మరచిపో నేస్తమా
Heart touching story with moral
ఓ నిస్సహాయురాలైన మాతృ మూర్తి రోజువారీ గృహ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా తన పాతికేళ్ళ కుమారుడి గదిని శుభ్రం చేస్తోంది. అదే సమయంలో తన భర్త ఉద్యోగ విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడని గమనించిన ఆమె అతనికి సపర్యలు చేసేందుకు తొందరపాటులో అక్కడే ఉన్న ఒక చెక్క సొరుగుని ఢీ కొట్టి అదుపు తప్పి నేలకొరిగింది. తలకి బలమైన గాయం తగిలి ఎంతో బాధపడుతూ విలవిలలాడుతున్న ఆమె ఒక్కసారి బాధను మరచి చలనం లేకుండా నిర్ఘాంతపోయి, సొరుగు నుండి బయటపడి తన చేతికి దొరకిన ఒక డైరీని చూస్తోంది.
హడావిడిగా అక్కడకి వచ్చిన ఆమె భర్త ఆ దుస్థితిలో ఆమెను చూసి ఎంతో ఆందోళన చెందుతూ ఆమెకు కావాల్సిన ప్రధమ చికిత్సను అందించాడు. గాయం బాధిస్తున్నా ఆ తల్లి ఆలోచనలు మాత్రం ఇంకా ఆ డైరీ మీదనే ఉన్నాయి. రాత్రి భోజనం ముగించి ఆమె భర్త నిద్రపోయాడు. ఆమె మాత్రం డైరీ కోసం ఆలోచిస్తూ ఉంది. ఇతరుల డైరీని చదవడం భావ్యం కాదు అని ఆమెకి తెలుసు. కానీ ఆమెకి తన కొడుకు కంటే మరొక ప్రపంచం లేదు. అందుకే డైరీని చదవాలని నిశ్చయించుకుంది. తక్షణమే ఆమె ఆ డైరీని తెచ్చి ఒక్కో పేజీ చదవడం ప్రారంభించింది.

ఆమె ముఖ కవళికలు ఒకసారి మాతృ మూర్తిగా మరోసారి సాంప్రదాయ స్త్రీ మూర్తిగా ద్విపాత్రాభినయం చేస్తూ ఉన్నాయి. తన కొడుకు ఒక స్త్రీకి ఇచ్చే గౌరవానికి ఆమె ఎంతో గర్వపడింది. అలా రాత్రంతా ఆ డైరీలోని పేజీలన్నీ చదువుతూ ఒక్కో పేజీని నిమురుతూ మాతృ స్పర్శను అక్షరాల ద్వారా ఆమె ఆశ్వాదిస్తోంది. ఆమె కళ్ళ వెంట నీళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అలా బరువెక్కిన హృదయంతో డైరీని చివరి పీజీ వరకు చదవడం పూర్తిచేసింది. అక్కడి నుండి ఖాళీ కాగితాలు ఉన్నాయి. చివరి పేజీలో రాసి ఉన్న మాట “ఈరోజు మన ఇద్దరికీ గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు మన శ్వాస ఉన్నంత వరకు శాశ్వతంగా నిలిచిపోయేలా నిలిచిపోతాయి. నిన్ను ఎంత త్వరగా చూస్తానా అని ఉంది. మొదటిసారిగా నిన్ను కలుసుకోవాలన్న తపనతో ఎంతో ఆదుర్దాగా వస్తున్నా నిహారికా …(రెండేళ్ళ క్రితం తేదీతో)
తను నిర్వర్తించాల్సిన ఎదో బాధ్యతను ఆమె కొడుకు అప్పగించాడని అర్ధం అయింది. అందుకని డైరీలో పేర్కొన్న ఒక ముఖమైన రోజు కోసం ఆమె వేచి చూస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఆ రోజు రానే వచ్చింది. చేరుకోవాల్సిన ప్రదేశేం వంద మైళ్ళ దూరంలో ఉంది. ఆమె ఒంటరిగా తన వద్దనున్న డైరీ తీసుకుని సూర్యోదయం అవ్వకముందే అక్కడకు బయల్దేరింది. దారంతా ఆమె చదివిన అక్షరాలకు ప్రతిరూపాన్ని ఎలాగైనా చూడాలి అన్న ఆకాంక్ష. అనుకున్న సమయానికే ఆమె అక్కడకు చేరుకుంది. ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాంటి అందమైన ప్రదేశం ఒకటి తనకి చేరువలోనే ఉందని ఆమెకు ఏనాడూ తెలియలేదు. అక్కడి అందమైన ప్రకృతిలో సెలయేరుల సవ్వడులు, పక్షుల కిలకిల ధ్వనుల మధ్య మంచువానలో రంగు రంగుల పుష్పాలు ఆనందతాండవం చేస్తున్నాయి.

ఆ అద్భుతమైన సుందర దృశ్యాల నడుమ ఆమె ఓ వైపు ప్రకృతిని ఆశ్వాదిస్తూ మరో వైపు ఎవరికోసమో వెతుకుతూ ముందుకు కొనసాగుతోంది. అక్కడకి కనుచూపు మేరలో ఒక పెద్ద వృక్షం, ఆ పక్కనే ఒక జలధార, భూలోక స్వర్గంగా కనిపిస్తున్న ఆ ప్రదేశంలో ఓ అతిలోక సుందరి ప్రకృతి ఒడిలో వికశించిన పుష్పంలా ఒక చెక్క బల్లపై కుర్చుని ఎవరికోసమో వేచి చూస్తోంది. ఆమె వేసుకున్న దుస్తుల రంగు తన కొడుకుకి ఎంతో నచ్చిన రంగు. తన అంతరాత్మ ఖచ్చితంగా తను వెతుకుతున్నది ఆమె కోసమేనని ఉద్ఘటిస్తూ ఉన్నది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆమె ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంతో ముందుకు కదులుతోంది. ఆమెను దూరంగా గమనిస్తున్న ఆ యువతి “ఆమె ఎవరు, ఎందుకు ఈ సమయంలో ఇక్కడకి వస్తున్నారు?” అన్న సంశయంతో ప్రశ్నార్ధకంగా ఆమె వంక తదేకంగా చూస్తోంది.

కాసేపట్లో ఆమె ఆ యువతి వద్దకు చేరుకుని “నిహారికా” అని పిలవడం ప్రారంభించింది. ఆ యువతికి ఏమీ అర్ధం కాక నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళలో ఎదో నిరాశ. తన ప్రశ్నలకు ఎదో సమాధానం దొరుకుతోంది అన్నట్లుగా తలనుఊపింది
Heart Touching Story
రెండేళ్ళ క్రితం – సమయం ఉదయం ఆరు గంటలు: సూర్య కిరణాలు చెట్ల కొమ్మల చాటుగా సన్నని మెరుపు తీగలవలె కిటికీలోంచి ప్రసరించి, నిద్రిస్తున్న ఓ కోమలాంగిని స్పర్శించడానికి ఆరాటపడుతున్నట్టుగా ఆమె కనుబొమ్మలను తాకుతున్నాయి. ఉదయ భానునితో దోబూచులాట మొదలైందా అన్నట్టు తక్షనమే దుప్పటిని తీసి నీవు నన్ను తాకలేవు అన్నట్టు ఆమె తన కళ్ళను కప్పేసుకుంది. అంతలోనే సెల్ ఫోన్ బీప్ మొదలైంది. మరో సూర్యుడు ఈ దోబూచులాటలో చేరాడని ఆమెకి అర్ధం అయింది.

కానీ ఈసారి ఏదో ఉత్సాహం. తన చేతులు మొబైల్ వైపుకి మళ్ళాయి. దుప్పటి ముసుగులో నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె తన సెల్ ఫోన్ చూస్తోంది. “గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్, మరో సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు,” అనే ఒక సందేశం. వాస్తవానికి అదే ఆమెకి అసలైన సూర్యోదయం. అతనే సూర్య. రెండేళ్ళ క్రితం పరిచయం అయ్యాడు. తన హృదయంలో ఎన్నో రంగులు నింపిన అతను ఎలా ఉంటాడో ఇప్పటికీ ఆమెకి తెలియదు. బహుశా చరవాణి పరిచయానికి ప్రతిరోజూ నూతనత్వం కలిగించాలన్న తపనతో కాబోలు.
సమయం ఉదయం తొమ్మిది గంటలు: నగరం శివారు ప్రాంతంలోని ఒక అందమైన ప్రదేశంలో ఆమె తన స్నేహితురాలితో ఉంది. ఆమె గుండెల నిండా ఏదో తెలియని భారం. ఆమె ఊపిరి తన మనసుకు ఊరట కలిగించేందుకు అందీ అందనట్టు గుండెలను చేరుతోంది. రెండేళ్ళు నిరీక్షించిన ఆమె ఇప్పుడు ఒక్క క్షణం కూడా తన మనసుని నిలువరించలేకపోతోంది. అలా అంతటి ఆదుర్దాతో తన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది. తర్వాత ఎటూ తోచని స్థితిలో మొబైల్ తెరిచి అతని సందేశాల జ్ఞాపకాలను తధేకంగా చూస్తోంది. “ఈరోజున నీకు ఇష్టమైన ప్రదేశంలో మనం కలుసుకోబోతున్నాం, ఈరోజే కాదు మనం మన జీవితంలో నీ ప్రతీ పుట్టిన రోజుని అక్కడే జరుపుకుందాం”. అంతలో స్నేహితురాలు గట్టిగా తట్టడంతో ఆమె స్పృహలోకి వచ్చింది. సమయం పదకొండు కావొస్తోంది. రెండు గంటలు గడిచినా అతని నుండి ఎటువంటి సందేశం లేకపోవడంతో ఆమె స్నేహితురాలు అక్కడ నుండి వెళ్ళిపోదామని తనని కోరింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అతని నైజం అని రెండేళ్ళ అతని పరిచయంలో ఆమెకి బాగా తెలుసు. అందుకని అతను వచ్చే వరకు ఎదురు చూస్తానని చెప్పి ఆమె తన స్నేహితురాలిని అక్కడ నుండి పంపేసింది.
సమయం సాయత్రం నాలుగు గంటలు: ఆమె ఆహారం ఏమీ తీసుకోలేదు. తన ప్రియనేస్తం కొరకు వేచియుండటంలో కూడా ఆమె ఎంతో సంతోషాన్ని వెతుక్కుంది. అతడి కోసం తెచ్చిన గులాబీ వాడిపోయింది. కానీ ఆమె హృదయంలో వికసించిన ప్రేమ గులాబీ ఇంకా మొగ్గలు తొడుగుతూనే ఉంది. ఆమె వేచియున్నందుకు ఏమాత్రం చింతించలేదు. ఆమెకి ఉన్న విచారమంతా అతన్ని చూడకుండా ఉండలేను అన్న దిగులు మాత్రమే.

ఎంతో అల్లరిగా దోబూచులాడే సూర్యుడు ఈరోజు ఎందుకో ధీనంగా ఆమె వైపు చూస్తూ అస్తమించడం ప్రారంభించాడు. చివరికి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్తున్నావా అన్నట్టు ఆమె సూర్యుని కేసి జాలిగా చూసింది. గుప్పెడు గుండెలో మెదులుతున్న అనేక ప్రశ్నలతో ఆమె మనసు ఎంతో కలతగా ఉంది. బరువెక్కిన హృదయంతో అతడికి మరొక్క సారి ఫోన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తూ అతని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది.
నాలుగేళ్ల తర్వాత – నిద్రిస్తున్న ఆమె హటాత్తుగా ఉలిక్కిపడి లేచింది, ఇంకా తెల్లవారలేదు. కానీ ఆమె హృదయంలో ఏదో సవ్వడి మొదలైంది. రోజూ వద్దన్నా వచ్చి నిద్రకు అవాంతరం కలిగించే వ్యక్తి ఈరోజు మాత్రం త్వరగా రాలేదు అని విస్తుపోయింది. ఎప్పుడు తెల్లారుతుందా అని గడపను చూస్తూ సంఖ్యలు లెక్క పెట్టుకుంది. ఎంతో కష్టం మీద సూర్యోదయం ప్రారంభం అయింది. ఒక్క క్షణం కూడా అలక్ష్యం చేయకూడదు అని భావించి క్షణాల్లో అతనికి నచ్చిన రంగు డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయింది.

ఉద్యాన వనంలో ఉదయకాంతుల నడుమ కురుస్తున్న తెల్లని మంచులో అతని చేయి పట్టుకుని ఒక బల్ల మీద కూర్చున్న ఆమె మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎడబాటుని సహించలేని పసి మనసుతో ఒదార్పు కొరకు ఆమె అతని భుజాల మీద వాలిపోయింది. ఈ క్షణం ఇలానే ఉండిపోవాలి అనుకుంటూ గాలిని గట్టిగా నిట్టూర్చి అతని హృదయాన్ని తెరుస్తున్నట్టుగా తన చేతిలోని డైరీ తెరచి చివరి పేజీని చూస్తోంది.

“నేస్తమా, నీవెవరో ఎలా ఉంటావో నాకు తెలీయదు. కానీ నిన్ను తలచుకుంటే చాలు, నాలో చెప్పలేని ఉత్సాహం వస్తోంది. అలాంటి నీ పుట్టిన రోజు సందర్బంగా నీకు కానుకగా ఇచ్చేంత విలువైనది ఈ ప్రపంచంలో నాకు ఏదీ కనబడటం లేదు, అందుకని నేరుగా నా హృదయాన్ని అర్పించాలని నిన్ను చేరుకోవడానికి తక్షణమే వస్తున్నాను. ఈరోజున మన జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను దాచుకుందాం. నిన్ను ఎంత త్వరగా చూస్తానా అని ఉంది. ఇంకా వేచి యుండలేను … ఐ లవ్ యూ సో మచ్, నిహారికా” (నాలుగేళ్ళ క్రింద సరిగ్గా ఇదే రోజు తేదీతో)

కళ్ళ నుంచి అకస్మాత్తుగా కన్నీలు ధారలుగా కారుతున్నాయి. డైరీని గట్టిగా గుండెలకు హత్తుకుని గుండెలు పగిలేలా రోధించింది. “అవును మన జీవితాంతం సరిపడే జ్ఞాపకాలను దాచుకుందాం” అని ఫెల్లుకువస్తున్న దుఃఖాన్ని ఎగమింగుతూ నేలకొరిగింది, కాసేపటికి కళ్ళు తుడుచుకుని చిరునవ్వు నవ్వింది. తర్వాత అతని సాంగత్యంలో ఎరుపెక్కిన బుగ్గలతో సిగ్గుపడింది. వెనువెంటనే అతని మీద అలిగింది, మరి కాసేపటికి అంతా మర్చిపోయి ముసి ముసిగా నవ్వుతూ అతనితో సరదాగా మాట్లాడటం ప్రారంభించింది, క్షణ క్షణం మారిపోయే ఆమె అందమైన హావభావాలతో, వారి ప్రేమలోని ఎన్నో మధుర క్షణాలని తలచుకుంటూ వారి మధ్య సంభాషణ.….. బహుశా ఇంకా కొనసాగుతూనే ఉంది.

“మీ ప్రేమ ఎంత శక్తివంతమైనది అయినా, మీ గమ్యం ఎంత ముఖ్యమైనది అయినా, విధి వీటన్నింటికీ అతీతమైనది. అధికవేగంతో ప్రయాణం ఎంతో ప్రమాదకరం. అది మీ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుంది. ఎన్నో గుండెలను చిధ్రం చేస్తుంది”
– తెలుగు సంహిత