వృందన వనం:-
The Lion King Story
దండకారణ్యంలోని వృందనవనం అనే ఒకానొక దుర్భేధ్యమైన ప్రాంతంలో జంతువుల ఆహార సముపార్జనకు సంబంధించి విరాజితుడు అనే సింహ రాజు ఒక కఠిన శాసనం చేసాడు. ఫలితంగా అడవిలోని క్రూర మృగాలతో కలసి బలహీనమైన జీవులు సైతం స్వేచ్ఛగా మరియు పటిష్టమైన భద్రతతో సంచరించేందుకు అక్కడ వన్య చట్టాలు ఎంతగానో తోడ్పడేవి. మహారాజు పుణ్యమా అని జంతువులన్నీ కలసిమెలసి సంతోషంగా జీవిస్తూ ఉండేవి. కొన్నాళ్ళకు ఆ ప్రాంతం కోసం విన్న జమాలి అనే ఒక జిత్తులమారి నక్క, “ ఆహా, క్రూర మృగాలతో కలసి సాధు జీవుల సహవసమా! ఏమిటీ విడ్డూరం! అయినా కూడా అటువంటి రాజ్యంలో నేను చోటు సంపాదిస్తే ఆహారం ఆర్జించడానికి ప్రతిరోజూ నేను పడే ఇక్కట్లకు స్వస్తి చెప్పి హాయిగా రోజూ తిని పడుకోవచ్చు. కానీ నా బోటి తుంటరి నక్కకి అక్కడ ప్రవేశానికి అనుమతిని ఇస్తారో లేదో!. కాబట్టి నేను ఆ రాజ్యానికి తగ్గ భుజ బలాన్ని తీసుకెళ్ళి అక్కడ తిష్ట వేయాలి” అనుకుని ఆఘమేఘాల మీద తమ ప్రాంతానికి రాజు అయిన ‘హారగ్రహుడు’ అనే పెద్ద పులి దగ్గరకు జమాలి చేరుకుంది. వెళ్ళీ వెళ్ళగానే, “వ్యాఘ్ర రాజా, మీకో ముఖ్య విషయం చెప్పాలి. ఇక్కడకి 100 క్రోసుల దూరంలో వృందనవనం అనే దుర్భేధ్యమైన అరణ్య రాజ్యం ఉంది. అక్కడ జంతువులన్నీ తమ బలా బలాలను, బేధ విభేదాలను విష్మరించి ఒకదానికి మరొకటి చేదోడు వాదోడుగా, అరణ్యానికి ఆదర్శ ప్రాయంగా జీవుస్తున్నాయని ప్రపంచమంతా కోడై కూస్తోంది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు సమస్య ఏంటంటే, అయినా ఈ విషయం ఇక్కడితో వదిలేయండి, నా నోటితో నేను చెప్పలేను” అని అమాయకంగా నటిస్తూ ఊరుకుంది.

వ్యాఘ్ర రాజు నక్క మాటలు విని ఘీంకరిస్తూ “ఏం జరిగిందో త్వరగా చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలు చేస్తాను” అని కోపంతో ఉగిపోయింది. సమయం కోసం ఎదురు చూస్తున్న నక్క “అయ్యో, రాజా! మిమ్మల్ని కావాలని నేను కోపాగ్నికి గురిచేస్తానా? నేను మీ శ్రేయోభిలాషిని. ఇటువంటి దుర్భాషలు మీ వంటి ఉత్తమోత్తముల వద్ద ప్రసంగించడం అనుచితం కాదు అని చెప్పలేదు. అయినప్పటికీ రాజాజ్ఞను శిరసా వహించడం పౌరునిగా నా బాధ్యత. కాబట్టి చెబుతున్నాను. అక్కడ జంతువులన్నీ అలా జీవించడానికి కారణం అక్కడ రాజైన విరాజిత సింహరాజు పరిపాలనా సమర్ధత అని, ఇక్కడి రాజుకు అంత సమర్ధత లేదు అని మన రాజ్యంలోని జీవ జాతులన్నీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను. ఇలాంటి అమంగళ పదజాలాన్ని నా నోటితో మీ వద్ద చెప్పాల్సి వస్తుందని నేను కలలో కూడా ఉహించలేదు” అని నక్క తన దొంగ వినయాన్ని ప్రదర్శిస్తూ లేనిపోనివన్నీ వ్యాఘ్ర రాజుకు నూరిపోసింది.

నిజానికి హారగ్రహుడు కోపగ్రస్తుడు అయినప్పటికీ అతను ఎంతో వివేచనాపరుడు. “ఆహా! క్రూర మృగాలతో కలసి బలహీనమైన జీవ జాతులు సహచర్యం చేస్తున్నాయా, ఇది అద్భుతమే కావొచ్చు, కానీ నా బోటి ఒక మహారాజు ఇటువంటి ఒక సంకట స్థితి నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. లేదంటే నిజంగానే నాలో బలహీనతలుగా వేర్లూరుకునే ప్రమాదం ఉంది” అని మనసులో అనుకుని, “జమాలి, రేపే మనం వృందనవనానికి పయనిస్తున్నాం. ప్రయాణానికి సిద్ధం చేయు” అన్నాడు. తను కోరుకున్నది కుడా అదే కాబట్టి నక్క మనసులో సంబరపడి వినయం నటిస్తూ “చిత్తం మహారాజా” అని వీడ్కోలు చెప్పి తన గుహకు బయల్దేరింది.
మరుసటి రోజు ఉదయాన్నే నక్క మిక్కిలి ఉల్లాసంగా తన భవిష్యత్తు కోసం కలలు కంటూ నిద్రలేచింది. నేటితో ఈ రాజ్యానికి నాకు ఋణం తీరిపోతుంది అని అనుకుంటూ అసలు విషయం చెప్పకుండా చివరిసారిగా తన మిత్రులందరినీ కలుసుకుంది. అటునుంచి నేరుగా మహారాజు వద్దకు బయల్దేరింది. దారిలో తాను చేయాల్సిన పనులు గురించి ఒక్కొక్కటి ఆలోచిస్తూ లెక్కలు వేసుకుంది, “మొదటిగా మహారాజుతో అక్కడకు చేరుకునే ప్రణాళిక రచన బాగానే చేసాను, ఇక మిగిలింది అక్కడకు చేరుకున్నాక మహారాజుని ఎలాగోలా వదిలించుకుని ఆ రాజ్యంలో పౌరునిగా అర్హత సంపాదించాలి, అప్పుడే మిగిలిన జీవితం మొత్తం హాయిగా తిని పడుకోవచ్చను” అనుకుంటూ వ్యాఘ్ర రాజు వద్దకు చేరుకుంది. రాజ్య వ్యవహారాలను కొన్ని రోజులు తన మంత్రి అయిన హిమ వంతుడు అనే ఎలుగుబంటికి అప్పగించి, వ్యాఘ్ర రాజు నక్కతో పాటు వృందనవనానికి బయల్దేరెను.

వ్యాఘ్ర రాజు మార్గ మధ్యంలో వృందనవనానికి చేరుకున్నాక చేయాల్సిన పనుల కోసం నక్కకి వివరిస్తూ తాను ఎక్కడో ఒక ప్రదేశంలో బస చేస్తాననీ అప్పుడు నీవు వెళ్ళి ఆ రాజ్యానికి రాజైన విరాజిత మహారాజుకు నా రాకను తెలియజేసి ఆతిధ్య సమావేశమునకు ఏర్పాట్లు చేయవల్సినదిగా చెప్పమని ఆజ్ఞాపించెను.
మరుసటి రోజు ఉదయానికి ఇరువురూ వృందనవనానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నో అద్భుత దృశ్యాలు చుసిన వ్యాఘ్ర రాజు “భళా! ఇది నిజంగానే అద్భుతం జమాలి, ఇక్కడ జీవ జాతుల వలన ఈ రాజ్యానికి అందం వచ్చిందా, లేదా పరిపాలనా వ్యవస్థ వలన వచ్చిందా! ఇది అరణ్య లోక స్వర్గం. స్వర్గంలో మాత్రమే సర్వ ప్రాణులూ సమ న్యాయంతో సంతోషంగా జీవించగలవు. నిజంగా విరాజితుని పరిపాలనా దక్షతకు నేను ముగ్దుడను అయ్యాను” అని అంటూ ఉండగా అంతలో ఒక జింక వాళ్ళకి ఎదురుగా వస్తూ “అతిధులకు నమస్కారం, నా పేరు హరిణి, మీ రాకకు కారణం తెలుసుకోవచ్చా” అని అడిగింది. అప్పుడు నక్క సమాధానం చెప్తూ, “నా పేరు జమాలి, మేము మీ రాజు గారైన విరాజితుని కలుసుకునేందుకు మీ పొరుగు రాజ్యం నుండి వస్తున్నాము” అని చెప్పింది. దానికి ఆ జింక “ధన్యులం, మీరు ఇదే మార్గంలో సుమారు 5 క్రోసుల దూరం ప్రయాణిస్తే అక్కడ రాజా వారి స్థావరం ఉంది. అక్కడ మీరు అతన్ని కలుసుకోవచ్చు” అని చెప్పి వెళ్ళిపోయింది.

వ్యాఘ్ర రాజుకి ఆ సందర్భం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక క్రూర మృగం వద్దకు ఒక జింక అంత ధైర్యంగా వచ్చి మాట్లాడి వెళ్ళడం నిజంగా అతనికి ఎంతో అబ్బుర పరిచే విషయమే. అయితే వారు ఇరువురూ గత ఇరవై నాలుగు గంటలుగా ఏమీ భుజించలేదు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న నక్క “ప్రభూ, నిన్నటి నుండి మీరు ఏమీ భుజించ లేదు, దారిపొడవునా మీకు వేటకు కుడా ఎక్కడ ఏమీ లభించలేదు. మన అదృష్టం బాగుంది కనుక ఈ రాజ్యంలో ఆహారం ఏరి కోరి మీ ఎదురుగా వచ్చింది. ఇక్కడకి మహారాజు ఉండే ప్రదేశం ఎలాగో మరో ఐదు క్రోసులు ఉంది కాబట్టి మనం ఈ జింకని ఇప్పుడు భుజించి ఆకలి దప్పికలు తీరాక మళ్ళీ ప్రయాణం ప్రారంభిద్దాం, ఏమంటారు ప్రభూ?” అని నక్క తన మనసులోని కోరికను చెప్పింది.

వ్యాఘ్ర రాజు నక్కతో “చూడవయ్యా జమాలి, ప్రస్తుతం మనం పొరుగు రాజ్యంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వన్య చట్టాల గురించి గుర్తునెరిగి మసులుకోవడం మన కనీస బాధ్యత అని గ్రహించాలి” అన్నాడు. వెంటనే నక్క “అయ్యో! ప్రభూ, ఎదో ఆకలిగా ఉన్నారని నాకు తోచిన సలహా ఇచ్చాను. ధర్మ ప్రభువులు క్షమించాలి” అని నక్క తనని తాను కప్పి పుచ్చుకుంది. వ్యాఘ్ర రాజు “సరే సరే, మనం త్వరగా ఇక్కడకు వచ్చిన పని ముగించుకుని మన రాజ్యానికి వెళ్ళాలి, లేదంటే హిమవంతునికి పరిపాలన భారం అధికం అవుతుంది” అని అన్నాడు. “చాలా త్వరగా మిమ్మల్ని పంపించే ప్రణాళిక చేస్తున్నాను వ్యాఘ్ర రాజా” అని నక్క మనసులో అనుకుంది.
హరిణి చెప్పినట్లు ఐదు క్రోసుల దూరం ప్రయాణం ముగిసింది, ముందుగా అనుకున్నట్లు వ్యాఘ్ర రాజు నక్కని తన రాక కోసం తెలియజేయమని విరాజితుని కొలువుకి పంపించింది. నక్క తనదైన ప్రణాళికలు వేసుకుంటూ విరాజితుని వద్దకు చేరుకుంది. ఎంతో తేజోమయమైన ఘీంకర ఆకారుడైన విరాజితుని చూడగానే నక్క గడ గడ వణికిపోయింది.

నక్క వెంటనే ధైర్యాన్ని తెచ్చుకుని మరింత వినయాన్ని ప్రదర్శిస్తూ “మహారాజా వారికి ప్రణామములు. నా పేరు జమాలి. నేను మరియు మా వ్యాఘ్ర రాజైన హారగ్రహుడు మీ పొరుగు అరణ్య రాజ్యమైన బృంగినీవనం నుండి ఇచ్చటకు వీచ్చేసాము” అని పలికింది. విరాజితుడు ఆప్యాయంగా నవ్వుతూ “ధన్యవాదములు జమాలి, మీ రాకకు కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు”. ఇదే అవకాశం అని భావించిన నక్క “ప్రభూ, నిజానికి నేను మీకో అబద్ధం చెప్పడానికి వచ్చాను, కానీ ఇక్కడకు వచ్చాక మిమ్మల్ని మరియు మీ రాజ్యంలో జీవరాసులని చూసాక నేను మిమ్మల్ని వంచన చేస్తే అంతకు మించిన పాపం మరొకటి ఉండదని ఆత్మ విమర్శ చేసుకున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కనుక మీకు ఉన్నది ఉన్నట్లు చెప్పేయాలని నిశ్చయించుకున్నాను. నిజానికి మా వ్యాఘ్ర రాజు మీ రాజ్యంలోని ఆహార వనరులపై ఆశ పడ్డాడు. ఎందుకంటే ఇక్కడ వేటకోసం పరుగులు పెట్టాల్సిన పనిలేదు. సాధు జీవులు మరియు శాఖాహారులు క్రూర మృగాలతో కలసి సంచరిస్తూ ఉన్నాయి. అదే అదునుగా ఇక్కడ వేట ఎంతో సులభతరం అని భావించిన వ్యాఘ్ర రాజు మా రాజ్యంలోని క్రూర మృగాలకు ఇది ఎంతో అనువైన ప్రదేశం కనుక మీతో సంధి చేసుకుంటున్నట్లు నటించి అటుపైన ఇక్కడ ఆహార సముపార్జనకు ప్రణాళికలు రచిస్తున్నాడు, మీరు వెంటనే ఈ నయవంచనకు ప్రతిఘటించి మీ రాజ్యాన్ని కాపాడుకోగలరని నా మనవి” అని గుంట నక్క తన జిత్తులను ప్రయోగించింది.

విరాజితుడు మిక్కిలి కోపగ్రస్తుడై భయంకరంగా ఘీంకరిస్తూ తన పంజాతో ఎదురుగా బండరాయిని కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బండరాయి వేయి ముక్కలు అయింది. ఆ శబ్దానికి దాదాపుగా నక్క గుండె ఆగినంత పని అయింది. కాసేపటికి నక్క ఆ భీత్సాహం నుండి తేరుకుని “వ్యాఘ్ర రాజా, నా తలని వేయి ముక్కలు చేస్తాను అంటావా, ఈ సింహ రాజు దెబ్బకి నీ తల దానికి రెండింతలు ముక్కలయ్యే ఉపాయం చేసాను, కాసుకో” అని మనసులో అనుకుని “ప్రభూ, శాంతించండి. ఇంత ఆవేశం తగదు, ఈ సమస్యని ఆలోచనతో పరిష్కరించాలి, నేను మా వ్యాఘ్ర రాజుని మీతో సమావేశపరచడానికి మీ ససమావేశ ప్రాంగణానికి రేపు ఉదయం తీసుకొస్తాను. మీరు మీ పరివారంతో వచ్చి మీ పంజాతో అతన్ని అంతం చేయండి” అని నక్క సింహరాజుని శాంత పరుస్తూ ఉపాయాన్ని పలికింది.
విరాజితుడు కాస్త శాంతగ్రస్తుడై, “సరే మిత్రమా, నీవు మా శ్రేయోభిలాషివి గనుక మేము నీ మాటని గౌరవిస్తున్నాం. రేపు ఉదయం ఆ నయవంచకుడ్ని ఇక్కడకు తీసుకురా, ఈ వృందనవనం మోసాన్ని అస్సలు సహించదు” అన్నాడు విరజితుడు. “చిత్తం ప్రభూ, ఇక నాకు సెలవీయండి” అని నక్క సింహరాజుకి వీడ్కోలు చెప్పి బయల్దేరింది.
మృగరాజు విరాజితునితో బేటీ తర్వాత నక్క నేరుగా వ్యాఘ్ర రాజు వద్దకు చేరుకొని “ప్రభూ, మన రాకకు విరాజిత మహారాజు ఎంతో సంతోషించారు. రేపు మీ రాకకోసం సాదరంగా ఆహ్వానం పంపారు” అని అంటూ ఉండగా, మర్కటశూర అనే కొండముచ్చు రకరకాల ఆహార పదార్ధాలతో అక్కడకు చేరుకుని ఇలా అంది “వ్యాఘ్ర రాజ సమేత అతిధులకు ప్రణామాలు. మా రాజ్యంలోని ప్రాణులకు ఆహార పంపిణీలో భాగంగా మా ప్రభువులు అతిధులైన మీకు కూడా ఆహారాన్ని పంపినారు, మా ఆతిధ్యాన్ని స్వీకరించి వీటిని సేవించగలరు” అని చెప్పి సామగ్రిని అక్కడ ఉంచి వెళ్ళిపోయింది.

“ఆహా! ఏమి ఈ అతిధి మర్యాదలు, ఇటువంటి రాజ్యంలో ఒక సాధారణ పౌరునిగా జీవించినా అదృష్టమే” అని వ్యాఘ్ర రాజు నక్కతో అంటూ ఉండగా “ఇప్పుడేం చూసారు ప్రభూ, రేపు అసలైన మర్యాదలు చూస్తారు, నాకు మాత్రం ఇక్కడ ప్రత్యేక పౌరునిగా ఇక్కడ జీవించే అవకాశం లభించేసింది” అని నక్క మనసులో అనుకుంది.
ఇద్దరూ ఆహారాన్ని తృప్తిగా భుజించారు. “జమాలి, రేపు విరాజిత మహారాజుని కలుసుకుని అతనికి ధన్యవాదాలు తెలపాలి, అలాగే అతని పరిపాలన సంస్కరణల గురించి తెలుసుకుని మన ప్రాంతంలో సాధ్యం కాకపోయినా సరే, వాటితో ఎంతో కొంత మన వన్యానికి మేలు చేయాలి” అని వ్యాఘ్ర రాజు నక్కతో చెప్పి నిద్రపోయాడు. నక్క మాత్రం అక్కడ భుజించిన ఆహారం కోసం ఆలోచిస్తూ, “ఆహా! ఈ విందు మహా అద్భుతంగా ఉంది. ఇటువంటి విందు మా రాజ్యంలో ఏనాడూ భుజించలేదు” అని లొట్టలేసుకుంటూ నిద్రపోయింది.
మరుసటి రోజు ఉదయాన్నే నక్కతో కలసి వ్యాఘ్ర రాజు విరాజితుని స్థావరానికి బయల్దేరాడు. నక్క రాజావారికి ఇవే చివరి చూపులు అన్నట్లు వంగ్యంగా చూస్తోంది. కాసేపట్లో వారిరువురూ స్థావరానికి చేరుకున్నారు. ఆ ప్రదేశం ఎంతో నిర్మానుషంగా ఉంది. చుట్టూ బండరాళ్ల నడుమ ఒక విశాలమైన ప్రదేశం. భారీ బండరాళ్ల నీడలో ఆ ప్రదేశం చల్లగా, ప్రశాంతంగా ఉంది. బండరాల్లని ఆనుకుని సింహ రాజు నీళ్ళు తాగేందుకు ఒక అందమైన కొలను, దానికి ఎదురుగా సింహ రాజు కూర్చునే సింహాసనం వంటి మరో రచ్చ బండ ఉంది. దానికి కుడివైపుగా రాజ్యంలోని జంతువులు రాజు గారితో సంభాశించేందుకు వీలుగా ఉండే ఒక దిగువ ప్రాంగణం ఉంది. ఆ ప్రదేశం ఆధునిక వన్య పరిపాలనా సౌలభ్యానికి ఎక్కడా తీసిపోని విధంగా ఉంది.

వ్యాఘ్ర రాజు అన్నీ నిశితంగా పరిశీలిస్తూ, విరాజితుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో లంబుకం అనే ఒక కుందేలు అక్కడకి వచ్చి “వ్యాఘ్ర రాజులకు ప్రణామములు. రాజావారు విచ్చేస్తున్నారు, దయచేసి నిరీక్షించగలరు” అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడకి కాసేపట్లో బండరాళ్ల వెనుక నుండి పులులు, సింహాలు, తోడేళ్ళు వంటి క్రూర మృగాలు ఒక్కొక్కటి వరుసగా వచ్చి చుట్టూ నిల్చున్నాయి.
వ్యాఘ్ర రాజుకి ఏమీ అర్ధం కాలేదు. నక్కతో “జమాలి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. ఇక్కడ ఉన్న సింహాలలో విరాజిత మహారాజు ఎవరు. వీరందరి హావభావాలను బట్టి చూస్తుంటే ఇక్కడ ఎదో అనుకోని సంఘటన జరగబోతున్నట్టు నా మనసు సంకిస్తోంది” అని వ్యాఘ్ర రాజు తన మనసులోని అనుమానాలను వెలిబుచ్చాడు. నక్క ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు “ప్రభూ, వీళ్ళంతా వన్య సభలలో సభ్యులు, ఇక్కడ అతిధులకు ఆహ్వానం పలకడంలో ఈ సభ్యులు కుడా మహా రాజుతో పాటుగా సరి సమానమైన బాధ్యతను కలిగి ఉంటారు. కనుక మీకు అటువంటి సందేహం వలదు” అని సర్ది చెప్పింది.

కాసేపట్లో ఆ ప్రదేశం నిర్మానుషంగా మారిపోయింది. పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది. భూమి కంపిస్తున్నట్లుగా ఎదో అలజడి మొదలైంది. జంతువులన్నీ లేచి నిల్చున్నాయి. వ్యాఘ్ర రాజు ఏం జరుగుతోందా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అంతలో అడుగుల శబ్దం మొదలైంది. జంతువులన్నీ రాజావారు వస్తున్నారు అని నమస్కరిస్తూ రెండు కాళ్ళపై నిల్చున్నాయి. విరాజిత మహారాజు రాకతో ఆ ప్రాంగణం కంపనాలతో బండరాళ్ళు సైతం ఉగుతున్నాయి. “ఆహా! ఏమి ఈ రాజసం” అని వ్యాఘ్ర రాజు విరాజిత సింహరాజుని చూస్తూ మైమరచిపోయాడు.

విరాజితుడు తన గద్దెపై నిల్చుని “హారగ్రహ మహారాజుకి ఈ వృందనవనం తరపున మా యొక్క హృదయపూర్వక ఆహ్వానం, అలాగే మా శ్రేయోభిలాషి జమాలికి కుడా. మీ రాకకు కారణం తెలుసుకోవచ్చా మిత్రమా?” అని అడిగాడు. వ్యాఘ్ర రాజు స్పందిస్తూ, “మీ ఆతిధ్యమునకు ధన్యులం మిత్రమా. మీ కీర్తి గురించి వన్య ప్రపంచ నలుమూలా విన్నాను. ఈరోజు స్వయంగా చూసే అదృష్టం కలిగింది. మీ రాజ్యంలోని, సుభిక్షతకు, ధర్మబద్ధ జీవనానికి మీరు అనుసరించే మార్గదర్శకాలని మాకు సెలవీయగలరని, తద్వారా మేము కూడా అదే మార్గంలో ప్రయాణించి మా రాజ్యాన్ని చక్కదిద్దుకోగలమని తలంచి ఇక్కడకి విచ్చేసాము. మీకు అభ్యంతరం లేకపోతే మీ పాలనా సంస్కరణల గురించి తెలియజేయగలరని మా ప్రార్ధన” అని వ్యాఘ్ర రాజు ముగించాడు.

అంతలో నక్క వ్యాఘ్ర రాజు నుండి దూరంగా జరిగి, “మహారాజా ఇతనితో ప్రసంగం అనవసరం. సమయం ఆసన్నమైంది. ఇతన్ని బంధించి అంతం చేయండి అని అరిచింది”. చుట్టూ ఉన్న క్రూర మృగాలు మహారాజు ఆజ్ఞ కోసం వేచి చూస్తున్నట్టుగా గాండ్రించాయి. వ్యాఘ్ర రాజుకి నక్క ఎదో kamagra 100mg గూడుపుటానీ చేసిందని అర్ధం అయింది.
విరాజితుడు కోపంతో గట్టిగా గాండ్రించాడు. ఆ దెబ్బకు అడవి మొత్తం గడ గడ వనికిపోయింది. చూస్తారేం బంధించండి అని గట్టిగా ఘీంకరించాడు. కళ్ళు మూసి తెరిచేలోపు మృగాలన్నీ గుంట నక్కను చుట్టు ముట్టాయి. “మహారాజా! ఆజ్ఞ ఇవ్వండి, ముక్కలు ముక్కలు చేసేస్తాం” అంటూ అరిచాయి. ఆ అరుపులకి నక్కకి సగం ప్రాణం గాలిలో కలసిపోయింది. నక్క కాస్త ధైర్యం తెచ్చుకుని “అయ్యో! మిత్రులారా, మీకు ఎవర్ని బంధించాలో కూడా తెలియదా, రాజావారు బంధించమని చెప్పింది నన్ను కాదు. నేను మీ శ్రేయోభిలాషిని” అంటూ మరోవైపు “మహారాజా, మీరైనా ఈ వెర్రి మొహాలకి అర్ధమయ్యేలా చెప్పండి, పొరపాటున నన్ను చంపేసేలా ఉన్నారు” అని అరిచింది. ఏం జరుగుతోందో అర్ధం కాక వ్యాఘ్ర రాజు అయోమయంగా చూస్తున్నాడు.

సింహరాజు కలుగజేసుకుని “భయపడకు మిత్రమా, నీ ప్రాణానికి ఏ ప్రమాదమూ లేదు. ముందుగా ఈ వ్యాఘ్ర రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేసాక మనకి ఒక స్పష్టత వస్తుంది” అన్నాడు. నక్క కాస్త ఊపిరి పీల్చుకుని, “అతనితో ఇంకా సంభాషణ ఏంటి ప్రభూ, సరే త్వరగా కానివ్వండి, వీళ్ళ మొహాలు చూడలేకపోతున్నాను” అంటూ వంగ్యంగా చూసింది.
The Wisdom of the Lion King
విరాజితుడు వ్యాఘ్ర రాజు వద్దకు వెళ్లి, “మిత్రమా! ఈ రాజ్యంలో సుభిక్షతకు కారణం అడిగారు కదా. చెబుతాను వినండి, పూర్వం మా పూర్వీకులు అందరిలాగానే వన్య పాలన చేస్తూ, సాధారణ జీవితాలని గడిపేవారు. ఒకానొక సమయంలో మా అరణ్యంలో నక్కల జనాభా విపరీతంగా పెరిగింది. నక్కలు సాధారణంగా స్వయంగా వేటాడే స్వభావాన్ని కలిగి ఉండవు. అవి ఎల్ల వేళలా ఇతరులపై ఆధారపడి బ్రతుకుతూ ఉండేవి,
భారీగా పెరిగిన నక్కలు పొట్ట నింపుకోవడానికి ఎన్నో జిత్తులు వేస్తూ ఒక్కోసారి ప్రభువులను కుడా ఎన్నో చిక్కుల్లో పడేస్తూ ఉండేవి. వీటికి పరిష్కారం కోసం ఎంత ఆలోచించినా వీటివల్ల ఎదో వైపు నుండి సమస్య వస్తూనే ఉండేది. మా వంశంలో మేధావి అయిన మా పూర్వీకులలో ఒకరు బాగా ఆలోచించి నక్కకు పని, బాధ్యతలు లేకపోవడం వలనే ఇలా సోమరులుగా ప్రవర్తించి రాజ్యానికి కీడును కలిగిస్తున్నాయి. కాబట్టి మన రాజ్యంలో వేటని నిషేదిద్దాం. ఇకమీదట ఈ రాజ్యంలోని ప్రతీ జీవరాశిని పోషించే బాధ్యత ఈ నక్కలదే అని శాసనం చేసారు.
అప్పటి నుండి ప్రపంచ నలుమూలలా సంచరించి మాకు ఆహారాన్ని సమకూర్చడంలోనే వాటి జీవితం ముగుస్తోంది. ఇక మాపై జిత్తులు పన్నే అవకాశం లేదు కనుక మేమంతా ఇంత సుభిక్షంగా జీవించగలుగుతున్నాం. అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే మా రాజ్యంలో నక్కలే ఎక్కువ అంటే ఇలా పక్క రాజ్యాల నుండి జిత్తులు పన్నుతూ వచ్చి ఇక్కడ ఉచ్చులో చిక్కుతున్న నక్కల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువ అవుతోంది” అని సింహరాజు నక్కను చూసి ఒక నవ్వుని నవ్వాడు.

“అమ్మ దుర్మార్గులారా, జిత్తులు మేమే వేస్తాం అంటే మీరు ఉచ్చులే వేసేస్తున్నారా, అయ్యో! రోజూ తిని పడుకోవచ్చు అని ఆశ పడి ఇక్కడకు వచ్చాను. ఇక మీదట వీళ్ళు తినడానికి నేను కడుపు మాడ్చుకుని తిరగాలా, ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అంటే ఇదే కాబోలు” అని బోరున ఏడ్చింది.
వ్యాఘ్ర రాజు విరాజితుని సమయస్పూర్తికి, భవిష్య దృక్పదానికి దాసోహం అయ్యాడు. “మిత్రమా, చివరిగా నాకు మరో సందేహం. ఒకవేళ “జమాలి మంచి వాడైతే అతన్ని శిక్షించడం అన్యాయం అవుతుంది కదా?” అని అడిగాడు. సింహరాజు నవ్వుతూ “మిత్రమా, అలా ఎన్నటికీ జరగదు. ఇక్కడ శిక్షించే ముందు ఎన్నో పరీక్షలు పెడతాం. మీరు మా రాజ్యంలో అడుగు పెట్టగానే హరిణి అనే మా గూఢచారి మిమ్మల్ని పరీక్షించదలచి వచ్చింది. అటుపైన మీరు మాట్లాడిన ప్రతి సంభాషణ మా గగన గూఢచారి అయిన కరణుడు మాకు అనుక్షణం చేరవేస్తూనే ఉన్నాడు” అని పైన ఎగురుతున్న కాకిని చూపించాడు. ఇదంతా వింటున్న నక్క “కక్కుర్తి బుద్ధి, నోరు ఉండబట్టక జింక మీద ఆశపడ్డాను. ఇదంతా చూస్తుంటే వీళ్ళు నాకు మాములుగా నరకం చూపించరు, నాకు ఈ సాస్తి జరగాల్సిందే” అని భవిష్యత్తుని తలచుకుని బోరున ఏడ్చింది.