాన్ని నివృత్తి పరిచే దిశగా చిన్నగా నవ్వుతూ “మీరు నన్ను ఏదైనా అడగాలని అనుకుంటున్నారా, మిస్టర్ రామానుజన్?” అని ప్రేమగా అడిగాడు. రామానుజన్ వినయంతో ఆ వ్యక్తిని నమస్కరించి “అవును, మీతో కొనసాగుతున్న నా జీవన ప్రయాణంలో అప్పటిదాకా నేను తేలికగా తీసుకునే విషయమే నన్ను ఆలోచింపజేసే ప్రశ్నలాగా మారిపోతోంది. మేమంతా జీవిస్తున్నాం. కానీ జీవితాన్ని ఏ కోణం నుండి తీసుకోవాలో నిజానికి స్పష్టంగా మాలో ఎవరికీ తెలియదు. అందుకే మీరు స్పందించే ప్రతి విషయం మీద నాలో ఆలోచనలు మొదలవుతున్నాయి. ఆలోచన నుండి ప్రశ్న ఉద్భవిస్తుంది. ప్రశ్న లేకుంటే సంశయాలు ఉండవు. సమాధానం ఎంత క్లిష్టమైనదో ప్రశ్న అంతకంటే క్లిష్టమైనదని నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఆలోచన నుండి ప్రశ్న, ప్రశ్న నుండి సమాధానం, సమాధాన ఆవలింపు ద్వారా జ్ఞానం, తిరిగి సంపాదించిన జ్ఞానంతో ఆలోచించే సామర్ధ్య సాధన. ఇది నిరంతరంగా పదునవుతూ ఈ జీవన జ్ఞాన చక్రంలో భ్రమిస్తూ ఉంది.

ఈ రోజు నా మనసులో మెదులుతున్న సందేహాలు కూడా బహుసా ఈ జీవన జ్ఞాన చక్రంలో భాగమే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి దయచేసి నా సంశయాన్ని నివ్రుత్తపరచండి. కిరణ్ రాథోడ్ ఒక మూర్ఖుడు అని మీకు తెలుసు. తెలిసి కూడా మీరు ఒక మూర్ఖునితో చర్చకు ఎలా సమ్మతించారు. అది మాత్రమే కాకుండా స్వయంగా మీరే అతనికి ఆహ్వానం పంపడం ఏంటి? తలచుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం నా ఆలోచనకు కూడా అందకుండా ఉంది. ఈ ప్రశ్న నా జీవితంలో అత్యుత్తమమైనదిగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను అని రామానుజన్ ప్రశ్నకు ఉన్న శక్తిని మరొకసారి వ్యక్తపరుస్తూ ముగించాడు.
రామానుజన్ ప్రశ్నకు ఆ వ్యక్తి చిన్నగా నవ్వి, “మిస్టర్ రామానుజన్, మీ ప్రశ్న నిజంగానే మీ జీవితంలో అత్యుత్తమమైనదిగా మిగిలిపోతుంది. కానీ దానికి కొంత సమయం అవసరం. ఈ ప్రశ్నకు కాలంతో సగం సమాధానం లభిస్తుంది. అటుపైన రెండో సగభాగం నేను పూర్తిచేస్తాను. ప్రస్తుతం మీరు మాత్రం కేవలం ఈ ప్రశ్న వరకు మీ సంశయాలను పక్కన పెట్టి మిగిలిన జీవన జ్ఞాన చక్రంలో తేలియాడుతూ ఉండండి” అని చమత్కారంతో నవ్వాడు. రామానుజన్ కుడా నవ్వుతూ వినయంతో నమస్కరించి అక్కడ నుండి బయల్దేరాడు.
(ఆరు నెలల తరువాత)
రామానుజన్ ఆరు నెలలుగా వదిలిపెట్టిన సంశయం మళ్ళీ ఒక రోజు మొదలైంది. ఎందుకంటే అతనికి సగం సమాధానం లభించింది. ఆ ప్రశ్న అతని జీవితంలో సుదీర్ఘమైన ప్రశ్నగా కుడా ఉంటుందని మనసులో అనుకుంటూ మిక్కిలి కుతూహలంతో మిగిలిన సమాధానం కోసం అతను ఆరాధించే వ్యక్తి వద్దకు బయల్దేరాడు.
“Secret of Success”
ఎప్పటిలాగానే ఈసారి కూడా రామానుజన్ రాకను గమనించిన ఆ వ్యక్తి ధ్యానం నుండి మేల్కొని ఆప్యాయంగా “ఏంటి రామానుజన్, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆరు నెలల క్రితం విడిచిపెట్టిన సుదీర్ఘమైన సంశయం మళ్ళీ కనిపిస్తోంది. బహుసా సగం సమాధానం మీకు లభించినట్టు నాకు గోచరిస్తోంది” అన్నాడు.

రామానుజన్ నమస్కరించి “అవును, నాకు లభించిన సమాధానం ఏమిటంటే మీరు వ్యక్తపరిచే ప్రతీ సందర్భానికి ఒక నిగూఢ అంతరార్ధం దాగి ఉంటుంది అనే సత్యం. నిజానికి కిరణ్ రాథోడ్ ఏ ప్రాచుర్యం కోసం ప్రాకులాడాడో అవేమీ అతనికి దక్కలేదు. మీతో వాదనల అనంతరం అతని కీర్తి మెరుపు వలె ఒక్క ఉదుటున ఉవ్వెత్తిన ఎగసి పాతాళానికి పడిపోయింది. అలా ఎందుకు జరిగిందని మరో ప్రశ్న నాలో ఉదయిస్తూ ఉంది. ఇక మీదుట ఈ సందిగ్దతకు సంభందించి మీరు ఇచ్చే సమాధానం అన్ని ప్రశ్నలను సంతృప్త పరుస్తుంది. ఇప్పుడైనా చెప్పండి. తెలిసి కూడా మీరు ఒక మూర్ఖునితో చర్చకు ఎలా సమ్మతించారు. స్వయంగా మీరే అతనికి ఆహ్వానం పంపడంలో అర్ధం ఏమిటి?” అతని పతనానికి దారితీసిన కారణాలు ఏమిటి?” అని రామానుజన్ తన మనసులోని ప్రశ్నలను వరుసగా సంధించాడు
అప్పుడు అతను సమాధానం చెబుతూ “చూడు రామానుజన్, అతను తన ప్రాచుర్యం కోసం నన్ను వాడుకోవాలని అనుకున్నాడు. నేను నా సందేశాన్ని సమాజానికి అందించిడానికి అతన్ని వాడుకోవాలని అనుకున్నాను. ఇద్దరి లక్ష్యం ఒక మాధ్యమం కోసం వెతుకులాట మాత్రమే.
“1 Key to Sucees in Life”
“ఎవరైనా మీతో తెలివితక్కువ వాదనలు చేస్తున్నప్పుడు మీరు కేవలం ఆ వ్యక్తితో మాత్రమే వాదిస్తూ ఉన్నామని భావించకండి.. మనం మన వెలుగుని పంచాల్సింది చీకటిలోనే… ఆ చీకటి మీకు అటువంటి వ్యక్తుల ద్వారానే లభిస్తుంది.. అతని ద్వారా ఎంతో మందికి మీ వెలుగుని వ్యాప్తి చేయండి.
కిరణ్ రాథోడ్‌తో వాదోపవాదాలు చేయడానికి దాదాపుగా ఏ వ్యక్తులు సముఖంగా ఉండరు. కానీ నిజంగా ఆలోచిస్తే అటువంటి వారు దొరకడం కుడా ఒక మంచి అవకాశం. వారు మనలోని ఔన్నత్యాన్ని బహిర్గతం చేయడానికి చక్కని వేదికలా ఉపయోగపడతారు. రెండు వేర్వేరు భావజాలాలు కలిగిన వ్యక్తులు ఓకే వేదిక మీద సమానమైన విషయానికి వైవిధ్యంగా ఏవిధంగా స్పందిస్తున్నారో బేరీజు వేయడానికి సమాజానికి అది ఒక సదావకాశం. సమాజం ఈ మార్పుని క్రమేపి సునిశితంగా మనన చేసుకుంటుంది. దాని ఫలితమే అతని పతనం” అని చెప్పి ముగించాడు.
రామానుజన్ మదిలోని అన్ని ప్రశ్నలకు దాదాపుగా సమాధానం దొరికినట్లుగా మళ్ళీ జ్ఞాన చక్రంలోని ఆలోచనలలో పడ్డాడు. అంతలో ఎదో ప్రశ్న అతని మదిలో మెదిలింది కళ్ళు తెరిచి చూస్తే ఆ వ్యక్తి తిరిగి ధ్యానం లోనికి జారుకుని ఉన్నాడు. రామానుజన్ అతనికి నమస్కరించి నెమ్మదిగా నడుచుకుని ఆశ్రమం బయటకు వచ్చాడు. ఎదో తెలియని ఆనందంతో ఆశ్రమం యొక్క తోరణాన్ని చూసాడు . “ఈశా ఫౌండేషన్” అని రాసి ఉంది. ఎంతో వినయంతో వెనక్కి తిరిగి నమస్కరించి అక్కడి నుండి బయల్దేరాడు.

“A defeat of Success”
“విపరీతమైన ధోరణి కలిగినవారు ఎదుటి వ్యక్తులపై పైచేయి సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకోసం వారి వాదనలను ఏకపక్షంగా జరుపుతారు. జీవతంలో వేలకొలది గెలుపులు వారికి సొంతం. కానీ ఆ గెలుపులు వెనుక వారి జీవితం ఒక పెద్ద ఓటమి”
–తెలుగు సంహిత
*This story is just my thought about sadguru’s ideology…
–Thanks.