విచక్షణ
best telugu fairy stories 2021
ఒకానొక పురాతన సామ్రాజ్యంలోని ప్రజలు మరియు పాలకులు రాబోయే విపత్తుల నుండి తమ రాజ్యాన్ని ఒక యోధుడు వచ్చి రక్షిస్తాడని విశ్వసించేవారు. అయితే ఆ యోధుడు రహస్యంగా రాజసౌధం లోనికి దొంగలా ప్రవేశిస్తాడని, తర్వాత రాజ మన్నన పొంది రక్షణ బాధ్యతను స్వీకరిస్తాడని వారి పూర్వీకులు చెప్పేవారు. ఆ వార్త ఆనోటా ఈనోటా తిరిగి పొరుగున ఉన్న ఒక దోపిడీ ముఠా చెవిన పడింది. ఎప్పటి నుండో రాజుగారి సింహాసనంలో అమర్చిన అపురూప వజ్రాన్ని కాజేయడానికి అది తమకు ఒక అద్భుతమైన అవకాశంగా వారు భావించారు. దొంగల ముఠాలోని ముగ్గురు కరుడుగట్టిన దొంగలు వజ్రాన్ని దొంగిలించడానికి పన్నాగం పన్నారు. అనుకున్నట్టుగానే తమకి అనుకూలంగా భావించిన ఒక రోజున రహస్యంగా ఆ కోటలోనికి ప్రవేశించారు.

కోటలోని రక్షణ సిబ్బంది కళ్లుగప్పి దొంగలు ఎంతో చాకచక్యంగా కోటలోనికి చొరబడ్డారు. తర్వాత నేరుగా రాజప్రాసాదం లోనికి ప్రవేశించి సింహాసనానికి అలంకరించబడిన అపురూపమైన వజ్రాన్ని పెకిలించే ప్రయత్నం చేసారు.
వజ్రాన్ని ఎలాగైనా సాధించాలని దొంగలు దానిని పెకిలించే ప్రయత్నంలో తీవ్రంగా నిమగ్నం అయ్యారు. అంతలో ఆ వజ్రం నుండి వింత కాంతులు కోట నలువైపులా ప్రసరించడం ప్రారంభమయ్యాయి. దొంగలు వెంటనే అప్రత్తమై కోటలో చెరోవైపు పరుగులు తీసి దాక్కున్నారు.
అత్యవసర గంటలు మ్రోగడంతో మహారాజు మేల్కొని వెంటనే సింహాసన ప్రాంగణానికి చేరుకున్నాడు. భటులు అన్ని వైపులా గాలించి ఆ ముగ్గురు దొంగలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని బంధించి తీసుకువచ్చి మహారాజు ముందు ప్రవేశపెట్టారు.
ప్రణాళిక బెడిసికొట్టడంతో దొంగలు స్వీయ ఆత్మరక్షణ సందిగ్ధతలో పడ్డారు. ముందుగా వారిలో ఒక దొంగ అతడు తమ రాజ్యాన్ని కాపాడడానికి వచ్చిన యోధుడిని అని దొంగలైన ఇద్దరు వ్యక్తులను పట్టించడానికి వచ్చానని చెప్పుకున్నాడు. మహారాజు తన పొరపాటుకి చింతించి మిగిలిన ఇద్దరు వ్యక్తులను బంధించమన్నాడు.
భటులు మహారాజ ఆజ్ఞమేరకు వెంటనే మొదటి దొంగను విడిచిపెట్టి మిగిలిన ఇద్దరినీ బంధించారు. వెంటనే రెండవ దొంగ ప్రతిఘటించి అతడే వారు విశ్వశించే యోధుడిగా మిగిలిన వారు వజ్రాన్ని కాజేయడానికి వచ్చిన దొంగలుగా పేర్కొన్నాడు. అంతలో మూడవ దొంగ కలగజేసుకుని మొదటి ఇద్దరూ అబద్దాలు చెబుతున్నారని, నిజానకి ఆ యోధుడు నేనే అని, నన్ను కోల్పోతే మీ విశ్వాసాలు అన్నీ కలగానే మిగిలిపోతాయి అని హెచ్చరించాడు.
మహారాజు ఏమీ చేయలేని సందిగ్ధంలో పడ్డాడు. సమస్య పరిష్కారానికి వెంటనే మహామంత్రిని రప్పించాడు. మహామంత్రి రాజు వద్దకు చేరుకొని విషయం అంతా విన్నాడు. వారు తీసుకునే నిర్ణయం రేపు పొరపాటు అని తేలితే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుందని, కాబట్టి ఎంతో జాగ్రత్త నడుచుకోవాలని మహారాజుకి సూచించాడు. అలాగే పరిష్కారంగా యోధుడు ఎవరో నిర్ణయించే అవకాశాన్ని ప్రజలకే వదిలేయాలని సలహా ఇచ్చాడు.
- ఈ కథలను కూడా చదవండి
- బుద్ది జీవులు – best Moral Story in Telugu 2021
- వృందన వనం – Lion King Story
మంత్రి సూచన మేరకు మరుసటి రోజు యోధుని కోసం బహిరంగ ఎన్నికల విధానం అమలు చేయబడుతున్నట్టు మహారాజు ఆ రాజ్యంలో ప్రకటించాడు. తర్వాత భారీ పరిమాణం కలిగిన నాలుగు పెట్టెలను తెప్పించి వాటిలో మూడు పెట్టెల మీద “ఇతడే మన యోధుడు” అని రాయించాడు. మరొక పెట్టె మీద “వీరిలో యోధుడు లేడు” అని రాసి ఉంచాడు. మొదటి మూడు పెట్టెలను ముగ్గురి దొంగలకు ఎదురుగా వేర్వేరుగా ఉంచాడు. నాలుగో పెట్టెను ఒంటరిగా మరో ప్రక్క ఉంచాడు.

ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాజ్యంలోని ప్రజలు తమ యోధుడిని చూసేందుకు మరియు యోధుడిని స్వయంగా ఎన్నుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. కొంతమంది ప్రజలు ముఖవర్చస్సు బట్టి మొదటి వ్యక్తి తమ యోధుడిగా భావించి “ఇతడే మన యోధుడు” అని చీటీలు రాసి అతడికి ఎదురుగా ఉన్న పెట్టెలో వేసారు. మరికొంత మంది ప్రజలు రెండవ దొంగ యొక్క దేహదారుఢ్యాన్ని చూసి అతడే మన యోధుడు అని నిర్ధారణకు వచ్చారు. ఇంకొంతమంది ప్రజలు మూడవ వ్యక్తి యొక్క వాగ్ధాటిని చూసి అతడే తమ యోధుడు అని రాసి పెట్టెలో వేసారు.
చీకటి పడింది. ఎన్నికల సమయం ముగిసింది. దాదాపు లక్ష ఓట్లు నమోదు జరిగి ఉంటుందని మహామంత్రి అంచనా వేసాడు. అంత ఎక్కువ మోతాదులో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కనీసం వారం రోజులు సమయం కావాలని అతడు మహారాజుని కోరాడు.
మరుసటి రోజు ఉదయం నుండి భారీ జన సమూహం ఎదుట ఒక ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండు రోజుల సమయంలో మొదటి దొంగ ప్రస్తుతానికి అత్యధికంగా ఓట్లను కలిగి ఉన్నాడు. అతడికి ఓట్లు వేసిన జనం ఒక వర్గంగా చీలిక ఏర్పరుచుకుని అతడే మా దేవుడు అని కోలాహలంగా వేడుకలను ప్రారంభించారు. అతడి చిత్ర పటాలను గీయించి వాటికి పాలాభిషేకాలు, ఊరేగింపులతో వీధుల వెంట నడిచారు.
తర్వాత రెండు రోజుల సమయం ముగిసే సరికి మొదటి దొంగని దాటి రెండవ దొంగ అత్యధిక ఓట్ల సంఖ్యతో ముందుంజలో ఉన్నాడు. అతడికి ఓట్లు వేసిన ప్రజలు కూడా ఒక వర్గంగా ఏర్పడి యోధుడు అంటే బలశాలిగా ఉండాలని, బక్క పీనుగులాంటి మీ నాయకుడు యోధుడు ఎలా అవుతాడు అని వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రారంభించారు. అలా ఇరువర్గాల ప్రజల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. ఎందరో తీవ్రంగా గాయపడ్డారు. స్వల్పంగా ప్రాణనష్టం కుడా సంభవించింది.
చివరి రెండు రోజుల సమయం వచ్చింది. మూడవ దొంగ నెమ్మదిగా మొదటి ఇద్దరు దొంగలను దాటుకుంటూ ముందుంజ లోనికి చేరుకున్నాడు. అతడికి ఓట్లు వేసిన జనం కూడా మరో వర్గంగా ఏర్పడి మొదటి రెండు వర్గాలతో విభేదిస్తూ వాగ్ధాటికి మించిన శౌర్యం మరొకటి ఈ ప్రపంచంలో లేదని, ఒక యోధుడికి ఉండాల్సిన అసలైన లక్షణం మా నాయకుడికే సొంతం అని తిరగబడ్డారు.
ఆ విధంగా మూడు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు, దాడుల నడుమ ఎందరో అమాయకులు బలి అయ్యారు. ఎందరో నిరాశ్రయులుగా మారి రోడ్డున పడ్డారు. ఎందరో తమ వాళ్ళను కోల్పోయి అనాధలుగా మిగిలిపోయారు. రాజ్యం మొత్తం అశాంతి నెలకొంది. జరిగిన పరిణామాలకు రాజు ఎంతో కుంగిపోయాడు. అయినప్పటికీ తమ రక్షకుడి కోసం ఓర్పుతో చివరిగా మిగిలి ఉన్న పెట్టెను లెక్కించి యోధుడు ఎవరో ప్రకటన చేయాలని వేచియున్నాడు.
- ఈ కథలను కూడా చదవండి
- ప్రాణం ఖరీదు – Best Self Motivation Story
- ఏది విజయం – Inspiring Stories of Success
- గుప్త నిధి – గుడ్డి లక్ష్యం – Best motivational story in telugu
- క్రోధం – Best motivatonal story in telugu
చివరి రోజు సభ ప్రారంభం జరిగింది. దాదాపుగా మూడవ దొంగ తమ యోధుడని దేశవ్యాప్తంగా ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చేసారు. బాణా సంచలతో, మేళ తాళాలతో దేశం కిక్కిరిసి పోయింది. మూడవ దొంగ మిగిలిన ఇద్దరి వద్దకు వెళ్లి నేను యోధుడిని అని ప్రకటించగానే మిమ్మల్ని విడుదల చేయిస్తాను అని హామీ ఇచ్చాడు. అంతలో చివరి పెట్టె లెక్కింపుకు ప్రారంభించమని సేవకులకు మహారాజు ఆజ్ఞాపించాడు.
సభ అంత నిశ్శబ్దంగా మారిపోయింది. సేవకులు పెట్టె కప్పు తెరిచి లోపలకి చూసారు. లెక్కించడం మానేసి అలా చూస్తూ నిలబడిపోయారు. మహామంత్రి కోపంగా పెట్టె వద్దకు వెళ్తూ “లెక్కించకుండా అలా చూస్తారేం” అని గర్జించాడు. భటులు మహామంత్రి దగ్గరకు రాగానే తలలు దించుకుని దూరంగా జరిగారు.
మంత్రి పెట్టెలోకి చూసాడు. వెంటనే మహారాజు వైపునకు తిరిగి మహారాజా ఇక మీరు యోధుడిని ప్రకటించవచ్చు. ఈ పెట్టెలో కేవలం ఒక ఓటు మత్రమే నమోదు జరిగింది. దీనిని లెక్కించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనిని విస్మరించి ఫలితాలను వెల్లడించండి అని నమస్కరించాడు.
మహారాజు మాట్లాడుతూ “మహామంత్రి, మనం ఈ ఎన్నికను ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించడం జరిగింది. అందువల్ల మహారాజుకి రాజ్యంలోని ప్రతీ పౌరుడి అభిప్రాయం విలువైనదే. ఇందులో ఏదీ విస్మరించడానికి లేదు. ఆ ఒక్క వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి అప్పుడే నేను యోధుడిని ప్రకటిస్తాను” అని మహారాజు పేర్కొన్నాడు.
- ఈ కథలను కూడా చదవండి
- మరచిపో నేస్తమా – Heart touching story with moral
- ధర్మ సంకటం – An unconditional love of a father
- వక్రీకరణ | Best inspiring stories in telugu 2021
- సాలిగ్రామ యోధుని కథ – A warrior of self confidence
మహారాజు ఆజ్ఞమేరకు మంత్రి ఆ పెట్టెలోని కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. “అయ్యా! నా ఒక్కగానొక్క కుమార్తె పెళ్లిని రెండేళ్ళ క్రితం అంగరంగ వైభవంగా జరిపించాను. జీవిత సమస్తం సంపాదించిన కష్టార్జితంతో నా కుమార్తెను మెట్టినింటికి వైభవంగా సాగనంపాలని అనుకున్నాను. సరిగ్గా అటువంటి సమయంలో కొందరు దోపిడీ దొంగలు మమ్మల్ని తీవ్రంగా గాయపరచి దయాదాక్షిణ్యం లేకుండా ఉన్నదంతా దోచుకుపోయారు. దోపిడీ దారులలో ప్రధానమైన ఆ ముగ్గురు దొంగలు రాజ్యానికి కాబోయే యోధులుగా చలామణి అవుతూ ప్రస్తుతం మీ వద్దనే ఉన్నారు. కనుక మొదటిగా నాకు న్యాయం చేసి తర్వాత మీ ఫలితాలను వెల్లడించండి” అని రాసి ఉంది.
దూరంగా నిల్చున్న ముగ్గురు దొంగల కాళ్ళు చేతులు గడగడ వణికిపోయాయి. పరుగుపరుగున మహారాజుకి ఎదురుగా వచ్చి వరుసగా మోకాళ్ళపై కూర్చున్నారు. “క్షమించండి ప్రభూ, మీ ప్రజల విశ్వాసాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని మీ సింహాసనంలో పొదిగిన అపురూపమైన వజ్రాన్ని కాజేయాలని ఈ నాటకానికి ప్రణాళిక చేసాము. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించి వదిలేయండి. మేము ఇప్పటి వరకు దోచుకున్న సొత్తు అంతా అణా పైసాతో సహా ప్రజలకు చేరుస్తాము” అని ప్రాధేయపడ్డారు.

మహారాజు ఆగ్రహంతో లేచి నిల్చున్నాడు. సభలో కుర్చుని ఉన్న ప్రజలు అంతా లేచారు. గంభీరంగా అడుగులు వేస్తూ ఆ ముగ్గురి దొంగల వద్దకు వచ్చాడు. దొంగలు ప్రాణాలు సగం గాలిలో కలిసిపోయేంత పని అయింది. “మీరు ఇప్పటిదాకా దోచుకున్న ధనాన్ని ఎక్కడ దాచారో చెప్పండి” అన్నాడు. ఆ ముగ్గురు దొంగలు ప్రాణ భయంతో గడగడ వణికిపోతూ వివరాలు మొత్తం చెప్పేసారు. మహారాజు సైనుకుల వైపు చూసి “మొత్తం స్వాధీనం చేసుకోండి” అని ఆజ్ఞాపించాడు.
మహారాజు మరో రెండు అడుగులు ముందుకు వేసి మంత్రి చేతిలోని కాగితాన్ని తీసుకుని అందులో రాసి ఉన్న అక్షరాలను పరిశీలించి చూసాడు. “మహామంత్రి, ముందుగా ఈ కాగితం రాసిన వ్యక్తికి న్యాయం అందించాలి. అతడిని వెంటనే పిలిపించండి” అన్నాడు.
మంత్రి భటుల వైపు చూసాడు. వాళ్ళు వెంటనే జనంలోనికి వెళ్లి ఒక పాతికేళ్ళ యువకుడిని వెంట పెట్టుకుని వచ్చారు. దొంగలు ముగ్గురు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అతడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత చిన్న వయష్కుడైన యువకునికి వివాహిత అయిన కుమార్తె ఎలా ఉంటుంది? అని ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఆ యువకుడు నడుచుకుంటూ మహారాజు వద్దకు వచ్చి గౌరవంతో నమస్కరించాడు. మహారాజు తన మంత్రివైపు చూసి “మహామంత్రి, ఇతడే ఈ రాజ్యానికి రక్షకుడిగా వచ్చిన యోధుడు. వెంటనే ఈ ప్రకటనను దేశ నలుమూలలా వ్యాప్తి చేయండి” అన్నాడు.
మంత్రి ఆశ్చర్యంతో “మహారాజా, మీరు ఏమంటున్నారు? ఇతడు మిమ్మల్ని మోసం చేసాడు. మిమ్మల్ని తప్పు త్రోవ పట్టించే ఉద్దేశ్యంతో ఒక అబద్దాన్ని ఆకతాయిగా రాసి ఎన్నికల పెట్టెలో ఉంచాడు. దాని వలన అనుకోకుండా మంచి జరిగినప్పటికే చేసిన తప్పుకు అతడు శిక్షార్హుడు. దయచేసి మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించమని ప్రార్ధన” అని తలను దించి నమస్కరిస్తూ ప్రక్కకు తప్పుకున్నాడు.
“మహామంత్రి, నేను అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను. ఇందులో ఏ సందేహమూ లేదు. ఇక వెంటనే అమలు చేయండి” అన్నాడు. మహామంత్రి “చిత్తం మహా ప్రభూ” అంటూ ఆ వార్తను దిశ దిశలా వ్యాప్తి చెందేలా ఏర్పాట్లను చేసాడు.
అంతా చూస్తూ ఆశ్చర్యంతో అయోమయంలో ఉన్న ఆ యువకుడు సభాసమక్షంలో మహారాజు మరియు మంత్రి వద్దకు వచ్చి “ప్రభూ, నేను మీరు అనుకున్న వ్యక్తిని కాదు. నిజానికి నేను మీ కోట ఆవరణలో ఉన్న పూదోటలో గులాబీలను అపహరించి నా ప్రేయసికి అలంకరిస్తాను అని నా స్నేహితులతో పందెం కాసాను. సరిగ్గా అదే సమయంలో కోటలోకి అక్రమంగా చొరబడుతున్న ఈ ముగ్గురు దుండగులను చూసాను. వాళ్ళని రహస్యంగా వెంబడించాను. ఆ ప్రయత్నంలో వాళ్ళు మీ సింహాసనాన్ని అలంకరించిన వజ్రాన్ని అపహరించడానికి వచ్చారని నాకు అర్ధం అయింది. వెంటనే కోటలోని బద్రతా బలగాలను అప్రమత్తం చేసే విధంగా గోడలకు అలంకరించిన అద్దాలను ఉపయోగించి మిరుమిట్లు గొలిపే కాంతి వజ్రం నుండి ప్రసరిస్తున్నట్టు బ్రాంతిని కలిగించాను. అందరి దృష్టిని వజ్రం మీదకు మరల్చి నేను తాపీగా ఉద్యానవనంలో పుష్పాలను కోసి పందెంలో గెలిచాను.

కానీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ముగ్గురు దొంగలు శిక్షించబడటానికి బదులు ఈ రాజ్యానికి యోధులుగా చెలామణి అయ్యేందుకు కుట్ర పన్నారని తెలుసుకున్నాను. వాళ్ళ దోపిడీ కుట్రను బయటపెట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా కాగితం రాసి పెట్టెలో వేసాను. స్వభావరీత్యా దొంగలైన ఆ వ్యక్తులు ఈ మర్మం తెలియక నిజాలను ఒప్పుకుని మీకు చిక్కిపోయారు అన్నాడు.
ఇదంతా విన్న మహామంత్రి రాజు వద్దకు వచ్చి “ఆహా! మహారాజా, మీ దృక్పదం, సమయస్పూర్తి ఒక అద్భుతం. అంటే వాళ్ళ ముగ్గురూ దొంగలని మీకు ముందే తెలుసు కదా? అన్నాడు. మహారాజు మాట్లాడుతూ “తెలుసు మహామంత్రి. సింహాసనంలోని వజ్రం కాంతులను వెదజల్లింది అని వీరు అన్నప్పుడే కోటలోకి వీళ్ళు కాకుండా మరొక వ్యక్తి కూడా చొరబడ్డాడని నాకు అర్ధం అయింది. ఈ ముగ్గురు ఈ దేశ రక్షకుడిని వెలికితీయడానికి ఎరలు మాత్రమే” అన్నాడు. దూరంగా మోకాళ్ళపై కూర్చుని చూస్తున్న దోపిడీ దొంగలు ఒకరి ముఖాలు ఒకరు అమాయకంగా చూసుకున్నారు.
తర్వాత మహారాజు తమ జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు. “ఎన్నోమార్లు ప్రజాస్వామ్యం అనే పదజాలంతో కొంతమంది ఉద్యమకారులు అధికార, పాలనా వ్యవస్థల స్వేచ్ఛకోసం నిరసన జ్వాలలను రగిలించారు. ఆ విధానంలో ఎటువంటి న్యాయ బద్దమైన పరిపాలన, ధర్మ స్థాపన జరుగుతుందో గమణిద్దామని ప్రజాస్వామ్య బద్దమైన ఎన్నికల విధానం ప్రవేశ పెట్టాను. కాని అమాయకులైన మీరు మీ నాయకుడిని ఎంచుకోవడంలో కనీస జ్ఞానం ప్రదర్శించలేకపోయారు. ప్రజాస్వామ్య విధానంలో వర్గ వైషమ్యాలకు ఎప్పుడైతే మీరు త్రావుని కల్పిస్తున్నారో ఆక్షణమే అది ఇటువంటి నేరస్తులకు, దోపిడీదార్లకు మీరే స్వయంగా చట్టబద్దమైన ఆసరా కల్పిస్తారు. మీ కళ్ళు మూసుకుపోయి మీలో మీరే కొట్టుకుని చస్తారు.
- చివరి బోనస్‍గా క్రింది అద్భుతమైన కొటేషన్స్ చదవండి.
- 50+ best quotes on life in telugu
“ప్రస్తుతం ఈ సమాజంలో ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మా పాలనలో దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. భవిష్యత్తులో ఈ విధానాన్ని ప్రజలు ఒకవేళ తీవ్రంగా కాంక్షిస్తే నాయకుడికి సంబంధించిన పెట్టెతో పాటు వీరిలో ఎవ్వడికి నాయకుడు అయ్యే అర్హత లేదు అని పేర్కొనే మరొక పెట్టెను ప్రత్యేకంగా ఉంచాలి. దాని విలువను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి” అని భావితరాలకు సూచన చేస్తూ మహారాజు సభని ముగించాడు.
మీలో ప్రస్తుతం ఎంతమందికి ఆ ప్రత్యేకమైన పెట్టె (నోటా) కోసం అవగాహన ఉంది. మెజారిటీ వైపు మొగ్గు చూపడం, మా కులం వాడు కాబట్టి మావాడు, వాడి కంటే – వీడు బెటర్ అని ఆలోచించే మనస్తత్వం నుండి అందరూ బయటపడాలని కాంక్షిస్తూ…
మీ తెలుగు సంహిత…
.