ఈర్ష్య
Jealousy over the growth of others
కోసింగి అనే గ్రామంలో రామభద్రుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రామభద్రుడు దగ్గరిలోని అడవి అంతా గాలించి కొండ కోనల్లో తేనెను సేకరించి అమ్మి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రామభద్రుడు తేనె సేకరించడంలో ఎంతో నేర్పరి కావడం చేత ఆ ప్రాంతంలో దాదాపు సగం కంటే ఎక్కువ తేనెను అతడే సేకరించేవాడు. అందువలన ఆ గ్రామంలో అతని మీద అసూయపరులు రాను రానూ పెరుగుతూ వచ్చారు.
రామభద్రుడు పొరుగింటిలో నివాసం ఉండే భూషణం అనే వ్యక్తి రోజంతా కష్టించి కేవలం ఒకటో రెండో తేనె పట్టులను సేకరించగలిగేవాడు. రామభద్రుడు సంపాదనతో ప్రతీ క్షణం తన ఆదాయాన్ని పోల్చుకుని ఈర్ష్యతో రగిలిపోయేవాడు. భూషణం యొక్క స్వభావం తాను ధనువంతుడు కావాలన్న కోరికకంటే రామభద్రుడి కంటే ధనవంతుడు కావాలన్నది అతని లక్ష్యంగా ఉండేది.

భూషణం ఒకరోజు, రామభద్రుడు మోసపూరితమైన విధానాలను అనుసరించి మిగిలిన వారికి లభించకుండా అడవిలో తేనె మొత్తాన్ని దోపిడీ చేస్తున్నాడని అబద్ధపు ప్రచారం చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా అతని మీద చర్యలు తీసుకోవాలని తోటి సహ కార్మికులను ప్రేరేపించాడు. భూషణం మాటలు కాస్త లాభదాయకం అనిపించడంతో మిగిలిన వారికి కూడా అవి ఉపశమనం కలిగించాయి. ఆ విధంగా గూడుపుఠాని చేసి గ్రామంలో ఒక సభను ఏర్పాటు చేసి రామభద్రుడిని అక్కడకి పిలిపించారు.
సభకు చేరుకున్న రామభద్రుడిని గ్రామసభలో దోషిగా నిలబెట్టి అతని వృత్తిపై గ్రామస్తులు కొన్ని షరతులు విధించేలా పన్నాగం చేసాడు భూషణం. ఆ షరతుల ప్రకారం రామభద్రుడు ఇక మీదుట సేకరించిన తేనె నుండి నాలుగింట మూడొంతులు, గ్రామంలోని అదే వృత్తి చేస్తున్న వారికి ఇవ్వవలసి ఉంటుంది. రామభద్రుడు అన్యాయమైన ఈ చర్యకు బాధతో ఎంతగానో ప్రతిస్పందించినప్పటికీ సభలో పెద్దలు సైతం మోసపూరిత వ్యక్తుల ప్రలోభాలకు తలొగ్గినందుకు ఏమీ చేయలేకపోయాడు.

మరుసటి రోజు నుండి రామభద్రుడు తన సమయాన్ని మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాలని తలచి సూర్యోదయం అవ్వగానే అడవిలోకి బయల్దేరాడు. చీకటి పడే వరకు శ్రమించి గతంలో కంటే కొంచెం ఎక్కువ తేనెను సేకరించాడు. భూషణం మరియు అతని సహచర కార్మికులు మాత్రం రాబోతున్న వాటాలను దృష్టిలో ఉంచుకుని స్వల్ప శ్రమతో దొరికిన తేనెను పట్టుకుని ఇంటికి వచ్చేసేవారు. రామభద్రుడు రోజంతా సేకరించిన తేనెతో గ్రామంలో అడుగుపెట్టగానే వాటాల కోసం భూషణం మరియు అతని అనుచరులు సిద్ధంగా ఉండేవారు. రామభద్రుడు తను తెచ్చిన తేనె నుండి మూడొంతులు వాళ్ళకి అప్పగించి మిగిలిన భాగంతో ఇంటికి చేరుకునేవాడు.
రామభద్రుడి భార్య సుజాతమ్మ తన భర్తకు జరుగుతున్న అన్యాయానికి చింతిస్తూ స్వార్ధపరులైన భూషణం మరియు అతని అనుచరులకు తగిన బుద్ధి చెప్పాలని అనుకుంది. తగిన ఉపాయం కోసం అందులోని లోటు పాట్లు తెలుసుకోవాలని భావించి తన భర్తతో పాటు ఒకసారి అడవికి తీసుకెళ్ళమని కోరింది. రామభద్రుడు తన భార్య కోరిక మేరకు తీసుకెళ్తానని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే అతని భార్యని వెంట తీసుకుని అడవిలోకి వెళ్లాడు.

రామభద్రుడు మొదటిగా ఒక చెట్టు మీద తేనె పట్టుని గుర్తించి చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. ఎంతో చాకచక్యంగా కొన్ని నిముషాల్లోనే తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తలు పడుతూ తేనెపట్టు నుండి తేనె సేకరించాడు. అయితే అందులో ఒక గమ్మత్తయిన విషయం సుజాతమ్మ గమనించింది. తేనెపట్టులో తేనెటీగలు చెదరకుండా యథా స్థానంలో ఉంచి తేనెను మాత్రమే సేకరించ గలగడం రామభద్రుడి నైపుణ్యంలో భాగం. ఆ తేనెపట్టు వారం రోజులు తిరిగేలోపు తిరిగి నిండుగా కనిపించేది. ఆ కారణం చేత అతనికి తేనెపట్టులను గుర్తించడానికి మిగిలిన వారికి పట్టే సమయం మినహాయింపుగా ఉండేది.
ఎప్పటి లాగానే తాము సేకరించిన తేనె నుండి మూడొంతులు ఆ గ్రామంలో పంచి రామభద్రుడు, సుజాతమ్మ దంపతలు ఇంటికి చేరుకున్నారు. రామభద్రుడి తేనె సేకరణ నైపుణ్యాలను గ్రహించిన సుజాతమ్మ రాత్రంతా బాగా ఆలోచించి తన పుట్టినింటి గ్రామంలో నివాసము ఉండే ఒక మోతుబరి వ్యాపారి దామోదరానికి తనకు వచ్చిన ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచనని తెలియజేస్తూ లేఖను రాసింది. స్వతహాగా లాభార్జనకు ఆశక్తి కలిగిన దామోదరం లేఖ అందిన వెంటనే రెక్కలు కట్టుకుని కోసంగి గ్రామంలో వాలిపోయాడు.

గ్రామానికి వచ్చిన దామోదరం రామభద్రునితో చెప్పి అక్కడ పెద్దలతో గ్రామ సభను ఏర్పాటు చేయించాడు. ఆ సభకు భూషణం మరియు అతని సహచర తేనె కార్మికులను కూడా రమ్మని చెప్పాడు. సభకు అందరూ చేరుకున్న తర్వాత దామోదరం మాట్లాడుతూ ఇక మీదట రామభద్రుడు సేకరించిన తేనె మొత్తం పూర్తిగా గ్రామానికి చెల్లిస్తాడని, అతను మాత్రం రామభద్రుడు వద్ద నుండి కేవలం తేనెటీగలను కొనుగోలు చేస్తానని అందుకు అనుమతిని ఇవ్వాలని చెప్పాడు. అలాగే అందుకు ప్రతిఫలంగా రామభద్రుడికి స్వల్ప మాత్రమైన సొమ్మును చేల్లిస్తానని, అందులో ఎవరూ ఎటువంటి వాటాలను ఆశించరాదని పేర్కొన్నాడు.
భూషణం మరియు అతని అనుచరులు రామభద్రుడి వాటా కుడా తమకే ఇచ్చేస్తూ ఉండటంతో పట్టరాని ఆనందంలో దామోదరం తెచ్చిన ఒప్పంద పత్రంలో సంతకాలు చేసారు. గ్రామం లోనికి ఒక డబ్బున్న పిచ్చివాడు వచ్చాడని మాట్లాడుకుంటూ గ్రామ ప్రజలు సభ ముగించుకుని అందరూ ఇళ్ళకు చేరారు.
ఇంటికి చేరుకున్న రామభద్రుడు తన భార్య ఆలోచన అర్ధం కాక అయోమయంలో ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోయాడు. భూషణం మాత్రం తనకు వచ్చే లాభం కంటే రామభద్రుడి కంటే ధనవంతుడు కావాలన్న ఆశ నెరవేరుతున్నందుకు సంతోషంలో అందరికీ విందు ఏర్పాటు చేసి పండగ చేసుకున్నాడు.

మరునాడు ఉదయాన్నే రామభద్రుడు అడవిలోకి వెళ్లి తేనె సేకరణ ప్రారంభించాడు. సాయంత్రం వరకు కష్టించి నాలుగు వంతుల తేనె సేకరించి గ్రామానికి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న భూషణం మరియు ఇతర గ్రామస్తులకు రామభద్రుడు తాను తెచ్చిన తేనెను పూర్తిగా ఇచ్చేసాడు. తేనె సేకరించిన తర్వాత బంధించిన తేనెటీగలను దామోదరం పంపిన మరొక వ్యక్తికి ఇచ్చాడు. అతను వాటిని తీసుకుని కొంత సొమ్ముని రామభద్రుడికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళ పాటు భూషణం కష్టించకుండానే రామభద్రుడి కష్టార్జితంతో కొంత డబ్బుని కూడబెట్టుకున్నాడు. రామభద్రుడు మాత్రం చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని కష్టంగా నెట్టుకుంటూ శ్రమనే నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు.
ఇంకొన్నాళ్ళ తర్వాత రాను రానూ రామభద్రుడు సేకరించిన తేనె పరిమాణం తగ్గుతూ వచ్చింది. రామభద్రుడు ఎంత ప్రయత్నించినప్పటికీ గతంలో కంటే ప్రస్తుతం చాలా తక్కువ పరిమాణంలో తేనెను సేకరించగలుగుతున్నాడు. అందువలన మిగిలిన వారితో పంచుకోగా వచ్చిన మిగులు భూషణం ఖర్చులకు కుడా సరిపోని పరిస్థితికి వచ్చింది. అప్పటి నుండి ఎటూ తోచని స్థితిలో భూషణం అలాగే మిగిలిన వారు కూడా తేనె సేకరణకు పూర్తి స్థాయిలో శ్రమను నిమగ్నం చేయడం ప్రారంభించారు.

భూషణం సేకరించిన తేనె పరిమాణం రామభద్రుడు పంచిన వాటా తేనె కలుపుకుని అమ్మినా అతని పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఎమీ చేయలేని స్థితిలో భూషణంతో పాటు గ్రామం లోని మిగిలిన తేనె కార్మికులు తమ గ్రామాన్ని విడిచి పొరుగున ఉన్న చిన్న పట్టణం లోనికి కూలి పనులు వెతుక్కుంటూ వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
గ్రామంలోని తేనె కార్మికులలో కొందరు తమతో పాటుగా రామభద్రుడిని కూడా తీసుకెళ్దామని, అతనికి కుడా ప్రస్తుతం పూట గడవటం కష్టంగా ఉందని భూషణం వద్ద ప్రస్తావించారు. అసూయపరుడైన భూషణం పట్టణంలో బాగా సంపాదించి గ్రామంలో రామభద్రుడి కంటే గొప్పవాడిగా బ్రతకాలని తలంపుతో అందుకు నిరాకరించాడు.
అనుకున్నట్టుగానే గ్రామంలోని తేనె కార్మికులు గ్రామాన్ని విడిచిపెట్టి ఒకరోజు పట్టణం వైపుకు వలస వెళ్ళడం ప్రారంభించారు. పట్టణం చేరుకున్నాక చేతి నిండా మంచి పనిని సంపాదించాలని చుట్టు ప్రక్కల ఉండే కర్మాగారాల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా ఫలితం దక్కలేదు. వెంట తెచ్చుకున్న సొమ్ములన్నీ తరిగిపోయాయి. రోజంతా పస్తులు పడ్డాక తిరిగి పల్లెదారి పట్టడమే తమకి శ్రేయష్కరమని భావించిన భూషణం అందర్నీ తమ పల్లె వైపుకు నడిపించాడు.
మార్గ మధ్యంలో ఓ అజ్ఞాత వ్యక్తి దీన పరిస్థితిలో వెళ్తున్న ఆ వ్యక్తులను చూసి వారి కోసం ఆరా తీసాడు. తామంతా కూలి పని చేయడానికి వెతుకుతూ కోసంగి నుండి వచ్చామని, ఏ పనీ దొరకకపోవడంతో తిరిగి మా గ్రామానికి వెళ్తున్నామని చెప్పాడు భూషణం. ఆ అజ్ఞాత వ్యక్తి వారి పరిస్థితిని చూసి జాలిపడి వారికి సరిపడే పనిని ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకుని వెళ్ళాడు.
ఆ అజ్ఞాత వ్యక్తి నేరుగా వారిని ఒక కుటీర కర్మాగారానికి తీసుకెళ్ళాడు. భూషణం ఎంతో సంబరపడిపోయాడు. తనకు చేతి నిండా పని లభిస్తున్నందుకు సంతోషంతో ఆ అజ్ఞాత వ్యక్తికి లెక్కలేనన్ని సార్లు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు. రాబోయే వేతనంతో రామభద్రుడి కంటే ఒక మెట్టు ఎత్తులో ఉండాలన్న తన ఆశయం నెరవేరుతుందని లోపల అడుగుపెట్టి ఆశ్చర్యపోయాడు.

భూషణం అడుగు పెట్టిన ప్రాంగణం కృత్రిమ పద్ధతిలో తేనె ఉత్పత్తి చేస్తున్న ఒక కుటీర పరిశ్రమ. అడవిలో ఎంతో కష్టతరమైన తేనె సేకరణ అక్కడ ఎంతో సులభంగా జరుగుతోంది. ఏది ఏమైనా తమకి అనుభవం ఉన్న కూలి పని దొరుకుతున్నందుకు అందరూ సంతోషిస్తూ ఉండగా అక్కడ పనిచేసే పర్యవేక్షకుని వద్దకు ఆ అజ్ఞాత వ్యక్తి వాళ్ళను తీసుకెళ్ళాడు.
ఆ పర్యవేక్షకుడు ఆ అజ్ఞాత వ్యక్తిని చూసి పలకరించి వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. భూషణంతో పాటు మిగిలిన వాళ్ళంతా ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తమ గ్రామానికి వచ్చి రామభద్రుని వద్ద తేనెటీగలను కొంటున్నటువంటి దామోదరం.
భూషణం వెంటనే కలుగజేసుకుని తామంతా కోసంగి గ్రామంలోని తేనె కార్మికులమని దురదృష్టవశాత్తూ అడవిలోని తేనె వనరులు అడుగంటడం వలన ఇలా కూలి కోసం వచ్చామని చెప్పాడు. దామోదరం వాళ్ళని గుర్తించి జాలిపడి వెంటనే అక్కడ పనిని కల్పించడంతో పాటుగా వారి నివాసానికి కావలసిన వసతులను ఏర్పాటు చేసాడు.

అది అలా ఉండగా ఒక రోజు రామభద్రుడు తెచ్చిన తేనె మొత్తాన్ని పట్టణానికి వలస వెళ్ళిన వారి కుటుంబీకులకు ఇచ్చివేసి దమోదరానికి ఇవ్వవలసిన తేనెటీగల పెట్టెతో ఇంటికి చేరుకున్నాడు. రేపటి రోజున ఈ పెట్టెను మనమే నేరుగా దామోదరానికి ఇచ్చి వద్దామని, అలా పట్టణం కుడా చూసినట్టు ఉంటుందని సుజాతమ్మ రామభద్రుడిని కోరింది.
రామభద్రుడు సుజాతమ్మతో తేనెటీగల కుటీర పరిశ్రమకు మరునాడు ఉదయాన్నే చేరుకున్నాడు. దామోదరం వద్ద పనిచేస్తూ కనిపించిన భూషణం మరియు ఇతర తేనె కార్మికులని చూసి రామభద్రుడు ఆశ్చర్యపోయాడు. భూషణం రామభద్రుడిని చూడగానే తను చేసిన మోసానికి ప్రతీకారంగా రామభద్రుడు దమోదరంతో చెప్పి తనని పని నుండి తొలగింపజేస్తాడని ఉహించాడు. అయితే తన తోటి కార్మికులకి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో మంచి మనసుతో ఆసరా కల్పించి ఆదుకున్నందుకు దామోదరానికి రామభద్రుడు వినయంతో నమస్కరించాడు. తర్వాత భూషణం వద్దకు వచ్చి కొత్త ప్రదేశంలో పరిస్థితులు సర్దుకునే వరకు మీకు ఉపయోగపడతాయి అని చెప్పి తన వద్ద దాచుకున్న కొంత సొమ్ముని అతని చేతిలో పెట్టాడు.
రామభద్రుడి యొక్క స్నేహపూర్వక వైఖరికి భూషణం సిగ్గుపడ్డాడు. వెంటనే రామభద్రుడి చేతులు పట్టుకుని తనని క్షమించమని కోరుతూ గతంలో తాను చేసిన మోసపూరిత ఆలోచనలను అందరి ముందు బయటపెట్టాడు. దాని ఫలితమే ఇప్పుడు మా అందరికీ ఈ దుస్థితి వచ్చిందని భూషణం కన్నీళ్లు పెట్టుకుని క్షమించమని కోరుతూ రామభద్రుడి కాళ్ళ మీద పడ్డాడు.
రామభద్రుడు అతన్ని ఓదార్చుతూ పైకి లేపి, దామోదరం వైపు చూసి మేమంతా బాల్యం నుండి కలిసే ఏ పని అయినా చేసామని, కనుక ప్రస్తుతం నాకు కుడా ఇక్కడే ఏదైనా పనిని కల్పించాలని ప్రాధేయపడుతూ అడిగాడు.
రామభద్రుడు అలా అడిగేసరికి ఏమి చెప్పాలో అర్ధంకాక దామోదరం సుజాతమ్మ వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు. వెంటనే రామభద్రుడి వైపు చూసి “అయ్యా! నిజానికి నేనే మీ వద్ద పనిచేస్తున్నాను. నేను మీ భార్య సుజతమ్మ పుట్టింటి వారి వ్యాపారంలో పని చేసే గుమస్తా కొడుకుని. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడ్ని. పూర్తిగా వ్యాపార కుటుంభ నేపథ్యం కలిగిన సుజాతమ్మగారు ఒక వ్యాపారం పెడుతున్నట్టు లేఖ రాసారు. ఆ విశ్వాసంతో నేను మరో మారు ఆలోచించకుండా ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఒప్పుకున్నాను. కోసంగి గ్రామం చుట్టు ప్రక్కల అటవీ ప్రాంతంలో తేనెటీగలను సేకరించి కృత్రిమంగా ఈ ప్రదేశంలో తేనె ఉత్పత్తులు ప్రారంభించడం అందులోని ముఖ్య ఉద్దేశ్యం.

తేనె పట్టు కదలకుండా తేనెను సంగ్రహించగలిగే నైపుణ్యం కలిగిన మీరు తేనెటీగల సేకరణలో అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు” అని భూషణం వైపుకి చూస్తూ “సమాజం బాగుంటే మనమంతా బాగుంటాము. మన చుట్టూ ఏ ఒక్క వ్యక్తి సంతోషంగా ఉండకపోయినా దాని ప్రతిఫలం ఏనాటికైనా మన సంతోషాన్ని హరిస్తుంది” అన్నాడు. భూషణం తల దించుకుని పశ్చాత్తాపంగా చూసాడు. “మీరు సాధారణంగా సున్నితమైన స్వభావికులు, ఎవరి మనసును నొప్పించనివారు కనుక మీ వద్ద ఈ విషయం రహస్యంగా ఉంచమని సుజాతమ్మ గారు సెలవిచ్చారు. ఇకపై ఈ వ్యాపారం అంతా మీ చేతుల మీదే జరగాల్సి ఉంది” అని రామభద్రునితో చెప్పి ముగించాడు దామోదరం.

Jealousy
“ఎదుటివారి ఎదుగుదలకు ఈర్ష్యపడే లక్షణం మీకు ఉంటే, వారి ఎదుగుదలకు మీరే స్వయంగా మీ జీవితాన్ని నిచ్చెనగా వేసి, చివరికి ఓటమి జీవిగా మిగిలిపోతారు”.
-తెలుగు సంహిత