ప్రాణం ఖరీదు:-

Best Self Motivation Story

ఒక చిన్న పట్టణంలో నలుగురు వ్యాపారులు ఉండేవారు. ఆ వ్యాపారులు నలుగురూ ఒకే కళాశాలలో విద్యనభ్యసించిన మంచి స్నేహితులు. కొంతకాలం పాటు సజావుగా సాగిన వాళ్ళ వ్యాపారం కొన్ని ఒడుదుడుకుల కారణంగా నష్టాల బాట పట్టింది. తర్వాత ఆ నలుగురు మిత్రులు మరో వ్యాపారంతో తమ జీవితాన్ని ప్రారంభించారు. కొన్నాళ్ళకు ఆ వ్యాపారం కూడా నష్టాల పాలయ్యింది. ఇలా చేసిన వ్యాపారాలన్నీ నష్టాలు వస్తుండటంతో మనస్తాపం చెందిన ఆ స్నేహితులు పరిష్కారం కోసం ఒక ప్రదేశంలో సమావేశమయ్యారు.

చాలాసేపు చర్చల అనంతరం వాళ్ళలో ఒక స్నేహితుడు మనకి మరణమే శరణ్యం అని తీర్మానం చేసాడు. మరో ముగ్గురు కూడా మనకు వేరే దారి లేదు అని భావించి సరే అన్నారు. తర్వాత రోజు అనుకున్నట్టుగానే నలుగురు స్నేహితులు ఒక పెద్ద కొండ ఎక్కి అక్కడ నుండి దూకి ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పట్టణానికి సమీపంలోని ఒక అడవి గుండా ప్రయాణించి ఒక కొండ ఎక్కడం ప్రారంభించారు. తీవ్రమైన దిగ్భ్రాంతితో ప్రయాణిస్తున్న ఆ యువకులను గమనించిన అక్కడ కట్టెలు కొడుతున్న ఒక వృద్దుడు చేతిలోని గొడ్డలి పక్కన పెట్టి వాళ్ళను అనుసరిస్తూ కొండ ఎక్కడం ప్రారంభించాడు.

కాసేపట్లో నలుగురు స్నేహితులూ ఒక శిఖరానికి చేరుకొని ఒక బండరాతి వద్ద నిల్చుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఏడుస్తూ తమ కష్టాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. మరో జన్మ ఉంటే ఇటువంటి సమస్యలు రాకుండా ఇవ్వమని భగవంతుడ్ని చివరిగా ప్రార్ధించి దూకడానికి సిద్ధమయ్యారు. బండరాయి వెనుక నిల్చుని వీళ్ళని గమనిస్తున్న ఆ వృద్ధుడు విషయం అంతా అర్ధం చేసుకుని “ఆగండి నాయనా! మీ సమస్య అంతా నేను విన్నాను.ఇటువంటి నిర్ణయం మీ వంటి యువకులకు తగనిది. నా మాట మీద నమ్మకం ఉంచి నాతో రండి. మీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాను” అన్నాడు. 

జీవితం మీద విసిగి వేజారిన ఆ యువకులకు వృద్దుని మాటలు ఏ మాత్రం సహించలేదు. “చూడు పెద్దాయనా, మాకు ఇప్పుడు మీ మాటలు వినేంత ఓపికలేదు. పోనీ మీకు లాగా కట్టెలు కొట్టి సంపాదిద్దామన్నా మా కష్టాలు చల్లారేవి కాదు. మాపై జాలి చూపించినందుకు ధన్యవాదములు. ఇక అడ్డు తప్పుకోండి” అన్నారు. ఆ వృద్దుడు పట్టు వదలకుండా “చూడండి నాయనా, కష్టాలు మనుషులకి కాకపోతే మానులకి వస్తాయా, జరిగిందేదో జరిగింది. పెద్దవాడ్ని అనే గౌరవంతో అయినా నా మాట కాస్త వినండి. ముందు నాతో రండి. ఒకవేళ అప్పుడు కుడా మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే మీకు నచ్చింది చేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అన్నాడు.

“ఈ ముసలోడు మనల్ని వదిలేలా లేడు. అయినా మన జాతకమే అంత. ఇక్కడ కూడా మనకు వైఫల్యమే మిగిలింది” అని వారిలో ఒక యువకుడు తన తలరాతను తలచుకుని గుర్రుమన్నాడు. మరో యువకుడు కలగజేసుకుని “సరే పెద్దాయన, నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఒకవేళ మా సమస్యకి పరిష్కారం దొరకకపోతే మా నిర్ణయమే తుది నిర్ణయం” అన్నాడు. ఆ వృద్దుడు “సరే నాతో రండి” అని వాళ్ళని వెంటబెట్టుకుని తన కట్టెల మోపు భుజాన మోసుకుంటూ ఒక గుడిసె దగ్గర ఆగాడు. కట్టెల మోపు కిందకి దించి నలుగుర్ని గుడిసె బయట ఉన్న చింత చెట్టు కింద నులక మంచం మీద కూర్చోమని చెప్పి గుడిసె లోపలకి వెళ్ళాడు. ఒక మట్టి పాత్రలో చల్లని మజ్జిగ తెచ్చి మీరు త్రాగుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని మళ్ళీ గుడిసె లోపలకి వెళ్ళాడు.

ఆ యువకులు మజ్జిగతో దాహం తీర్చుకుని అలా ఆ పరిసరాలను పరీశీలిస్తూ ఉండగా, చేతిలో ఒక కాగితంతో వృద్దుడు వచ్చి “ఇక్కడకి యాభై మైళ్ళ దూరంలోని మహేంద్ర నగరం అనే పట్టణం ఉంది. అక్కడ ఈ చిరునామాలో నర్సయ్య అనే నా స్నేహితుడు గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతన్ని కలిస్తే మీకు ఎదో ఒక పరిష్కారం చెప్తాడు” అని ఆ చీటీని వాళ్ళకి అందించాడు. “ఏంటి, ఒక చిన్న గుమస్తాని మేము కలవాలా, అతను మా సమస్య తీరుస్తాడా? చూడండి పెద్దాయన, మా దగ్గర అలాంటి గుమాస్తాలు ఇద్దరు ముగ్గురు పనిచేసేవారు. ఇప్పుడు మా సమస్యను ఒక గుమస్తా తీరుస్తాడా. ఎదో పెద్దవాడవు అని నీ మాటకి గౌరవం ఇస్తున్నామని నువ్వు ఏం చెప్తే అది చేస్తామని అనుకుంటున్నావా. మా సమయం వృధా చేయకండి. మా సమస్య అతను తీర్చలేడు. మమ్మల్ని వదిలేయండి” అన్నారు ఆ యువకులు. 

ఆ వృద్దుడు “చూడండి నాయనా, ఇందాక నేను చెప్పింది చేస్తాం అని మాట ఇచ్చారు. ఒకవేల అతను మీ సమస్యను తీర్చలేని పక్షంలో మళ్ళీ ఇక్కడకు తిరిగి రండి. మీకు నచ్చింది చేయడానికి నా వంతు సహాయం చేస్తాను” అన్నాడు. నలుగురు మిత్రులు ప్రక్కకు వెళ్లి “మనం చనిపోయాక దహన సంస్కారాలు జరిపించే పని ఇతనికి అప్పగించవచ్చు” అని మాట్లాడుకుని తిరిగివచ్చి ఆ చీటీ తీసుకుని మారు మాట లేకుండా బయల్దేరారు. 

యాభై మైళ్ళ ప్రయాణం ముగిసింది. అక్కడ మహేంద్ర నగరం చేరుకుని ఆ చీటీ మీద రాసిన చిరునామా కోసం ఒకవ్యక్తిని ఆరా తీసారు. ఆ వ్యక్తి వాళ్ళని చిరునామా చూపిస్తాను అని తీసుకెళ్ళి ఒక పాత భవంతి వద్ద వదిలి వెళ్ళిపోయాడు. “వీళ్ళకి సరైన భవంతి కూడా లేదు, అటువంటి సంస్థలో పనిచేసే గుమస్తా మన సమస్య ఎలా తీరుస్తాడో నాకైతే అర్ధం కావట్లేదు” అని ఒక యువకుడు అన్నాడు. “ఏది ఏమైనా అతను చెప్పింది చేస్తామని మాట ఇచ్చాం” అని మరో యువకుడు అన్నాడు. ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి “ఇక్కడ నర్సయ్య అని గుమస్తా గారిని కలుసుకోవాలి, దయచేసి అతన్ని పిలుస్తారా” అని అడిగారు. అతను మరో వ్యక్తిని పిలిచి వీరిని నర్సయ్య గారివద్దకు తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపించాడు.

ఆ వ్యక్తి వీళ్ళని తీసుకుని నర్సయ్య వద్దకు చేరుకున్నారు. నర్సయ్య కుడా దాదాపుగా డబ్భై ఏళ్ల వయో వృద్దుడు. నర్సయ్యని చూడగానే ఈ ముసలి వాళ్ళంతా మన మీద పగబట్టినట్టు ఉన్నారు అని మనసులో తిట్టుకుంటూ, “అయ్యా నర్సయ్య గారు, ఇకడకి యాభై మైళ్ళ దూరంలో ఉన్న కొండలోయాల్లో ఒక ముసలి వ్యక్తి మీ స్నేహితుడ్ని అంటూ ఈ చీటీలో మీ చిరునామా రాసి మిమ్మల్ని కలవమని చెప్పాడు. అంతేకాకుండా మీరు మా సమస్యను తెలుసుకుని పరిష్కారం చూపిస్తారని చెప్పారు. కానీ మిమ్మల్ని చుస్తే మాకు అలా ఏమీ తోచడం లేదు. కాబట్టి దయచేసి ఈ చీటీకి రెండో వైపున ఈ సమస్య పరిష్కరింపబడలేదు అని రాసి ఇవ్వండి. మేము మీకు రుణపడి ఉంటాం” అని అన్నారు నర్సయ్యతో. 

నర్సయ్య వాళ్ళ మాటలకు చిన్నగా నవ్వి, “మరీ అంత తొందరపడతారేం, ఇప్పుడేగా వచ్చారు. కాసేపు వేచియుండండి. మీరు ఇక్కడ కలవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అది పూర్తి అయ్యాక మీకు కావాలంటే అలానే రాసి ఇస్తాను” అన్నాడు నర్సయ్య. మళ్ళీ ఇంకొకర్ని కలవాల్సి ఉందా, అని తమలో తాము కసురుకుంటూ వెళ్లి ఒక ప్రక్కన కూర్చున్నారు. 

కాసేపటికి ఒకతను వచ్చి మీరు కలవాల్సిన వ్యక్తి ఆ గదిలో ఉన్నారు. వెళ్లి కలవండి అన్నారు. స్నేహితులు నలుగురూ లేచి త్వరగా వెళ్లి ఏం చెప్తారో వినేసి వెల్లిపోదాం అని పరాకుగా గదిలోనికి వెళ్లారు. సాయంత్రపు సూర్య కిరణాలూ తాకి నిగినిగల మెరుస్తున్న తెల్లని మబ్బుల వంటి కేశాలు కలిగిన ఒక డబ్బై ఏళ్ల మరో వృద్దుడు ఎంతో ప్రశాంతంగా కుర్చుని యువకులను చూసి చిన్నగా నవ్వాడు. నలుగురు మిత్రులు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని వారిని అక్కడకు పంపించిన వృద్దుడిని తలుచుకుని లోపల నుండి వస్తున్న కోపాన్ని అణుచుకున్నారు. ఈ ముసలోడు ఏం చెప్తాడో వినేసి త్వరగా ఇక్కడ నుండి వెల్లిపోదాం అనుకుని నేరుగా అతని ఎదురుగా టేబుల్ వద్ద వరుసగా కూర్చున్నారు. 

వాళ్ళని చూసి ఆ వృద్దుడు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. చాలా దూరం నుండి నడిచి వచ్చారు కదా, ఏమైనా తీసుకుంటారా అని అంటూ నర్సయ్య అని కేకవేసాడు. నర్సయ్య వచ్చి చెప్పండి మేనేజర్ గారు అన్నాడు. వీళ్ళకి త్రాగడానికి ఏమైనా తీసుకురా అని అన్నాడు సరే అని నర్సయ్య వెళ్ళిపోయాడు. కాసేపట్లో ఒక వ్యక్తి పండ్ల రసాలను తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టారు. వాళ్ళు వాటిని తీసుకోవడానికి మొహమాటపడుతూ పట్టుకున్నారు. ఆ వృద్ద మేనేజర్ “తీసుకోండి, తర్వాత తీరికగా మాట్లాడుకుందాం అన్నాడు. స్నేహితులు అప్పటికే బాగా అలసటతో ఉండటంతో తీసుకుని గబా గబా త్రాగేసారు. 

మేనేజర్ ఆ యువకులని చూసి సరే ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి? అని అడిగాడు. యువకులు ఒక్కొక్కరు వరుసగా తమ వ్యాపారాల కోసం వారు ఎదుర్కొన్న నష్టాల కోసం చెప్పడం ప్రారంభించారు. ఇరవై నిముషాలపాటు అంతా విన్నాక మేనేజర్, “సరే వ్యాపారం అన్నాక లాభనష్టాలు సర్వ సాధారణం, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు. “ఏముంటుంది మేనేజర్ గారు, ఇకపై ఈ భూమి మీద కష్టాలను భరించే సహనం మాలో చచ్చిపోయింది. వీటన్నిటికి స్వస్తి చెప్పి శాశ్వత ముగింపుకు నాంది పలకాలని నిర్ణయించుకున్నాము” అన్నారు ఆ యువకులు. మేనేజర్ ఒక నవ్వు నవ్వి “ఏంటి, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయమా, తమాషా చేస్తున్నారా, అన్నాడు. లేదు మేనేజర్ గారు నిజంగానే చెప్తున్నాం, మాకు మరో దారి లేదు. అంత పెద్ద మొత్తంలో నష్టాలను పూడ్చడం మా వాళ్ళ కాదు. మేము పూర్తిగా విఫలమయ్యం. ఇంకా ఈ అపజయాలను మేము భరించలేం, దయచేసి మా చావు మమ్మల్ని చావనివ్వండి అని ఆ యువకులు ముక్త కంఠంతో అరిచారు.

మేనేజెర్ వాళ్ళ ఆవేశాన్ని గమనించి శాంతపరుస్తూ, మిస్టర్ యంగ్ మ్యాన్స్. కూల్. ఈ ప్రపంచంలో చావే అన్నిటికి పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద మనిషి అన్నవాడే మిగిలేవాడు కాదు. మీకు ఇప్పుడు వచ్చిన కంగారు ఏమీ లేదు. మీకు నేను తోచిన సహాయం చేస్తాను. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. తర్వాత పరిస్థితులు అన్ని అవే సద్దుమనుగుతాయి అని మేనేజర్ బరోస ఇచ్చాడు. యువకులకు కోపం ముంచుకొచ్చింది. పట్టరాని ఆవేశంతో మీ ముసలోళ్ళకు మేము అంత చులకన అయిపోయామా, ఇంకో మాట మాట్లాడితే పెద్దవాడివి అని చూడకుండా ఏం చేస్తామో తెలీదు. మేం వెళ్తున్నాం. మీ మాట ఇప్పటిదాకా వినడమే చాలా ఎక్కువ అని నలుగురూ వెళ్ళిపోదామని నిల్చుని కదలబోయారు. వెంటనే మేనేజర్, ఆగండి, మీరు వెళ్లొద్దు, దయచేసి నా మాట వినండి అని బ్రతిమలాడాడు. ఒక యువకుడు హ్మ్మ్, ఇంకా చూస్తారేం పదండి అని కోపంతో తలుపు తీసి బయటకి కదిలాడు.

మేనేజర్ వాళ్ళని ఆపడానికి చేసే ప్రయత్నంలో కుర్చీ లోంచి అప్రయత్నంగా లేచి నిల్చోవడానికి ప్రయత్నించి క్రింద పడిపోయాడు. వెంటనే ఆ యువకులు పరిగెత్తుకుని వచ్చి అతన్ని పట్టుకున్నారు. మేనేజర్ తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న ఒక వికలాంగుడు, అది చుసిన వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గుండెలు భారంగా మారిపోయాయి. మాకు ఏమైంది. మేము ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వలేని పరిస్థితికి మేము ఎందుకు దిగజారిపోయము అని తమలో తాము కుంగి పోతూ వాళ్ళ గుండెల్ని కలచివేసిన దృశ్యాన్ని చూసిన యువకులు అతన్ని పైకి లేవనెత్తి కుర్చీలో కూర్చోబెట్టారు. అయ్యో మమ్మల్ని క్షమించండి. ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాము. మేము చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఏం చెప్తే అది చేస్తాం అన్నారు వినయంగా. 

మేనేజర్ ఆ యువకులలో వచ్చిన మార్పుకు సంతోషించి “మీ ప్రాణాలు విలువకట్టలేనివి. ఈ రోజు మీరు తీసుకుంటాం అనుకున్న ప్రాణాలు కేవలం మీ సొత్తు అనే భ్రమలో ఉన్నారు. కానీ ఆ ప్రాణం ఖరీదు ఇక నుండి మీరు బ్రతికే ప్రతీ క్షణంలోనూ మీకు తెలిసిరావాలి. సరే చెప్పండి. మీ సమస్య డబ్బుతో తీరిపోతుంది అనుకుంటే ఆ డబ్బు నేను ఇస్తాను. ఇంకెప్పుడూ ఇటువంటి ప్రయత్నం చేయకండి అని అంటూ నర్సయ్యా అని కేక వేసాడు మేనేజర్. 

నర్సయ్య క్షణాల్లో చెప్పండి మేనేజర్ గారు అని లోపలకి వచ్చాడు. ఒక లెటర్ రెడీ చెయ్యు అన్నాడు. ఆ యువకులకు ఏం జరుగుతోందో అర్ధం కాక అలా మౌనంగా చూస్తున్నారు. కాసేపట్లో నర్సయ్య ఎదో లేటర్ తీసుకుని మేనేజర్ కి అందించాడు. మేనేజర్ ఆ లేటర్ పై సంతకం చేసి ఒక కవర్ లో పెట్టి ఆ యువకులకు అందించాడు. “ చూడండి, ఆ కవర్ మీద చిరునామా కి వెళ్లి ఆ కవర్ అక్కడి గుమస్తా విశ్వేశ్వరయ్యకు ఇవ్వండి. అని అన్నాడు. అప్పటికే పశ్చాత్తాప పరిస్థితిలో ఉన్న ఆ యువకులు మరో ప్రశ్న అడగడం ఇష్టంలేక దానిని తీసుకుని మేనజర్ కి నమస్కారం చేసి నెమ్మదిగా బయటకి వచ్చేసారు. 

“ఏదేమైనా ఈ ముసలోల్లంతా మహానుభావులురా, మన ప్రాణాలకి వారు ఇచ్చే విలువ మనం ఇవ్వలేకపోయం. మన కష్టాలు వాళ్ళు తీర్చగలరో లేదో నాకు తేలేదు. కానీ వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళు సహాయం చెయడానికి ముందుకు వచ్చారు. వారి హృదయాలు ఎంత స్వచ్చమైనవి అన్నాడు ఒక యువకుడు. పాపం, వాళ్ళకే ఎన్నో సమస్యలు, వాళ్ళ దగ్గర మనం తీసుకునే చిన్న పాటి మొత్తాలు మన కష్టాలు ఈసడంత అయినా తీర్చలేవు. వాళ్ళు మనకి అందించిన ఈ ఆత్మ స్థైర్యం మనకి సరిపోదూ, ఆ డబ్బు తీసుకోవడం అవసరమంటావా అని మరో యువకుడు అన్నాడు. “వాళ్ళు ఇచ్చే డబ్బు కేవలం ఒక్క రూపాయి అయినా పర్వాలేదు అది వాళ్ళ ఆశీర్వాదం అనుకుందాం. ఇప్పుడు మనం తీసుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళని మరో సారి మనం అవమానించినట్టే అని ఇంకో యువకుడు అన్నాడు. “నిజమే, పదండి ఈ చిరునామాకి వెళ్దాం అని నలుగురూ ఒక్కటిగా అడుగులు వేసారు. 

ఆకాశాన్ని తలదన్నే ఒక పెద్ద భవనం. చుట్టూ అద్దాల మేడలు. పెద్ద పెద్ద ప్రహారీలు, కొన్ని ఎకరాల్లో విస్తరించిన ఆఫీసులు, పది మంది కుడా తెరవలేనంత పెద్ద పెద్ద గేట్లు “నిజంగా సరైన చిరునామాకే వచ్చామంటావా” అని వారిలో ఒక యువకుడు సందేహిస్తూ ఉండగా, “అయుండవచ్చు, బహుశా ఈ ఉత్తరంలో పేర్కొన్న విశ్వేశ్వరయ్య మేనేజరు గారికి స్నేహితుడు అనుకుంట” అన్నాడు, “లేదంటే మేనేజర్ కి ఎవరైనా అప్పు ఇచ్చేవారు ఇక్కడ ఉన్నారేమో” అని మరో యువకుడు అన్నాడు. “ఎలాగో వచ్చేసాం కదా తెలుసుకుందాం, కానీ లోపలకి ఎలా వెళ్తాం, ఈ కంపెనీలో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది అన్నాడు మొదటి యువకుడు. ఏముంది, మనం ప్రయత్నం మనం చేద్దాం అని ఇంకొకడు అన్నాడు.

మెయిన్ గేటు వద్దకు చేరుకున్న ఆ యువకులను మొదటి సస్టేజీ సెక్యూరిటీ లెవల్ వద్ద లోపలకు వెళ్లేందుకు అనిమతి ఇవ్వమని అడిగారు. మీ వద్ద ఫోటో ఎంట్రీ పాస్ ఉందా?” అని అడిగారు సెక్యురిటి గార్డ్స్. యువకులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఎంట్రీ పాస్ లేదు. ఒక్కసారి మేము విశ్వేశ్వరయ్య గారిని కలిసుకోవాలి అన్నారు. “కుదరదు అపాయింట్మెంట్ ఉండాలి. మీ పేర్లు ఇచ్చి ఒక వారం తర్వాత వస్తే అనుమతి ఇచ్చారో లేదో చెప్తాం అప్పుడు మీరు కలుసుకోవచ్చు” అన్నారు. యువకులు ఆవేశంతో లేదు అతన్ని ఈరోజే కలుసుకోవాలి అని మొండిగా లోపలకి వెళ్ళాలని ప్రయత్నించారు.మెయిన్ గేటు వద్ద ఉన్న ఆరుగురు సెక్యూరిటీ సభ్యులు అప్రమత్తమై యువకులను బయటకు నేట్టివేసారు. ఆ త్రోపులాటలో ఒక యువకుని షర్టు జేబులో ఉన్న కవర్ జారి సెక్యూరిటీ వద్ద కింద పడింది. ఎదో చెత్త పడింది వాళ్ళ మోహన కొట్టి పంపించండి అని వాళ్ళ సెక్యూరిటీ అఫీసరు మిగిలిన వాళ్ళని ఆదేశించాడు.

వారిలో ఒక గార్డ్ సభ్యుడు క్రింద పడిన ఆ కవర్ తీసుకుని దాన్ని వెనక్కి త్రిప్పి చూసాడు. అక్కడ “వివాన్ ఆదిత్య గ్రూప్స్” అని లోగో ఉంది. ఒక్క సారిగా ఆ గార్డుకు చెమటలు పట్టేసాయి. కాళ్ళు చేతులు వణికి పోయాయి. ఆ కవర్ తీసుకుని పరిగెత్తుకుంటూ తన అధికారి వద్దకు వెళ్ళాడు. కింద పడిన యువకులు తమ శరీరానికి అంటుకున్న దుమ్ముని శుభ్రం చేసుకుంటూ ఏం జరిగిందో అర్ధం కాక పైకి లేస్తున్నారు. గార్డు తన ఆఫీసరుకి ఆ కవర్ అందించాడు. ఆఫీసరు గడగడ వణికిపోయాడు. పరుగు పరుగున గేటు వద్దకు వస్తున్నాడు. ఆఫీసరు ఆందోళన గమనించిన రెండవ స్టేజీ సెక్యూరిటీ వారు కుడా అతని వెంట పరుగున రావడం ప్రారంభించారు.

ఒక్కసారి అంతమంది ఎదురుగా వస్తు ఉండేసరికి “వామ్మో, ఈ ముసలోడు మనకి ఎదో ఫిట్టింగ్ పెట్టినట్టు ఉన్నాడు. వీళ్ళకి చిక్కామంటే మనల్ని పీచు పీచు చేసేస్తారు అని ఒక యువకుడు మిగిలిన వాళ్ళతో అన్నాడు. “పారిపొండిరోయ్! అని మరో యువకుడు అరిచాడు. నలుగురు కలసి ఒక్క ఉదుటున పరుగులంకించేందుకు సిద్దమయ్యారు. అంతలో ఆ ఆఫీసరు నుండి సార్ ఆగండి” అనే కేకలు వినిపించాయి. అందరూ పరుగున వచ్చి చుట్టు ముట్టేసారు.

“ఏంటి సర్, ఈ కవర్ ముందే చూపించాలి కదా, మమ్మల్ని క్షమించండి, ఎదో మా పని మేం చేసాం. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దూ సర్ మా ఉద్యోగాలు పోతాయి అని బ్రతిమలడటం ప్రారంభించాడు సెక్యురిటి ఆఫీసరు. అంతా అయోమయంగా ఉన్న ఆ యువకులు ఎక్కడా చెప్పము అన్నట్లు తలని ఊపారు. వెంటనే ఆ ఆఫీసరు “పక్కకి తప్పుకోండి” అంటూ వాళ్ళని ఎంతో గౌరవంతో లోపలకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక విలాసవంతమైన హాలులో వాళ్ళని కుర్చోబెట్టి ఆ ఆఫీసరు హుటాహుటిన విశ్వేస్వరయ్య ని తీసుకువచ్చాడు. 

విశ్వేశ్వరయ్య ఆ కవర్ చేతిలో పట్టుకుని నిముషాల్లో అక్కడకు చేరుకున్నాడు. సర్ నమస్కారం, నేనే ఇక్కడి గుమస్తా విశ్వేశ్వరయ్య. క్షమించాలి నేను 10 వ అంతస్తు నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యం అయింది అన్నాడు. అప్పటికే ఎంతో సందిగ్దంలో ఉన్న ఆయువకులు “అయ్యో పర్వాలేదండి” అన్నారు. “సర్ మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఎంత సొమ్ము కావాలో కాస్త చెప్తారా” అని వినయంగా అడిగాడు విశ్వేశ్వరయ్య. ఆ నలుగురు యువకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మొహమాటపడుతూ ఉండగా “విశ్వేశ్వరయ్య గారు, నిజానికి మాకు రెండు కోట్ల రూపాయలు అవసరం ఉంది. కానీ అంత పెద్ద మొత్తం తీసుకోవాలంటే మాకు కుడా మనసు రావట్లేదు అన్నాడు ఒక యువకుడు. అయ్యో సర్, ఒక్క రెండు నిముషాలు నాకు సమయం ఇవ్వండి ఇప్పుడే వస్తాను అన్నాడు. పక్కకి తిరిగి సుబ్బారావ్ అని కేకవేసాడు అక్కడకి పొట్టిగా ఎంతో వినయంగా ఉన్న ఒక యాభై ఏళ్ల వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. నాతో రా అని చెప్పి సుబ్బారావుని తన వెంట తీసుకుని వెళ్ళాడు విశ్వేశ్వరయ్య. 

అనుకున్నట్టుగా రెండు నిముషాల్లో సుబ్బారావు చేతిలో ఒక సూటికేసు పట్టుకుని వచ్చాడు. “సర్, ఇందులో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి. విశ్వేశ్వరయ్య గారు ఫార్మాలిటీలు పూర్తి చేసుకుని వస్తారు. మీరు ఒకసారి లెక్క చూసుకోండి అన్నాడు. ఏంటి రెండు కోట్లు ఇచ్చారా! అని ఒక యువకునికి స్పృహ తప్పిపోయినంత పని అయింది. “థాంక్యూ సుబ్బారావు గారు. సరే మీరు వెళ్ళండి. విశ్వేశ్వరయ్య గారు వచ్చాక మేము బయల్దేరుతాము అన్నారు ఆ యువకులు. సుబ్బారావు వినయంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

నలుగురు యువకులు చేతులు నిమురుకుంటూ “ఇది నిజమేనా అని ఒకరినొకరు గిల్లుకుని చూసుకున్నారు. “అసలు నాకేమీ అర్ధం కావట్లేదు. ఎవరో దారిన పోయే దానయ్యకి డబ్బు అవసరం వస్తే ఇలా ఇచ్చేస్తారా, వీళ్ళకి ఏమైనా పిచ్చా” అని ఒక యువకుడు అన్నాడు. లేదురా “ఇంకా ఎదో ఉంది, మేనేజర్ గారు అంటే వీళ్ళకి ఎనలేని గౌరవం. ఆయన నిజంగా మహానుభావుడు. అయినా సందేహం ఎందుకు, విశ్వేశ్వరయ్య రాగానే అసలు విషయాన్నీ అతన్నే అడిగి తెలుసుకుందాం అని వాళ్ళలో ఒక యువకుడు అన్నాడు.

మాటల్లోనే విశ్వేశ్వరయ్య అక్కడకి వచ్చాడు. సర్, అంతా సజావుగా జరిగిందా అన్నాడు. “థాంక్స్ విశ్వేశ్వరయ్య గారు, మీ ఋణం ఈ జన్మకి మర్చిపోలేం” అన్నాడు ఎదురుగా నిల్చున్న యువకుడు. “అబ్బే అందులో నేను చేసింది ఏముంది సర్, ఆయన ఎలా చెప్తే అలా చేయడం మా కర్తవ్యం” అన్నాడు విశ్వేశ్వరయ్య. “అంటే ఎవరు గురించి మీరు అంటున్నారు?” అని అడిగాడు ఇంకో యువకుడు. అదేంటి సర్, అలా అడుగుతారు, మీకు ఈ లెటర్ ఇచ్చి పంపించారు కదా, ఆయన గురించి చెప్తున్నాను అన్నాడు విశ్వేశ్వరయ్య.

“ఓహ్, మీ స్నేహితుడి కోసం చెప్తున్నారా, కానీ ఒక స్నేహితుడి మాటకోసం ఈ కంపినీలో ఇంత మొత్తం సొమ్ము ఎలా” అని ఒక యువకుడు సందేహంగా అడిగాడు. “నేను స్నేహితుడ్ని అని చెప్పారా?, అలా చెప్పడం ఆయన గొప్పతనం, నిజానికి ఆయన ఎవరనుకున్నారు, ది గ్రేట్ విప్ర నారాయణ్ పాశ్వాన్. సీఈఓ ఆఫ్ వివాన్ ఆదిత్య గ్రూప్స్. అతని కనుసైగల్లో ప్రపంచవ్యాప్తంగా 127 కంపెనీలు ఎంతో విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలని సైతం శాసించగల ఒక వ్యాపార మేథావి. మీరు ఎవరో నాకు తెలియదు. కానీ ఆయన చూపు మీ మీద పడింది మీరు నిజంగా అదృష్టవంతులు అన్నాడు విశ్వేశ్వరయ్య. “ఏంటీ, ఆ పాడుబడ్డ బంగ్లా మేనేజర్ వివాన్ ఆదిత్య గ్రూప్ సీఈవోనా, అని ఒక యువకుడు కళ్ళు తిరిగి కిందపడ్డాడు. 

*** కొంత సమయం తర్వాత***

“ఈ ట్విస్ట్‌లు భరించడం నా వాళ్ళ కావట్లేదు, అయినా ఇంత పెద్ద కంపెనీలకు సీఈఓ ఆ పాడుబడ్డ బంగ్లాలో అరిగిపోయిన రికార్డులనే ఎందుకు వింటున్నాడని ఆలోచిస్తే మైండ్ పనిచేయట్లేదు” అని మరొకడు అన్నాడు. “ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి లేదంటే ఈ మిస్టరీ నా మెదడు దొలిచేస్తుంది” అని ఇంకో యువకుడు అన్నాడు “సరే, ఎదో ఒకటి, ఆయన మన సమస్య తీర్చిన భగవంతుడు. ముందు అక్కడకి వెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్దాం పదండి అని నలుగురూ అక్కడ నుండి కదిలారు.

“వివాన్ ఆదిత్య గ్రూప్స్ కేంద్ర కార్యాలయం” అనే బోర్డు ఆశ్చర్యంగా చూస్తూ ఆ యువకులు లోపలకి ప్రవేశించారు. “ముందుగా మనం నర్సయ్య గారితో మాట్లాడాలి. ఆ మహానుభావుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మనం ఆయన ఎవరో తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేసాము. ఇప్పుడు అతని ముందు నిల్చునే అర్హత కూడా మనకి లేదు” అని నలుగురు స్నేహితులు కుమిలిపోయారు. తాము చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ నర్సయ్య కోసం ఎదురుచూస్తూ ఒక బల్లపై కూర్చున్నారు. 

కాసేపట్లో నర్సయ్య అటువైపుగా వెళ్తూ స్నేహితులని చూసి దగ్గరకు వచ్చాడు. అయ్యో! ఎప్పుడు వచ్చారు, అంతా సజావుగానే జరిగిందా అని వారిని ప్రశ్నించాడు. “దేవుడు వరమిచ్చాక జరగకుండా ఉంటుందా నర్సయ్య గారు అన్నాడు ఒక యువకుడు వినయంగా. “సంతోషం, మీ కొత్త జీవితాని సరికొత్తగా ప్రారంభించండి. మీ గతాన్ని అనుభవంగా మలచుకోండి, మీ భవిష్యత్తును ఆ అనుభవం అనే త్రాడుతో బంధించండి. మీకు కావాల్సిన విధంగా నియంత్రించండి. మీ ప్రాణం ఖరీదు మీరు ఆయనకిచ్చే భరోసా అన్న విషయం మర్చిపోకండి అన్నాడు నర్సయ్య. “ఎలా మర్చిపోతాం నర్సయ్యగారు, మీరంతా మాకు మరో జన్మని ప్రసాదించారు. ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయము. ముఖ్యంగా మీకు మేము ఎంతో ఋణపడి ఉన్నాం నర్సయ్యగారు. మేనేజరు గారికి మా గురించి తెలియజేసి మేనేజరు గారిని కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం అని యువకులంతా ఆరాధనతో అన్నారు.

నర్సయ్య “అయ్యో మాదేముంది నాయనా, ఆ మహానుభవుడు ఆశయాలను కాపాడటం మా విధి. అలాంటిది ఆయనే మిమ్మల్ని స్వయంగా పంపించారు. మిమ్మల్ని మార్చడంలో మేము విఫలమైతే అంతకు మించిన వైఫల్యం మరొకటి ఉండదు. ఆయనకు మా మొహాలను చుపించలేము. మీరు మా గౌరవాన్ని నిలబెట్టారు అన్నాడు నర్సయ్య.

“నర్సయ్య గారు, మీరు ఏమంటున్నారో, ఎవరికోసం చెప్తున్నారో మాకు అర్ధం కావట్లేదు. దయచేసి కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి అన్నారు ఆశక్తిగా ఆ నలుగురు యువకులు. అదే బాబు, మిమ్మల్ని ఇక్కడకు పంపించారు కదా, ఆ మహానుభావుని గురించి అన్నాడు నర్సయ్య. ఆయన మీ స్నేహితుడు కదా నర్సయ్యగారూ, ఆశ్చర్యంగా అడిగాడు మరో యువకుడు. అది ఆయన గొప్పతనం. నిజానికి ఆయన నా స్నేహితుడు కాదు, నా యజమాని, మా అందరి యజమాని, లక్షల మంది ఉద్యోగులకు యజమాని, ఇంకా చెప్పాలంటే లక్షల కోట్ల ఆస్తికి యజమాని, అతడే వివాన్ ఆదిత్య వర్మ, ది ఫౌండర్ ఆఫ్ వివాన్ ఆదిత్య గ్రూప్స్. ఆయన మా దేవుడు. మీరు స్వయంగా మా దేవుడు కాపాడిన ప్రాణాలు. అందుకే మీరు వచ్చినప్పటి నుండి మేనేజర్ గారు మీ మేలు కోసం ఇంతలా తాపత్రయం పడ్డారు” అని తన యజమాని గురించి రొమ్ము విరిచి గర్వంగా చెప్పాడు నర్సయ్య. 

“ఏంటి! ఈ కంపెనీకి ఫౌండర్ ఆ అడవిలో కట్టెలు కొట్టే పెద్దాయనా, అని వారిలో యువకుడు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయాడు. అంతలో నర్సయ్య అతనికి ఏమైంది అని కంగారు పడ్డాడు. ఇక్కడకి వచ్చినప్పటి నుండి అన్ని షాకింగ్ విషయాలే చూస్తున్నాడు, మరేం పర్వాలేదు నర్సయ్య గారు,, కానీ ఆయనకు అక్కడ కట్టెలు కొట్టాల్సిన అవసరం ఏమిటి? ఆ గుడిసెలో బ్రతకాల్సిన కర్మ ఏంటి? దయచేసి మాకు ఆయన కోసం పూర్తిగా చెప్పండి అని ఆశ్చర్యపోతూ అడిగారు ఆ యువకులు. సరే, అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. 

దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం వివాన్ ఆదిత్య గారు ఇదే భవంతిలో నివాసం ఉంటూ ఎన్నో వ్యాపారాలు చేసేవారు. అప్పట్లో ఆయన ఈ ప్రాంతానికే ధనవంతుడు. చిన్నప్పటి నుండి అనేక సామజిక కర్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు, తన మంచితనంతో ప్రజలందరి మనస్సును గెలుచుకున్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అతని కష్టంగా భావించేవారు. ఒకరోజు తన స్నేహితునికి వ్యాపారంలో నష్టం వచ్చి ఆత్మ హత్య చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళినట్లు అతని కుటుంభీకుల ద్వారా వార్త అందింది.

ఆదిత్య వర్మ గారు ఉన్న ఫలంగా తన కారులో అడవిలోకి బయల్దేరారు. తన స్నేహితునికోసం పిచ్చివాడిలా అడవంతా గాలించాడు. ఆ అడవిలో ఒకే ఒక ఎత్తైన ప్రదేశం అతనికి కనిపించింది. బహుశ అతను అక్కడ నుండే ఆత్మ హత్యకు ప్రయత్నిస్తూ ఉండొచ్చని అంచనా వేసి పరుగున కొండ ఎక్కడం ప్రాంభించారు. శిఖరానికి చేరుకొని తన స్నేహితుడ్ని కనుగొన్నాడు. అతను ఇంకా దూకడానికి సిద్దంగా ఉన్నాడు. ఆదిత్య వర్మ గారు గట్టిగా ఆరిచారు. కానీ అంతలోనే అతను కిందకి దూకేసాడు. వెంటనే క్రిందకు దిగి రక్తపు మడుగులో ఉన్న తన స్నేహితుడ్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు తమ సాయశక్తులా ప్రయత్నించి అతని ప్రాణాలని కాపాడారు. కానీ దురదృష్ట వశాత్తూ అతని రెండు కాళ్ళు తీసేయాల్సి వచ్చింది. కాళ్ళు పోగొట్టుకున్న ఆ అభాగ్యుడు, ఆదిత్య వర్మ గారి స్నేహితుడు మరెవరో కాదు మా మేనేజర్. 

అప్పటికే పీకల లోతు అప్పులలో మునిగి ఉన్న తన స్నేహితుడు నన్ను ఎందుకు బ్రతికించావురా ఇక్కడ నేను బ్రతికేందుకు అవకాశాలు లేవు అని బాధపడటం ఆదిత్యవర్మ గారి హృదయాన్ని కలచివేసింది. ఆ సమయంలో ఆదిత్య వర్మ అతన్ని ఓదార్చుతూ “అవకాశం ఉంది, ప్రాణం కంటే ఖరీదైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు” అని మరో ఆలోచన లేకుండా అతని ఆస్తిని, వ్యాపారాలను అన్నింటినీ అమ్మి అతని అప్పు తీర్చేసాడు. ఆదిత్య వర్మకి చివరిగా మిగిలిన ఒకే ఒక ఆస్తి ఈ భవంతి. తన స్నేహితుడికి కాళ్ళు లేవు కనుక ఈ భవంతి ద్వారా బ్రతుకు తెరువు కల్పిస్తూ ఆయన కోసం ఇక్కడే ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అన్ని ఉన్నా ఏమీ లేని మహారాజుగా అతని జీవితం మళ్ళీ ఇక్కడి నుండి అడుగులు వేసింది. మరోవైపు తన స్నేహితుడు కాపాడిన ప్రాణాలకు ప్రతీ క్షణం విలువ కట్టి, కష్టపడుతూ వ్యాపారాన్ని మేనేజరు గారు అభివృద్ధి పథంలో నడిపించడం మొదలుపెట్టాడు.

అంతా సజావుగా సాగుతున్న సమయంలో సహజంగా ప్రకృతి ప్రేమికులైన ఆ స్నేహితులు ఇద్దరూ సరదాగా అదే అడవిలోకి వెళ్లారు. నడవలేని అతని స్నేహితునికి తానే కాళ్ళుగా మారి ప్రకృతి అందాలను చూపిస్తూ ఎంతో సరదాగా గడుపుతున్న క్షణంలో, తీవ్ర మనో వేదనతో గబా గబా నడుచుకుంటూ ఒక వ్యక్తి అడవిలో ఒంటరిగా ప్రయాణించడం ఆదిత్య వర్మ గారు గమనించారు. అనుమానం వచ్చిన ఆయన తన స్నేహితుడ్ని కారులో కూర్చోబెట్టి ఆ వ్యక్తిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాడు.

ఆ అడవిలో అతని ప్రయాణం ఒక ఎత్తైన ప్రదేశం దిశగా అని ఆదిత్య వర్మ గారికి అర్ధం అయింది. అనుకున్నట్టుగానే ఆ వ్యక్తి అదే కొండను ఎక్కడం ప్రారంభించాడు. శిఖరానికి చేరుకున్నాక ఊహించినట్టుగానే అతను అక్కడి నుండి ఆత్మ హత్య చేసుకుందామని ప్రయత్నించాడు. ఆదిత్య వర్మ గారు వెంటనే స్పందించి ఆ వ్యక్తికి కూడా ప్రాణభిక్ష పెట్టారు. అతని సమస్యలు అన్నిటినీ తీర్చేసారు. మరో నిజం ఏటంటే ఆరోజు ఆదిత్య వర్మ గారి చేతుల మీద ప్రాణభిక్ష పొందిన ఆ రెండవ అదృష్టవంతుడ్ని నేనే” 

Self Motivation Story

ఆరోజు ఆదిత్య వర్మ జీవితంలో ఒక సంఘటన జరిగింది. యథా విధిగా తన వ్యాపార కార్యకలాపాల కోసం వెళ్తున్న ఆయనకు ఒక ఎనిమిది పదుల వృద్దురాలు ఎదురయ్యింది. “అయ్యా, నేను మిమ్మల్ని కలుసుకోవాలని చాలా దూరం నుండి వస్తున్నాను. మీ గురించి చుట్టు పక్కల గ్రామాల్లో విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆరేళ్ళ క్రితం నా కొడుకు కుడా అదే కొండపై ఆత్మ హత్య చేసుకున్నాడు.

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి వాడే సర్వస్వంగా బ్రతుకుతున్ననాకు శేష జీవితమంతా దుర్లభంగా మారిపోయింది. నా దృష్టిలో ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చింది కేవలం జీవించడానికి మాత్రమే, ఒక వ్యవధి ముగిసాక అతనికి జీవించాలి అని కోరిక ఉన్నప్పటికీ అది అసాధ్యం. ఈ ప్రకృతి మనకి జీవించడానికి అవసరమయ్యే గాలి, నీరు, వెలుతురు అన్నిటినీ సమకుర్చుతోంది. ప్రాణి మనుగడకు కావాల్సిన వనరులన్నీ ఉచితంగా అందిస్తుంది. ఆస్తులు, అంతస్తులు, డబ్బు, హోదా ఇంత సంక్షిప్త జీవితానికి మనిషి ఏ మేరకు అవసరం అని భావిస్తాడో ఆ మేరకు ఈ సుడిగుండంలో చిక్కుకుంటాడు. అతను వచ్చిన కార్యాన్ని మరిచి వ్యామోహాల కోసం ప్రాణాలని విడిచి పెడుతున్నాడు. ప్రాణానికి ఖరీదు లేదు, ప్రకృతిలో మమేకమై జీవించినప్పుడు మాత్రమే మనిషి తన ప్రాణం విలువ గ్రహించగలుగుతాడు. 

అయ్యా, మీరు కాపాడిన ప్రాణాలే మీకు ఎనలేని సిరి సంపదలు. తన బ్రతుకు తాను బ్రతికలేక తనువు చాలిస్తున్న సమాజంలో ఇతరుల ప్రాణాలు కాపాడటం, అలాగే కేవలం జీవించడానికి వచ్చిన ఒక సాధారణ మనిషి ఇతరులకు జీవితాన్ని ప్రసాదించే స్థాయిలో ఉండటం నిజానికి దైవానికి ఉండే లక్షణం. గడిచిన ఆరేళ్ళలో అదే కొండపై నా కొడుకుతో పాటుగా మరెందరో తమ ప్రాణం విలువ తెలియక ప్రపంచాన్ని వదిలేసారు. ఇప్పటికీ నిరంతరం వదిలేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాకు జీవించి ఉండేందుకు రోజు రోజుకి వ్యవధి సన్నగిల్లుతోంది. నా వంతు బాధ్యతగా ఎవరికైనా సహాయపడదాము అనుకున్నా ఈ శరీరం సహకరించడం లేదు. ఇటువంటి సమయంలో మీలాంటి గొప్పవారి కోసం వినగానే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. మీరు చల్లగా ఉండాలి” అని చెప్పి ఆ అవ్వ వెళ్ళిపోయింది. 

ఆ రోజు రాత్రి ఆదిత్య వర్మకు నిద్రపట్ట లేదు. మనిషి కేవలం జీవించడానికి మాత్రమే ఈ భూమి మీదకు వచ్చాడు అనే అవ్వ మాటలు ఆదిత్య వర్మను ఎంతో ఆలోచింపజేసాయి. ఉదయాన్నే నన్ను, మేనేజరు గారిని తక్షణమే రావాలని కబురుపంపారు. మేము ఇద్దరం హుట హుటిన అక్కడకి చేరుకున్నాం. ఆదిత్య వర్మ గారు చూసి “మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు మీ జీవితాన్ని గెలుచుకున్నారు, కాబట్టి ఈ జీవతం మీకు ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది.

అలాగే ఇకపై మనకి కొన్ని బాధ్యతలు కూడా ఉండబోతున్నాయి. నేటి నుంచి మన వ్యాపార బాధ్యతలు మీ ఇరువురికి పూర్తిగా అప్పగిస్తున్నాను. నా మిగిలిన జీవితాన్ని ప్రాణం విలువ తెలిసిన మనిషిగా ప్రకృతి ఒడిలో బ్రతకడానికి నిశ్చయించుకున్నాను” అని చెప్పి అన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని పట్టుకుని మా వద్దకు వచ్చాడు. అతని పేరు విశ్వేశ్వరయ్య. అప్పుడే మాకు అర్ధం అయింది ఆయన అడవికి వెళ్ళడంలో పరమార్ధం. ఆ క్షణం నుండి మాకు ఆయన దేవుడుగా కనిపించారు. ఈరోజు ఆయన కాపాడిన వందలాది ప్రాణాలకు ప్రతిరూపమే ఈ ‘వివాన్ ఆదిత్య గ్రూప్స్’. అని చెప్పి ముగించాడు. 

సాయంత్రం ఐదు గంటల సమయం, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఎర్రని సూర్యకాంతి, విశాలమైన ప్రకృతి ఒడిలో ఆకాశాన్ని దర్పణంగా పట్టిన ఒక పెద్ద నీటి ప్రవాహం, దాని ఎదురుగా బండరాతిపై వరుసగా కూర్చున్న నలుగురు యువకులు, చేతిలో గాలంతో చేపలు పడుతూ పిచ్చాపాటి కబుర్లతో సంతోషంగా ఉన్నారు. అంతలో దూరంగా ఒక యువకుడు వేగంగా నడుస్తూ తీరని వేదనతో లోతైన జలపాతం వైపు ప్రయాణించడం గమనించారు.

జలపాతం వద్దకు చేరుకోగానే లోయలోని నీటిని చూస్తూ ఆ యువకుడు, “ప్రియా, నీ ప్రేమ లేకపోతే ఈ జీవితం వృధా, నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి, నువ్వు తప్ప. నువ్వు లేని ఈ జీవితం బ్రతికినా శూన్యం. నీ లోటు ఈ ప్రపంచంలో మరేదీ పూరించలేదు. మళ్ళీ జన్మలోనైనా నిన్ను నా సొంత చేసుకుంటాను” అంటూ అతను తన ఆవేదనని వెల్లగాక్కుతున్నాడు. అదంతా గమనిస్తున్న ఆ యువకులలో ఒకడు “ఏంటి చూస్తున్నారు, నర్సయ్యకు లెటర్ రెడీ చేయండి, ఇంకా చూస్తారేం?” అన్నాడు. “ఒరేయ్ మొద్దు, ఇది కొత్తరకం సమస్య. నర్సయ్య దగ్గరకి పంపిస్తే నర్సయ్యని పైకి పంపేస్తాడు. వాడికి అన్నీ ఉన్నాయంట ఆ అమ్మాయి తప్ప. వీడిని డీల్ చేయాలంటే ఆ ముసలి బ్యాచ్ వల్ల కాదు. వీడికి మనమే కరెక్ట్. సరే నేను పరిష్కారం ఆలోచిస్తాను ముందు మీరు వెళ్లి వాడ్ని ఆపండి” అన్నాడు ఇంకో యువకుడు. సరే’ అని మిగిలిన వాళ్ళు ముందుకి కదిలారు. 

ఈ నలుగురు యువకులు తప్ప అందరూ ఆదిత్య వర్మ చూపిన దారిలోనే నడిచారు. వీళ్ళు మాత్రం ఆయన లాగే నడిచారు. ఆయన స్థానం సంపాదించగలిగారు.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!