బుద్ది జీవులు
best Moral Story in Telugu 2021
మరణించిన ఇద్దరు వ్యక్తులను తమ లోకానికి తీసుకెళ్లేందుకు యమ కింకరులు భూమి మీద ఉన్న ఒక గ్రామానికి చేరుకున్నారు. అందులో ఒక వ్యక్తి పట్టాభి, మరో వ్యక్తి పేరు శరభయ్య. ఇద్దరు వ్యక్తులు ఒకే గ్రామానికి చెందిన మోతుబారి పెత్తందారులు. ఏ విషయంలోనూ తమ హోదాకు తగ్గేవారు కాదు.

యమకింకరులు వాళ్ళని తీసుకు వెళ్లేందుకు ఒక చిన్న పడవ లాంటి ఆకారం కలిగిన వ్యోమ నౌకను తీసుకుని వచ్చారు. అందులో నాలుగు కుర్చీలు ఉన్నాయి. శరభయ్య మరియు పట్టాభి తాము మరణించాము అని తెలుసుకుని ఠీవీగా నడుచుకుని నౌక ఎక్కారు. అందులో రెండు కుర్చీలు ఎగువన మరియు రెండు కుర్చీలు దిగువన ఉన్నాయి.
స్వభావరీత్యా మోతుబారులైన ఆ ఇరివురు వ్యక్తులు ఎగువన ఉన్న రెండు కుర్చీల కోసం పోటీపడుతూ అవి తమ హోదాకు తగినట్టుగా ఉన్నాయని భావించి అందులో ఉత్తమమైన కుర్చీ కోసం గొడవపడ్డారు. ఎట్టకేలకు వారి మధ్య సఖ్యత ఒప్పందం కుదుర్చుకుని గమ్యం చేరుకునే వరకు ఎగువ కుర్చీలను వారు ఇరువురి సొత్తుగా పంచుకున్నారు.

నౌక బయల్దేరింది. కింకరులు ఆ నౌక తీసుకుని దగ్గరలోని ఒక గ్రామానికి చేరుకున్నారు. యమభటులు మరో రెండు ప్రాణాలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పారు. పట్టాభి మరియు శరభయ్య కుర్చీలను గట్టిగా పట్టుకుని వచ్చేది ఎంత పెద్ద మోతుబారి అయినా సరే కుర్చీలను ఇచ్చేది లేదని వాటికి అతుక్కుపోయారు.
కింకరులు కిందకి దిగి మరణించబోయే వాళ్ళని వెతుకుతూ గ్రామంలో గూమిగూడి ఉన్న జన సమూహం మధ్యలోకి వెళ్లారు. సమయం గడిచినప్పటికీ కింకరుల జాడ లేనందున విసుగు చెందిన పట్టాభి మరియు శరభయ్య కూడా కిందకి దిగి వాళ్ళని వెతుకుతూ వెళ్లారు.

జన సందోహం నడుమ అక్కడ ఎంతో కోలాహలంగా కోడి పందెములు జరుగుతూ ఉన్నాయి. అటువైపుగా వచ్చిన పట్టాభి, శరభయ్యలు జనం మధ్యలో నిలిచి కోడి పందెములను వీక్షిస్తున్న కింకరులను చూసారు. శరభయ్య ఆ జన సమూహంలో ఎవరి ప్రాణాలు పోతాయో ముందుగానే తెలుసుకోవాలి అన్న కుతూహలంతో చుట్టూ గమనిస్తూ ఉన్నాడు.
ఎదురుగా ఉన్న రచ్చబండపై ఇద్దరు గ్రామ పెద్దలు కూర్చుని గంభీరంగా ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. శరభయ్య వాళ్ళని పట్టాభికి చూపిస్తూ మరి కాసేపట్లో మనతో వచ్చేది వాళ్ళే అనుకుంట అన్నాడు. అలా అయితే ఇక్కడ బహుశా కొట్లాటలు జరిగి వారి ప్రాణాలు పోవచ్చు అన్నాడు పట్టాభి.

గంటన్నర సమయం గడిచింది. కానీ రచ్చబండపై పెద్దలు నిబ్బరంగా కూర్చుని ఉన్నారు. పట్టాభి, శరభయ్యలు మాత్రం చావబోయే వారికోసం ఉత్కంఠగా చూస్తున్నారు. కానీ అక్కడ అటువంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. అంతలో ఒక చేయి వారి భుజాన్ని తాకింది. “వచ్చిన పని ముగిసింది, పదండి వెళ్దాం” అన్నాడు ఒక యమ కింకరుడు.
పట్టాభి శరభయ్యలు ఉలిక్కిపడి రచ్చబండపై కూర్చున్న గ్రామ పెద్దలను మరొక్కసారి చూసారు. వాళ్ళు నిబ్బరంగా అలానే ఉన్నారు. ఆ ప్రదేశంలో ఎటువంటి అలజడి లేదు. ఒక కింకరుడు మాట్లాడుతూ “తీసిన రెండు ప్రాణాలు మా నౌకలో ఎక్కించాము. మీరు కూడా వస్తే మనం బయల్దేరాలి” అన్నాడు.
అప్పటివరకు ఎవరి ప్రాణాలు పోతున్నాయో తెలుసుకోవాలన్న ఆదుర్దాతో ఉన్న వారిద్దరూ వెంటనే తమ కుర్చీల కోసం పరుగులంకించారు. పరుగు పరుగున నౌక వద్దకు చేరుకొని తమ కుర్చీల వద్దకు చేరుకున్నారు. అక్కడ తమ కుర్చీల మీద హుందాగా కూర్చుని ఉన్న రెండు పందెం కోళ్ళు కనిపించాయి. ఆ గ్రామంలో పోయిన ప్రాణాలు ఎవరివో అప్పుడు వాళ్ళకి అర్ధం అయింది.
తమ కుర్చీలను ఆక్రమించిన పందెం కోళ్ళను వెంటనే తరిమేయడానికి ప్రయత్నించారు పట్టాభి శరభయ్యలు. అంతలో అందులో ఒక కోడి వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ “యమభటులు మమ్మల్ని ఎగువ కుర్చీలలో కూర్చోవాలని చెప్పారు” అని పలికింది. కోడి మాట్లాడడం చూసిన పట్టాభి శరభయ్యలు నిర్ఘాంతపోయారు.
మరణించిన తర్వాత మాట్లాడటానికి అవకాశం ఇస్తారు అనుకుంట అన్నాడు పట్టాభి శరభయ్యతో. ఏది ఏమైనా సరే, ఈ కుర్చీలు మా హోదాకు తగినవి. మర్యాదగా ఇక్కడ నుండి తప్పుకోండి అన్నాడు శరభయ్య కోపంగా. అప్పుడు వాటిలో ఒక కోడి “ఇక్కడ అర్హత జ్ఞానం అనే ప్రాతిపదికన ఇవ్వబడుతుంది” అని తెలిపింది.

శరభయ్యకు పట్టరాని కోపం ముంచుకొచ్చింది. జ్ఞానం కోసం నీవు మాకు చెప్తున్నావా, నీ చావు ఎలా జరిగిందో నీకు తెలుసా, మా మనుషులు వారి ఆనందాల కోసం మీ కాళ్ళకు కత్తులు కట్టి ఒకదాని మీదకు మరోకదానిని ఉసిగొలిపి వదిలితే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీలో మీరే కొట్టుకు చచ్చారు. అలాంటి మీరు ఈ సృష్టిలోనే బుద్దిజీవులైన మనిషిని ఎగతాళి చేస్తున్నారా అని కోపంగా ఆ కోళ్ళను కిందకు త్రోసివేసేందుకు వెళ్లాడు.
వాగ్వివాదాన్ని గమనిస్తున్న ఒక యమభటుడు వేగంగా అక్కడకి వచ్చాడు. శరభయ్య నువ్వు ఏమి చేస్తున్నావ్ అని గంభీరంగా అడిగాడు. శరభయ్య కాస్త నెమ్మదించి మీరు అయినా న్యాయం చెప్పండి యమకింకరా. భూమి మీద మనుషులకు వారి హోదాకు తగ్గట్టు వారి వారి మర్యాదలు ఉంటాయి. అలానే మా హోదాకు తగినట్టుగా ముందుగా ఎగువ కుర్చీలను ఎంచుకున్నాము. అయితే ఈ అల్ప ప్రాణులైన జీవులు మా కుర్చీలను ఆక్రమించాయి. పైగా ఈ నౌకలో వారి వారి జ్ఞానం ప్రాతిపదికన మర్యాదలు ఉంటాయని, అలా స్వయంగా మీరే చెప్పారని అంటున్నాయి.

“మీరు ఒకవేళ నిజంగా అలా చెప్పినట్లు అయితే మీ మాటని గౌరవించడం మా విధి. కనుక మేము కూడా దానికి అంగీకరిస్తున్నాము. మనిషి ఈ భూమి మీద అత్యంత బుద్ది శాలి అయిన జీవి అని జగమెరిగిన సత్యం. కాబట్టి న్యాయబద్దంగా ఇవి మాకే చెందాలి. మనుష్యుని జ్ఞానానికి అలంకార ప్రాయమైన ఈ కుర్చీల విలువను బుద్ధి హీనులైన ఈ కోళ్ళు సర్వ నాశనం చేస్తున్నాయి. కాబట్టి వాటిని కిందకు తరుమడం సమంజసమే అని మా ఉద్దేశ్యం” అన్నాడు.
యమ భటుడు తన చేతిలో ఉన్న యమలోక ఆజ్ఞ పత్రాన్ని ఒకసారి తెరచి పరీక్షించి చూసాడు. వెంటనే శరభయ్య వైపు చూసి, “శరభయ్యా, మాకు ఇచ్చిన ఆజ్ఞ పత్రానుసారం జ్ఞానం ప్రాతిపదికన బుద్దిజీవులైన ప్రాణులకు ఎగువ కుర్చీలలో అలాగే అల్ప బుద్ధి జీవులకు దిగువ కుర్చీలలో తీసుకురమ్మని యమలోక పాలకుని ఆజ్ఞ. అలానే ఈ పత్రంలో మీకంటే బుద్ధిజీవులుగా ఈ కోళ్ళు పేర్కొనబడ్డాయి. అజ్ఞాన జీవులుగా మనుష్యులైన మీరు పేర్కొనబడి ఉన్నారు. ధర్మంలో సూక్ష్మ తత్వం మీలాంటి మనుషులకు గానీ లేదా మాలాంటి సాధారణ కింకరులకి గాని అంతుచిక్కనిది. ఈ ఆజ్ఞ పత్రంలోని మర్మం అక్కడికి చేరుకున్నాక మీకు నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తాము అని చెప్పి వెళ్ళిపోయాడు.
పట్టాభి శరభయ్యలు మరో దిక్కులేక మౌనంగా వెళ్లి దిగువ కుర్చీలలో కూర్చున్నారు. వారిలో కోపం కట్టలు తెంచుకుంటోంది. అల్పజీవుల కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏమిటి అని సహించలేకపోయారు. భూమి మీద దొరికే అరకొర న్యాయం అయినా మరణాంతరం దొరకడం లేదని తమలో తాము వాపోయారు. ఈ విషయంలో యమధర్మ రాజుని గట్టిగా నిలదీయాలని ఆలోచించసాగారు.

నౌక కొన్ని గడియల్లో యమ లోకానికి చేరుకుంది. పట్టాభి శరభయ్యలు చుట్టూ ఆశ్చర్యంగా చూడసాగారు. వారు విన్న యమలోకానికి, దానికి అస్సలు పోలిక లేదు. అది మానవ ఊహకు అందని సరికొత్త ప్రపంచం. యమభటులు వచ్చి “మీరు చేరుకోవాల్సిన గమ్యం ఇదే. మీరు ఇక్కడ కిందకి దిగవచ్చు” అన్నాడు.
పట్టాభి కలగజేసుకుని “యమకింకరా, మేము యమధర్మ రాజుతో తేల్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని అతని వద్దకు తీసుకెళ్ళండి” అన్నాడు. యమ కింకరులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. యమధర్మ రాజు దర్శనం లభించి మాకే కొన్ని యుగాలు గడిచింది అన్నాడు అందులో ఒక కింకరుడు. “అదేంటి అలా అయితే మాకు న్యాయం ఎలా లభిస్తుంది. మా సందేహాలు ఎవరు నివృత్తి పరుస్తారు” అన్నాడు ఆశ్చర్యంగా పట్టాభి.
ఈ లోకంలో న్యాయం, అన్యాయం అనే పదాలు ఉండవు. అది భూలోక వాసులు మాత్రమే ఉపయోగించే పదాలు. యమధర్మ రాజు పాలనలో ప్రాణులన్నీ ధర్మాన్ని అనుసరించి మాత్రమే నడుచుకోవాలి. ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. కాబట్టి న్యాయం, అన్యాయం అనే పదాలకు త్రావు లేదు అన్నాడు యమ కింకరుడు.
పట్టాభి శరభయ్యలు ఆలోచనలో పడ్డారు. మరి మా సందేహాలను ఎవరు నివృత్తి పరుస్తారు అని ఆక్రోశంగా అన్నాడు శరభయ్య. మేము మళ్ళీ భూమి మీదకు వెళ్లి రావాలి. వచ్చాక ఏమి చేయాలో చెప్తాం అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని యమభటులు నౌకను తీసుకుని వెళ్ళిపోయారు.

కాసేపు నిరీక్షణ అనంతరం భూమికి వెళ్ళిన కింకరులు నౌకతో తిరిగి అక్కడకి చేరుకున్నారు. వారితో కొందరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దాదాపు మనిషి పోలికలు ఉన్నప్పటికీ భూమి మీద వ్యక్తులు లాగా కనిపించలేదు. శరభయ్య కింకరుల వద్దకు వెళ్లి “అయ్యా, మీరు భూమికి వెళ్తున్నట్టు చెప్పారు. కానీ మీరు తీసుకొచ్చిన ఈ ప్రాణులు కొంచెం మానవ పోలికలు ఉన్నప్పటికీ పూర్తి వైవిధ్యంగా ఉన్నారు. మీరు మాతో భూలోకానికి వెళ్తున్నట్టు అబద్దం చెప్పాల్సిన అవసరం ఏముంది. ఈ లోకంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్పారు. మరి ధర్మబద్ద పరిపాలనలో మీరు మాకు ఈ అబద్ధం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి” అని ప్రశ్నలను సంధించాడు పట్టాభి.
యమభటుడు శరభయ్య మాటలకు చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. “చూడు పట్టాభి. ఇందులో ఏదీ అసత్యం లేదు. మేము వెళ్ళింది భూలోకానికే. వీళ్ళంతా మీలాంటి సాధారణమైన మనుషులు. ఇక్కడి కాలమానం ప్రకారం గడిచిన ఒక గంట సమయం భూమి మీద డబ్భై వేల సంవత్సరాలకి సమానం. వీళ్ళంతా మీ తర్వాత పరిణామ క్రమం చెందిన మనుషులు అన్నాడు.
శరభయ్యకి కళ్ళు తిరిగినంత పని అయింది. అంటే నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు అందరూ మరణించారా అని ఆదుర్దాగా అడిగాడు. అవును నీ తరం ముగిసి లక్షా నలభై వేల ఏళ్ళు గడిచింది అన్నాడు కింకరుడు. మరి వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు అని నిర్ఘాంతపోతూ అడిగాడు పట్టాభి. వాళ్ళు ఈ అనంత విశ్వంలో ఏదో ఒక యమ కింకర సమూహానికి చేరుకొని ప్రస్తుతం బహుశా ఈ విశ్వ చక్రంలో తిరుగుతూ ఉంటారు. మా కనురెప్పపాటు కాలంలో మీ భూమిపై వంద తరాల జీవితాలు ముగిసిపోతాయి. మీ హోదా, మీ గొప్పతనం, మీ కీర్తి, మీ అధికారం ఏపాటిదో ఒకసారి ఆలోచించండి అని వారి పూర్వ ప్రవర్తనను గుర్తు చేస్తూ అన్నాడు కింకరుడు.

పట్టాభి శరభయ్యలు సిగ్గుతో తలదించుకున్నారు. సరే నన్ను అనుసరిస్తూ రండి. మీకు వచ్చిన ధర్మ సందేహం మా నాయకులు తీర్చుతారు అన్నాడు కింకరుడు. అతన్ని అనుసరిస్తూ వెళ్తున్న పట్టాభి “మీ నాయకుడు అంటే ఎవరు అన్నాడు. మా సమూహానికి నాయకుడు. మా సమూహంలో లక్షమంది కింకరులు ఉన్నారు అన్నాడు. “అవునా అలాంటి సమూహాలు యమధర్మ రాజు పాలనలో ఎన్ని ఉంటాయి” అని అడిగాడు శరభయ్య. అతని సామ్రాజ్యం అనంతం. ఆ సామ్రాజ్యంలో మా సమూహం యొక్క సంఖ్య గానీ, మా ఉనికి గానీ, మేమున్న స్థానం గానీ మాకు కూడా తెలియదు అని కింకరుడు అన్నాడు.
కింకరుడు వెళ్తూ ఉండగా కళ్ళు బైర్లు కమ్మిన శరభయ్య అక్కడే ఆగిపోయాడు. పట్టాభి అతని భుజం తట్టి ఏమైంది అని అడిగాడు. శరభయ్య మాట్లాడుతూ మనమెంత అజ్ఞానులం! మన జీవితం, మన బ్రతుకులు ఈ అనంత విశ్వంలో ఏపాటివి, ఏకంగా యమధర్మ రాజుని నిలదీయడానికి సిద్దం అయ్యామంటే మన అజ్ఞానం నాకు ఇక్కడే అర్ధం అయింది, ఇంకా అక్కడ వరకు ఎందుకు? వెనక్కి వెళ్దాం” అన్నాడు. పట్టాభి కాస్త అలోచించి “ఇది మనకున్న చాలా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అనుకుందాం, వెళ్దాం పద” అన్నాడు.
లక్షమంది కింకరుల నాయకుడు, ఎర్రని కళ్ళతో అతిభయంకరమైన రూపంతో యమధర్మ రాజు వాహన ఆకారం కలిగిన ఒక పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతను చిటికె వేస్తే సర్వ జీవరాశులు తుడిచిపెట్టుకు పోతాయేమో అన్నంత భయంకరంగా ఉన్న అతని రూపాన్ని చూసి పట్టాభి శరభయ్యలు వినయంతో దూరంగా నిల్చున్నారు.

కింకరుడు తమ నాయకునికి నమస్కరించి మహానాయకా, ఈ జీవులను మనకు ఎనభై లక్షల పాలపుంతల ఆవలి ఉన్న భూలోకము అని పిలవబడే ఒక చిన్న గోళం నుండి తీసుకువచ్చాము. వీరిని గైకొని వచ్చు సందర్భములో మా నౌకలో బుద్ది జీవుల కొరకు కేటాయించిన ఎగువ కుర్చీల గురించి వాదన చేస్తూ, కోడి అని పిలవబడే ఒక అజ్ఞాన జీవికి ఎగువ కుర్చీ ఇవ్వడంలో అంతర్యం ఏమిటి?” అని వీరి ప్రశ్న. దయచేసి వీరి సందేహాన్ని నివృత్తపరచండి అని చెప్పి నమస్కరించి పక్కకు తప్పుకున్నాడు.
మహానాయకుడు ఎంతో ప్రశాంతంగా పట్టాభి శరభయ్యల వైపు చూసి కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళ గతాన్ని క్షణాల్లో అవగతం చేసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. యమలోక ధర్మ నియమాల అనుసారం మానవులుగా పిలవబడే మీ ఇరువురికంటే కోడి అని పిలవబడే జీవి బుద్దిజీవిగా ప్రకటించబడింది. మానవులు తమ సంతోషాల కోసం, జూదంలో పావులుగా ఉపయోగించే కోడి అనే జీవి, ఆ విషయాన్ని గ్రహించకుండా తమలో తాము పొడుచుకుని ప్రాణాలని కోల్పోవడం జరిగింది. మనుషులైన మీ ఇరువురు కూడా అదే రీతిలో ఆస్తి అనే తాత్కాలికమైన విషయాన్ని శాశ్వతం అనే భ్రాంతితో గొడవపడి విచక్షణను మరిచి మీలో మీరు కొట్టుకుని ప్రాణాలను కోల్పోయారు.

మీతో ఇక్కడకు తీసుకురాబడిన కోడి అనే జీవులు మనుషులు ఉసిగోలిపిన కారణంగా మరణించాయి. మనుషులైన మీరు ఎవరి ప్రమేయం లేకుండానే మీ విచక్షణ కోల్పోతూ ఒకర్ని ఒకరు చంపుకుంటున్నారు. మనుషుల కారణంగా మరిణించిన కోళ్ళ యొక్క పాప కర్మలు కూడా మనుషులకే చేరుతున్నాయి. అలాగే కోడి అనే జీవికి తన చావు పుట్టుకల గురించి ఎటువంటి స్పృహ ఉండదు. అది అటువంటి ప్రవర్తనను కనబరచడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ మనిషికి పూర్తి స్పృహ ఉంది. అయినప్పటికీ అటువంటి ప్రవర్తనను కనబరుస్తూ సృష్టిలో అత్యంత అజ్ఞాన జీవిగా తనువు చాలిస్తున్నాడు” అని ముగించాడు.

పట్టాభిశరభయ్యలు తమ అజ్ఞాన జీవితాన్ని తలచుకుని సిగ్గుపడ్డారు. అలాగే తమ సందేహాలను నివృత్తి చేసిన యమకింకర నాయకునికి పాదాభివందనం చేసి దయనీయమైన తమ గత జీవితాన్ని అసహ్యించుకుంటూ దిగులుగా బయటకు నడిచారు.