క్షణికం
Telugu Moral Stories
ప్రాణ స్నేహితుడు కళ్ళముందే గల్లంతు అయినందుకు గుండెలు పగిలేలా రోదిస్తూ ఒక వ్యక్తి అతని ఆచూకీ కోసం పిచ్చి వాడిలా గాలిస్తున్నాడు. భయంకరమైన జల ప్రవాహం ఎదుట మోకాలిపై మోకరిల్లి గట్టిగా అరుస్తూ నిస్సహాయుడై స్పృహ తప్పి నేలమీద పడ్డాడు. మూతలు పడుతున్న అతని కనుబొమ్మల వెనుక వారి స్వచ్చమైన స్నేహం ఇలా కదలాడింది.
భరత్ మరియు హరిహరన్ కటిక పేదరికంలో జన్మించిన ప్రాణ స్నేహితులు. గడిచిన పాతికేళ్ళు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఉన్నతమైన చదువులను అభ్యసించి ప్రస్తుతం ఉద్యోగ సాధనలో నిమగ్నమయ్యారు. వారి జీవితాన్ని అవహేళన చేసిన పేదరికాన్ని జయించాలన్న కసితో ఇద్దరు స్నేహితులూ వారి వారి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసారు. అనుకున్నట్టుగానే ఇద్దరు స్నేహితులు ఒక సంస్థలో మంచి ఉద్యోగాలను సంపాదించారు. వారి ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ వారి ఆలోచనల స్వభావంలో సారూప్యత ఉంది.

భరత్ మరియు హరిహరన్ తమ జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు పదేళ్ళ కాలవ్యవధిని కేటాయించుకున్నారు. అందువల్ల రోజుకి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ అహర్నిశలు శ్రమించడం ప్రారంభించారు. అయితే తమ ఉద్యోగంలో ఎంత ప్రయత్నించినప్పటికీ అనుకున్న ఫలితాలను పొందలేకపోవడంతో భరత్ తన అభివృద్దిని మరింత వేగవంతం చేయాలని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసాడు. సంపాదించిన కొద్దిపాటి మొత్తంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు.
భరత్ అతని రాజీలేని నైపుణ్యాలకు తగిన శ్రమను జోడించి వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. అతను తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుకున్న కాలవ్యవధిలో అర్ధభాగం సమయం క్షణ కాలంలా గడిచిపోయింది. భరత్ తన వ్యాపారం ద్వారా ఆర్జించిన లాభాలు అప్పటికి తన లక్ష్యంలో నాలుగో వంతుగా మాత్రమే ఉన్నాయి.

హరి హరన్ మాత్రం అదే సంస్థలో రాత్రి పగలు అలుపెరగకుండా పనిచేస్తూ అతని తెలివితేటలు ఉపయోగించి ఒక మంచి స్థాయిలో సెటిల్ అయ్యాడు. అతను సంతృప్తికరమైన జీతం పొందుతున్నాడు. అతని నిత్యావసరాలు అన్నీ తీరిపోగా మిగిలిన భాగాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టుకున్నాడు. ప్రస్తుతం హరిహరన్ వద్ద ఉన్న నికర నిల్వలు భరత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.
తమ లక్ష్యంలో అర్ధభాగం సమయం గడిచిన సందర్భంగా ఇద్దరు స్నేహితులు ఒక చోట కలుసుకున్నారు. తాము సంపాదించిన డబ్బు గురించి, వారి లక్ష్యానికి చేరువయ్యే మార్గాల గురించి ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
హరిహరన్ తన సంపాదన గురించి మాట్లాడుతూ మరో ఐదేళ్ళలో అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయినా నాలుగింట మూడొంతులు సంపాదనకు చేరుకోగలను అని తెలియజేసాడు. అలాగే తనకంటే తక్కువ సంపాదన ఉన్న భరత్ గురించి మాట్లాడుతూ ఇదే విధానంలో కొనసాగితే సగం లక్ష్యాన్ని కూడా చేరుకోలేవని హితవు పలికాడు.
తన స్నేహితుడి ముందు తల దించుకున్న భరత్ అతని నిర్ణయాలను మరింత సాన పెట్టాలని దీక్షపూనాడు. మరుసటి రోజు తన వద్దనున్న డబ్బుని అంతా ఒక దగ్గర చేర్చి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడిగా పెట్టాడు.

రెండేళ్ళు గడిచింది. క్రొత్త వ్యాపారం భరత్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. భరత్‌లో నూతన ఉత్సాహం ఉరకలేసింది. వెంటనే అతడు తన స్నేహితుడు హరిహరన్‌కు కబురు పంపాడు. భరత్ పిలుపు మేరకు హరిహరన్ అతన్ని కలుసుకునేందుకు వచ్చాడు.
భరత్ రెండేళ్ళ క్రితం తన వ్యాపార లావాదేవీలతో పాటుగా ప్రస్తుతం లావాదేవీలను చూపించి నికర ఆదాయాన్ని లెక్కించాడు. అలాగే హరిహరన్ ఆదాయాన్ని కుడా లెక్కించి చూసాడు. హరిహరన్ తన ఆదాయంలో సాధారణ వృద్దిని మాత్రమే సాధించగలిగాడు. భరత్ కూడా హరిహరన్ యొక్క వైఫల్యాన్ని గుర్తు చేస్తూ గతంలో అతను చేసిన వాఖ్యలను ప్రస్తావించాడు. హరిహరన్ తలదించుకున్నాడు.
తర్వాత హరిహరన్ ఎలాగైనా తన లక్ష్యానికి చేరుకోవాలని ఆలోచించసాగాడు. తన వద్ద నిద్రాణంగా ఉన్న డబ్బుని స్వయం ఆదాయ వనరులుగా మార్చాలని అనుకున్నాడు. అందుకోసం అతను తన మొత్తం సొమ్మును ఒక సంస్థకు వడ్డీకి ఇచ్చాడు. పెరిగిన తన జీతంతో పాటుగా వడ్డీ రూపంలో వస్తోన్న రాబడిని చూసి తన లక్ష్యానికి గట్టి భరోసా ఇవ్వగలిగాడు. మరోవైపు భరత్ కూడా నూతన ఉత్సాహంతో మిగులు మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి మరో క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు.
సరిగ్గా రెండేళ్ళ కాలం గడిచింది. హరిహరన్ వడ్డీకి ఇచ్చిన సంస్థ దివాలా తీసింది. ఎంతో కష్టపడి అసలు మొత్తంలో సగం మాత్రమే వసూలు చేయగలిగాడు. ఏడాది కాలంలో సంపాదించిన వడ్డీ మరియు అతని నెలసరి జీతం నిల్వలు వెరసి అతని ఆదాయం నాలుగేళ్ళ క్రితం ఆదాయానికి సమానంగా ఉంది.

భరత్ కుడా వచ్చిన లాభాలన్నిటినీ మరో కొత్త వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. మిగిలిన వ్యాపారాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యాపారం మాత్రం సంక్షోభాలతో కుదేలైంది. అతని వద్ద ప్రస్తుత నిల్వలు కూడా సరిగ్గా నాలుగేళ్ళ క్రితం నిల్వలలో సమానంగా ఉన్నాయి.
హరిహరన్ తనకు వచ్చిన నష్టాన్ని గురించి తన స్నేహితుడితో పంచుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందని భావించి అతన్ని కలుసుకునేందుకు వెళ్ళాడు. స్నేహితుడిని చుసిన భరత్ గతంలో అతడిని చులకనగా చేసి మాట్లాడిన సన్నివేశాన్ని తలచుకుని తన అహంకారానికి సిగ్గుపడ్డాడు. హరిహరన్ తనకి వచ్చిన నష్టాలను గురించి భరత్ తో నేరుగా చెప్పడం ప్రారంభించాడు.
పరిస్థితి తనకి అనుకూలంగా ఉందని భావించిన భరత్ కుడా అతనికి వచ్చిన నష్టాలను గురించి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. ఇద్దరూ వారి ప్రయత్నాలలో విఫలమయ్యారని అర్ధం చేసుకున్నారు. పదేళ్ళ లక్ష్య ప్రణాళికలో తొమ్మిదేళ్ళు గడిచిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉన్నవారి సంపాదనను తలచుకుని బోరున ఏడ్చారు.
భరత్ జీవితంలో ఎంతో ముఖ్యమైన తొమ్మిదేళ్ళ కాలం నిష్పలంగా వృధా అయిందని బాధపడుతూ పోగొట్టుకున్న కాలాన్ని హరహరన్ సహాయంతో ఒక్క సంవత్సరంలో భర్తీ చేయాలనీ అనుకున్నాడు. దానికోసం అతను ఎంచుకున్న మార్గం రియల్ ఎస్టేట్ వ్యాపారం. తన వ్యాపార ప్రణాళికను అతను హరిహరన్ ముందు ఉంచాడు. ఎలాగో ఉన్నదంతా పోయింది అనుకుని రిస్క్ అనిపించినా తప్పనిసరి పరిస్థితిలో హరిహరన్ అతని ప్రతిపాదనను స్వీకరించాడు.

ఇరువురు స్నేహితులు వారి వద్దనున్న మొత్తం సొమ్ముని ఒక దగ్గర చేర్చి వారి నివాస పట్టణానికి చేరువలో ఒక భూమిని కొనుగోలు చేసారు. అందుకోసం కొంత డబ్బు అప్పు కుడా చేసారు, కొనుగోలు చేసిన భూమికి కనీస సౌకర్యాలను కల్పించడం ద్వారా చిన్న భాగాలుగా విభజించి అమ్మి డబ్బు చేసుకోవాలని వారి ఉద్దేశ్యం.
సరిగ్గా ఏడాది కాలం గడించింది. ఈ సంవత్సర కాలం అష్టకష్టాల మీద వారు కొనుగోలు చేసిన భూమికి రోడ్డు సౌకర్యం వంటివి కల్పించడానికి వారి సంవత్సర ఆదాయం మొత్తం వెచ్చించారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర నిల్వలు పూర్తిగా శూన్యం. వారికి ఉన్నదంతా కొనుగోలు చేసిన ఆ భూమి మాత్రమే.
వారు అనుకున్నట్టు అక్కడ కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదు. స్నేహితులు ఇద్దరూ ఒకరోజు సాయంత్రం పదేళ్ళ గడువు ముగుస్తున్న సందర్భంగా కలుసుకున్నారు. హరిహరన్ బాధతో తన స్నేహితుడి మీద కోపగించుకున్నాడు. అతన్ని నమ్మి తన డబ్బుని కూడా పెట్టుబడిగా పెట్టినందుకు తనకి తీరని నష్టం జరిగిందని భరత్ మీద విస్తుపోయాడు. హరిహరన్ మాటలను సహించలేని భరత్ కుడా తీవ్రంగా స్పందించాడు. హరిహరన్ మిక్కిలి కోపంతో వెంటనే భూమిని ఎంత వస్తే అంతకు అమ్మేసి తన భాగాన్ని తనకి ఇవ్వవలసినదిగా కోరాడు.
తన ప్రాణ స్నేహితుడైన హరిహరన్ కేవలం డబ్బు కోసం స్పందించిన తీరుకు భరత్ కుంగిపోయాడు. అతని కారణంగా హరిహరన్ భాధ పడకూడదు అనుకుని భూమిని అమ్మేసి తనకి నష్టం వచ్చినా భరించి అతని పెట్టుబడి మొత్తాన్ని అతనికి చెల్లించాలని నిశ్చయించుకున్నాడు.

నెల రోజులు గడిచింది. భూమిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. భరత్ బాగా ఆలోచించి తన మిగిలిన వ్యాపారాలను ఆసరాగా చేసుకుని బ్యాంకు ఋణం కోసం ప్రయత్నించాడు. బ్యాంకు వారు అతని వ్యాపారాలను పరిశీలించి రుణాన్ని మంజూరీ చేసారు. భరత్ ఆ డబ్బు మొత్తాన్ని తీసుకుని హరిహరన్ వద్దకు వెళ్ళాడు.
హరిహరన్ భరత్ తో మాట్లాడేందుకు అయిష్టంగా ఉన్నాడు. అందువల్ల భరత్ ముందుగా చొరవ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. భూమిని కొనుగోలు చేసేందుకు అతను పెట్టుబడి పెట్టిన మొత్తానికి, సంవత్సర కాలం పాటు వడ్డీతో కలిపి అసలు మొత్తాన్ని ఇచ్చేందుకు అక్కడికి వచ్చినట్టు హరిహరన్‌కు చెప్పాడు. హరిహరన్ మరో మాట మాట్లాడకుండా డబ్బు తీసుకుని “ఇకపై నీకు నాకు మధ్య ఎటువంటి లావాదేవీలు కుడా లేవు, ఇంకెప్పుడూ నాతో మాట్లాడాలని ప్రయత్నించకు” అని చెప్పి లోపలకి వెళ్ళిపోయాడు. భరత్ బాల్యం నుండి వారి మధ్య ఉన్న స్నేహాన్ని తలచుకుని దిగులుగా వెనక్కి వచ్చేసాడు.
భరత్ ప్రస్తుతం నిరుపేద. అతని జేబులో చిల్లి గవ్వకుడా మిగిలి లేదు. అతనికి వస్తున్న చిన్నపాటి రాబడులు కూడా తీసుకున్న రుణాలకు వడ్డీలుగా పోతున్నాయి. అతని జీవితంలో ఇది ఎంతో కఠినమైన సమయం. మరోవైపు తన కష్టాలను పంచుకునే తన ప్రాణ స్నేహితుడు కూడా తనతో లేనందున మరింత కుంగిపోయాడు.

హరిహరన్ చేతికి అందిన డబ్బుతో లాభాల బాటలో ఉన్న అతను పనిచేస్తున్న కంపెనీలో షేర్లు కొన్నాడు. అదృష్టవశాత్తు భారీ ఎత్తున షేర్ విలువ పెరగండంతో రెట్టింపు మొత్తంలో అతనికి లాభం వచ్చింది. హరిహరన్ సంతోషంతో మళ్ళీ ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాడు.
ఎంతో కష్టంగా రెండు నెలల సమయం గడిచింది. భరత్ తన నెలసరి రాబడులను సేకరించి బ్యాంకుకు వడ్డీ చెల్లించేందుకు వెళ్తున్నాడు. అంతలో అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి ఎవరు అని అడిగాడు. “మిస్టర్ భరత్, ఎకనామిక్ జోన్ ప్రక్కగా ఉన్న ‘లే అవుట్’ మీదే అని విన్నాము. మేము ఒక ప్రఖ్యాత కంపెనీని మీ ‘లే అవుట్’ ప్రక్కగా నిర్మించాలని భూమిని సేకరించాము. మీకు అభ్యంతరం లేదు అంటే మీ భూమిని కూడా కొనుగోలు చేసి కంపెనీని విస్తరించాలని అనుకుంటున్నాము, భవిష్యత్తులో మీకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మీకు ఒక మంచి రేటుని ఇవ్వాలని అనుకుంటున్నాం” అన్నాడు.
భరత్‌కు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. అదృష్టం అనుకోకుండా వరించింది అని ఎగిరి గంతులు వేసాడు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ “మిస్టర్ భరత్, మా ప్రపోజల్ మీకు ఇష్టం లేదు అంటే చెప్పండి. ఇందులో ఎటువంటి బలవంతం లేదు” అని చెప్పి వారు ఇవ్వదలుచుకున్న రేటుని చెప్పారు. భరత్ మరో మాట లేకుండా రేపు వచ్చి సంతకాలు పెట్టి డబ్బు తీసుకంటాను అని చెప్పాడు.
భరత్‌కు ఆ రాత్రంతా నిద్రరాలేదు. పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దొరుకుతోంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ వారు ఆఫర్ చేసిన మొత్తం భరత్ పెట్టుకున్న పదేళ్ళ లక్ష్యం కంటే రెండు రెట్లు ఎక్కువ. అతను ప్రశాంతంగా నిద్రించి ఏళ్ళు గడిచింది. కానీ ఆరోజు నిద్రలేకుండా గడపడం కూడా అతనికి సంతోషంగా ఉంది.
మరోవైపు హరిహరన్ కు కుడా ఆ రాత్రి నిద్ర లేదు. అతను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన మొత్తం మళ్ళీ రెట్టింపు అయింది. మరింత లాభాలకోసం ఉపసంహరణ చేయకుండా ఆదుర్దాగా రాత్రంతా స్టాక్ మార్కెట్ల వైపు గమనిస్తున్నాడు.
అలా ఆ స్నేహితుల మధ్య తెరచాపలాంటి ఆ రాత్రి తొలగి తెల్లారింది. భరత్ ఎంతో సంతోషంగా బయల్దేరి రిజిస్ట్రేషన్ కోసం కంపెనీకి చేరుకున్నాడు. కంపెనీవారు చెప్పినట్టుగా సూటికేసు నిండా డబ్బుని భరత్ చేతికి అందించారు. భరత్ సంతకాలు చేసి డబ్బు తీసుకుని నేరుగా హరిహరన్ ఇంటికి బయల్దేరాడు.

హరిహరన్ రాత్రంతా నిద్రలేని కారణంగా అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. భరత్ సూటికేసుతో అతని గదిలోకి వెళ్లి అతన్ని లేపడం ప్రారంభించాడు. హరహరన్ నిద్రమత్తులో నెమ్మదిగా లేచి భరత్ ని చూసాడు. వెంటనే నిద్ర మత్తుని వదిలి, భరత్ ను ప్రక్కకు నెడుతూ పరుగు పరుగున వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసాడు. ఏమైందో తెలియక భరత్ మౌనంగా చూస్తున్నాడు.
హరహరన్ తన చేతిని నేల మీద బాదుతూ బాధపడుతున్నాడు. సూటికేసు నేల మీద పెట్టి భరత్ అతని వద్దకు వెళ్లి ఏమైంది’ అని అడిగాడు. “షేర్ మార్కెట్లో డబ్బుని ఇన్వెస్ట్ చేసాను. నిన్న రెట్టింపు లాభాలు వచ్చాయి. కానీ ఈరోజు ఉదయం నుండి షేర్ విలువ పడిపోయింది. నువ్వు వచ్చావు కదా, ఇలాంటి విపత్తులు మాములే. అంతా నా తలరాత” అన్నాడు.

భరత్‌కు అతని స్నేహితుడి మాటలతో అతనితో పంచుకోవాలి అనుకున్న ఆనందం అంతా కూలిపోయింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకున్నాడు. హరిహరన్ మిగిలిన షేర్లను ఉపసంహరిస్తూ సరే, నువ్వు రావడం కాస్త ఆలస్యం అయితే నేను పెట్టిన పెట్టుబడి కూడా మిగిలేది కాదు. థాంక్స్, అన్నాడు.
భరత్ నెమ్మదిగా తలను ఎత్తి హరిహరన్ ను చూసాడు. హరిహరన్ కంప్యుటర్లో ఉపసంహరించిన షేర్ల డబ్బుని చూస్తూ, “నాకు ఎలాగో సంపాదించడం చేతకాలేదు. కనీసం నువ్వు అయినా ఈ డబ్బు తీసుకుని ఏదైనా ప్రయత్నించు” అన్నాడు. “సరే ప్రయత్నిస్తాను, ముందు నీకో సర్ప్రైజ్” అని సూటికేసు తెరిచి అందులోని సగం డబ్బు తీసి అతని స్నేహితుడికి ఇచ్చాడు. ఇదిగో పదేళ్ళ మన కష్టానికి ప్రతిఫలం అన్నాడు.
హరిహరన్ అంత డబ్బుని చూసి నిర్ఘాంతపోయాడు. ఇంత డబ్బు ఎక్కడిది అని ఆశ్చర్యంగా అడిగాడు. భరత్ జరిగిన విషయం అతనికి చెప్పాడు. హరిహరన్ చాలా సంతోషపడ్డాడు. డబ్బుని చేతిలోకి తీసుకుని ఇలా అన్నాడు. “నిజానికి ఈ డబ్బు మీద నాకు ఎటువంటి హక్కు లేదు. ఆరోజు నీ వద్ద డబ్బు తీసుకుని పంపివేసినప్పుడే ఆ భూమిపై నాకు సర్వ హక్కులు పోయాయి. ఇప్పుడు ఈ డబ్బు తాకడానికి కూడా కనీసం నాకు అర్హత లేదు అన్నాడు.
భరత్ అతడి భుజం మీద చేయి వేసి “ఇందాక పదేళ్ళ కష్టాన్ని ఏమీ ఆశించకుండా మళ్ళీ నాకు ఇచ్చేస్తాను అన్నావు, అంతకంటే అర్హత మరొకటి ఉంటుందా? ఇక్కడ నీది నాది అంటూ ఏదీ లేదు. ఇద్దరం కలసి కష్టపడ్డాము. కేవలం కష్టానికి తగిన ప్రతిఫలం దొరకలేదు అన్న బాధ తప్ప నీకు నా మీద ఎటువంటి ద్వేషం లేదు” అన్నాడు. హరిహరన్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నన్ను క్షమించరా అని దీనంగా అడిగాడు.
భరత్ హరిహరన్ భుజం మీద చేయివేసి, “పదేళ్ళ కష్టానికి ఈరోజే మనకి ప్రతిఫలం దొరికింది. ఇది బాధ పడాల్సిన సమయం కాదు, ఎంతో సంతోషపడాల్సిన విషయం. ఇక నుండి మనకి ఏ కష్టాలు లేవు. ఈ ఆనందాన్ని సెలిబ్రేట్ చేసుకోవడానికి రేపు మనం ఒక విహార యాత్రకి వెళ్తున్నాం. నెల రోజులపాటు అంతా మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం” అన్నాడు. హరిహరన్ సరే అన్నట్టు తలను ఊపాడు.
భరత్ ఆరోజు హాయిగా నిద్రపోయాడు. ఆరోజు పదేళ్లుగా లేని ఎంతో ప్రశాంతత అతనిలో కనిపించింది. తన గతాన్ని, పడిన కష్టాలను తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. గడిచిన రాత్రి నిద్ర లేని కారణంగా గాడ నిద్రలోనికి జారుకున్నాడు. జీవితంలో అంతటి ప్రశాంతతని అనుభవించినట్టు అతను ఎన్నడూ ఎరగడు. అంతలోనే ఫోన్ రింగ్ అయింది.

నిద్రమత్తులో లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు. హరిహరన్ మాట్లాడుతూ, ఏరా ఇంటర్యూకి తొమ్మిది గంటలకు వెళ్ళాలి అన్నావు ఇంకా లేవలేదా అన్నాడు. అసలు ఏమంటున్నాడు వీడు అని మనసులో అనుకుని అర్ధం కాక “ఏరా, ఇంటర్వూ ఏంటి” అన్నాడు. “నిన్న కొట్టిన బీర్ ఇంకా దిగలేదా, ముందు లేచి కాస్త మొహం కడుక్కో” అన్నాడు హరిహరన్.
భరత్ గుండె వేగంగా కొట్టుకుంది. ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసాడు. పరిగెత్తుకుని వెళ్లి అద్దంలో తనని తాను చూసుకున్నాడు. తను ఇంకా కాలేజీ కుర్రాడిలా ఉన్నాడు. పదేళ్ళ ప్రణాళిక, కష్టాలు, భూమి కొనడం, భూమి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు, అంతా కల అని అప్పుడు అతనికి అర్ధం అయింది.

భరత్ అతని స్నేహితుడు హరిహరన్ తో కలసి ఇంటర్వ్యూకి బయల్దేరాడు. దారిపొడవునా తన చేతిని మరో చేతితో గిల్లుకుంటూ ఉన్నాడు. అప్పటి నుండి ప్రతీక్షణం అతని జీవితంలో ఇంతకు ముందే జరిగిన సన్నివేశంలా అతనికి అనిపిస్తోంది.
ఇంటర్యూ పూర్తి అయింది. వారి ఇద్దరికీ ఆ ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, వారు కోరుకున్న జీవితం వారి కళ్ళముందే ఉన్నప్పటికీ భరత్ మనుసులో ఎదో ఆలోచనలు. హరిహరన్ తో తనకు వచ్చిన కలను గురించి పంచుకోవాలని అనుకున్నాడు. కానీ ప్రతీ మనిషికీ ప్రతీ రోజు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. దానికోసం చర్చించడం సమయం వృధా అనుకున్నాడు.
బయటకు రాగానే హరిహరన్ ఆ సంతోషంలో పదేళ్ళ ప్రణాళిక కోసం మాట్లాడాడు. వచ్చిన జీతంతో ఎలా తమ లక్ష్యాన్ని చేరుకోవాలో వివరించడం ప్రారంభించాడు. భరత్‌కు చెమటలు పడుతున్నాయి. హరిహరన్ కు మాత్రం భరత్ ప్రవర్తన అర్ధం కాలేదు. ఎందుకంటే అతని ముఖంలో ఉద్యోగం వచ్చిందన్న ఆనందం మచ్చుకైనా కనిపించడం లేదు.
హరిహరన్ అతని స్నేహితుడి మూడ్ బాగోలేదని గమనించి దగ్గరలోని ఒక నదీ లోయ ప్రవాహం వద్దకు వెళ్దామని అన్నాడు. భరత్ కూడా తన మనసులోని ఆందోళనలు మరచి ప్రశాంతత పొందడానికి అది సరియైన ప్రదేశం అని భావించి ‘సరే’ అన్నాడు.

ఇద్దరూ కలసి లోయలో ప్రవహిస్తున్న ఒక అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని చేరుకోగానే భరత్ అంతా మర్చిపోయాడు. కేరంతలు కొడుతూ సరదాగా గంతులు వేసాడు. తన ప్రాణ స్నేహితుడితో మధురమైన జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడానికి ఫోటోలను తీసుకుంటూ లోయ చివరి అంచున నిల్చున్నాడు. అనుకోకుండా కాలు జారింది. భరత్ భయంకరమైన నదీ ప్రవాహంలో క్షణిక కాలంలో కొట్టుకుపోయాడు.
తన ప్రాణ స్నేహితుడు అతని కళ్ళముందే గల్లంతు అయినందుకు గుండెలు పగిలేలా రోదిస్తూ హరిహరన్ భరత్ ఆచూకీ కోసం పిచ్చివాడిలా గాలిస్తున్నాడు. భయంకరమైన జల ప్రవాహం ఎదుట మోకాలిపై మోకరిల్లి గట్టిగా అరుస్తూ నిస్సహాయుడై స్పృహ తప్పి నేలమీద పడ్డాడు. హరిహరన్ కళ్ళు మూతలు పడ్డాయి. ఆ నిర్మానుష్య ప్రదేశంలో అతను పూర్తిగా స్పృహ తప్పిపోయాడు.

అంతలో హరిహరన్ ఫోన్ రింగ్ అవుతోంది. అతని మెదడులో చలనం కలిగింది. కానీ కాళ్ళు చేతులు బిగుసుకున్నాయి. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంతో కష్టం మీద ఫోన్ లిఫ్ట్ చేసి “హలో భరత్, నీకు ఏమైంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు?” అని ఆదుర్దాగా అడిగాడు. భరత్ మాట్లాడుతూ, “ఏరా ఇంటర్యూకి తొమ్మిది గంటలకు వెళ్ళాలి అన్నావు, నువ్వు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావు. మళ్ళీ నాకు ఏమైంది అని అడుగుతున్నావా, నిన్న కొట్టిన బీర్ ఇంకా దిగలేదా, ముందు లేచి కాస్త మొహం కడుక్కో” అన్నాడు.
భరత్ స్పృహలోకి వచ్చాడు. పైన వేగంగా తిరుగుతోన్న ఫ్యాన్ కనిపించింది. చుట్టు ప్రక్కల కంగారుగా చూసాడు. ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. దేవుడికి థాంక్స్ చెప్పుకుని సంతోషంగా ఇంటర్వ్యూ కోసం బయల్దేరాడు.
మీలో ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇలాంటి భావనలు కలుగుతూ ఉండవచ్చు. అది మీ గత స్మృతులు కావచ్చు లేదా భవిష్యత్తులో జరగాల్సిన విషయాలు కావచ్చు. ఏది గతం, ఏది భవిష్యత్తు, ఏది వర్తమానం నిజంగా ఎవ్వరూ ఉహించలేరు. ఏ ఉనికిలో ఉన్నప్పుడు అదే వాస్తవం అని జీవించడమే ఒక సాధారణ మనిషిగా మనం చేయగలిగింది. చేస్తోన్నది కూడా.

Recommendations for a healthy and balanced diet pharma mix 4 archinteriorమీ వందేళ్ళ జీవితం ఎదో ఒకరోజు అకస్మాత్తుగా ఒక కలగా అనిపించవచ్చు లేదా మీ నిజమైన జీవితం కేవలం మీ కలలో భాగం కావొచ్చు. మీ గతం వ్రేలి మీద లెక్కించే సంక్షిప్త జ్ఞాపకాల సమూహం.
Telugu Samhitha
Nice