ఆగర్భ శతృవు

Real life inspirational stories in Telugu

ముందుమాట: దయచేసి నా కథలు చివరిదాకా చదవండి. అప్పుడే మీకో స్పష్టత వస్తుంది. 

కోటీశ్వరుడైన ఆనంద్ విక్రమ్ ఒక మారుమూల ప్రాంతంలో వ్యవసాయ కూలిగా జీవనం సాగాస్తు అనుకోకుండా ఒక పత్రికావిలేకరి కంటపడ్డాడు. ఆనంద్ విక్రమ్  ఉనికి పదేళ్ళ తర్వాత బయట ప్రపంచానికి తెలియడంతో ఆతడి వ్యాపార ప్రత్యర్ధి అయిన దామోదర్ విట్టల్ తక్షణమే అతడిని కలుసుకునేందుకు బయల్దేరాడు. 

తన హోదాను చూసి ప్రత్యర్ధులు అసూయ పడే  విధంగా దామోదర్ విట్టల్ తన  నలభై కార్ల కాన్వాయ్ వెంటబెట్టుకుని ఆనంద్ విక్రమ్ ఉంటున్న మారుమూల గ్రామానికి పయనం అయ్యాడు. వాహనాల వేగానికి ఆ గ్రామం యొక్క  వీధులలో ధూళి మేఘాలు కమ్మేసాయి. 

ఇదంతా గమనిస్తోన్న గ్రామస్తులు ఏమి జరుగుతోందో అర్ధంకాక అయోమయంలో ఉన్నారు. 

వాహనాలన్నీ గ్రామాన్ని దాటి వేగంగా దూసుకెల్తూ ఒకచోట ఆగాయి. అకస్మాత్తుగా అన్నికార్ల తలుపులు వరసగా తెరుచుకున్నాయి. 

Best Real Life Inspirational Stories

పదుల సంఖ్యలో ఒకే రంగు దుస్తులు వేసుకున్న కొందరు వ్యక్తులు పరుగు పరుగున వెళ్లి కాన్వాయ్ లో  ముందు వరుసలో ఉన్న ఒక కార్ యొక్క డోర్ తెరిచారు. నల్లకోటు నల్ల కళ్ళజోడు పెట్టుకున్న ఒక పెద్దమనిషి చుట్టూ పరిశరాలను గమనిస్తూ నెమ్మదిగా బయటకి దిగాడు. 

చేతిలో గడ్డపారతో పొలం గట్టు త్రవ్వుతూ దీనమైన పరిస్థితులలో ఉన్న ఆనంద్ విక్రమ్ పదేళ్ళ తర్వాత తన ప్రత్యర్ధి దామోదర్ ని చూసాడు. ఆనంద్ విక్రమ్ ఒక్క క్షణం తన గతాన్ని తలచుకుని తిరిగి తనకు ఏమి పట్టనట్టు పనిలో మునిగిపోయాడు. 

దామోదర్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆనంద్ వద్దకు వెళ్ళాడు. “హాలో మైడియర్ ఫ్రెండ్, కొండను డీ కొట్టాలనుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా నీకు అర్ధమైందా అన్నాడు. ఆనంద్ విక్రమ్ ఒక్కక్షణం గడ్డపారను చేతిలో నిలిపి దామోదర్ ముఖాన్ని చూడకుండా ప్రక్కకు చూస్తూ మళ్ళీ పనిలో పడ్డాడు. 

దామోదర్ తిరిగి మాట్లాడుతూ “నీకో విషయం చెప్పనా, నాకు ఈ మధ్యనే రెండువేల కోట్ల కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది.  అప్పుడు కుడా నాకు ఇంత సంతోషం కలగలేదు. ఏదేమైనా ప్రత్యర్ధి ఇలా రోడ్డున పడ్డప్పుడు వచ్చే మజా ఎందులోనూ ఉండదు కదా? అన్నాడు.

ఆనంద్ విక్రమ్ మరోసారి గడ్డపారను నిలిపి దామోదర్ వైపు నెమ్మదిగా చూసాడు. దామోదర్ వంకర్లు తిరిగిన తన మీసాలను మెలివేస్తూ “అయ్యో! ఏంటి ఆనంద్, నా కాళ్ళు పట్టుకుని అడిగితే నా ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగం అయినా ఇప్పెంచేవాడిని కదా. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది” అని వంగ్యంగా అన్నాడు. 

ఆనంద్ గడ్డపారను ప్రక్కన పెట్టి, తన తలపాగాను విప్పి ప్రక్కన ఉన్న ఒక చెట్టుకొమ్మకు తగిలించాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న పల్లెవాసులు ఏమి జరుగుతుందా అని గమనిస్తున్నారు. తర్వాత ఆనంద్ చుట్టూ ఎదో వెతుకుతూ ప్రక్కనే పొలం గట్టుపై ఉన్న కొడవలిని చేతిలోకి తీసుకున్నాడు. 

దామోదర్ కాళ్ళు గడగడా వణకడం ప్రారంభం అయ్యాయి. దామోదర్ వెంట వచ్చిన అతడి అనుచరులు వెంటనే అతడికి రక్షణ కల్పించడానికి అప్రమత్తం అయ్యి ముందుకు కదులుతున్నారు. ఒక్కక్షణం అందరికీ తీవ్రమైన భయాంధోలనలు కమ్మేసాయి. 

ఆనంద్ ఎవర్నీ పట్టించుకోకుండా కొడవలితో చెట్టుపై విస్తరి ఆకులను కోసాడు. అంతా హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. తర్వాత ఆకులను చాపలాగా క్రింది వేసుకుని ఇంటి నుండి తెచుకున్న చద్దికూడుని, ఆవకాయను వడ్డించుకోవడం ప్రారంభించాడు. 

దామోదర్ కాస్త ఊపిరి తీసుకుని ఆనంద్ వైపు చూస్తున్నాడు. ఆనంద్ దామోదర్ వైపు చూసి, “ఏందయ్యా దామోదర్!, అలా చూస్తున్నావ్. ఆకలిగా ఉందా. రెండు ముద్దలు వడ్డించమంటావా. తప్పు ఏమీ లేదు. ప్రక్కవాడి తిండి మీద ఆశపడటం నీకు అలవాటేగా” అన్నాడు. 

చుట్టూ జనం చూస్తున్నారు. దామోదర్ కు పట్టరాని కోపం ముంచుకొచ్చింది. వెంటనే ప్రక్కనే ఉన్న కొడవలి చేతిలోకి తీసుకున్నాడు. మరోసారి చుట్టూ ఉన్న వారందరికి భయాందోళనలు కమ్మేశాయి. 

దామోదర్ వేగంగా వెళ్లి అదే చెట్టు యొక్క ఆకులను కోసి వేగంగా వచ్చాడు. ఆనంద్  వైపు కోపంగా చూస్తూ అతడి ముందు నేలపై కూర్చున్నాడు. “నిజంగానే ఆకలిగా ఉంది. రెండు ముద్దలు పెట్టారా” అని అని కడుపుని నిమురుతూ అమాయకంగా తన బాల్యమిత్రుడు ఆనంద్ ని అడిగాడు దామోదర్. 

ఆనంద్ చిన్నగా “నవ్వి నాకు తెలుసురా నువ్వు ఆకలికి అస్సలు తట్టుకోలేవు ఇదిగో పట్టు”  అంటూ అతడి కంచంలోని కొంత  అన్నాన్ని తీసి దామోదర్ చేతితో పట్టుకున్న ఆకులో వేసాడు. 

దామోదర్ ప్రక్కకు చూడకుండా  చక చకా తినడం ప్రారంభించాడు. తర్వాత ఆనంద్ కళ్ళలోకి చూస్తూ “ నిజమేరా, నేను అప్పటికీ ఇప్పటికీ ఏమి మారలేదు. ఆకలి వేసిందంటే ప్రక్కవాడి ప్లేటు లాక్కొని అయినా తినేస్తాను” అన్నాడు.  “ఆం, అదొక్కటే కాదు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నీ వెటకారం కూడా ఏమీ మారలేదు” అన్నాడు తమ గతాన్ని తలచుకుంటూ  ఆనంద్.

Interesting Real Life Inspirational Stories

చుట్టూ గుమిగూడి చూస్తున్న జనంతో పాటు దామోదర్  విట్టల్ అనుచరులు ఆశ్చర్యంతో అయోమయంలో పడ్డారు. ఇద్దరూ భోజనం ముగించి చేతులు కడుగుకున్నారు. దామోదర్ చెట్టుకొమ్మకు వ్రేలాడుతోన్న తలపాగా గుడ్డను తీసి అతడి స్నేహితుడికి అందించాడు. 

తర్వాత దామోదర్ విట్టల్, చుట్టూ ఆశ్చర్యంతో చూస్తున్న జనాన్ని చూసి “ఏంటి, ఏమీ అర్ధం కావట్లేదా? ఇతడు ఆనంద్ విక్రమ్, నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు. వేల కోట్ల ఆస్తికి యజమాని. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇలా అజ్ఞాతంలోకి వచ్చేసాడు. చివరికి ప్రాణ స్నేహితుడైన నాకు కూడా. బహుశా నేను ఏదైనా తప్పుచేసానేమో అన్నాడు. 

ఆనంద్ విక్రమ్, దీనంగా అతడి స్నేహితుడి వైపు చూసి లేదు అన్నట్టు తలను ఊపాడు. “సరే సరే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. పనిలో నీకు కాస్త సహాయం చేయమంటావా” అని గడ్డపార చేతిలోకి తీసుకుని త్రవ్వడం ప్రారంభించాడు దామోదర్. 

ఒరేయ్, నువ్వు సడెన్ గా ఈ పనిచేస్తే, నువ్వు దర్జాగా  వచ్చిన నలభై కార్లలోనే నిన్ను  మోసుకెళ్లాల్సి వస్తుంది, ఆ గడ్డపార ఇలా ఇవ్వు” అన్నాడు ఆనంద్. “కాసేపు ఉండరా, పదేళ్ళపాటు నువ్వు పడిన కష్టం నేను తెలుసుకోవాలిగా అన్నాడు. ఆనంద్ మాట్లాడకుండా ప్రక్కన నిల్చున్నాడు. 

దామోదర్ అలసిపోతూ, ఏరా, అయినా నీకు వ్యవసాయం చేయడం ఇష్టం అని అప్పుడే చెప్తే సరిపోయేది. ఆమాత్రం దానికి మా అందర్నీ వదిలేసి వచ్చేయాలా అన్నాడు. ఆనంద్ మౌనంగా ఉన్నాడు. సరే, ఇక్కడ నుండి కనుచూపు మేరలో కనిపిస్తున్న పొలం అంతా మనదేనా అని మళ్ళీ అడిగాడు దామోదర్.

అంటే.. ఈ పొలం మనది కాదురా. ఒక పెద్దాయన వద్ద కూలికి పనిచేస్తున్నాను అని నెమ్మదిగా చెప్పాడు ఆనంద్ విక్రమ్. దామోదర్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సరే జరిగేందో జరిగింది. పదరా మన ఇంటికి వెళ్దాం అని బ్రతిమాలాడు దామోదర్ విట్టల్. 

“ఆనంద్ విక్రమ్ ఎదో ఆలోచిస్తూ “నన్ను చూడాలని వచ్చినందుకు చాలా థాంక్స్ రా. కాని నేను నీతో రాలేను. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు” అన్నాడు. దామోదర్ కి కోపం వచ్చింది. “నీ సమస్య ఏంటిరా? అసలు నీకు ఏమైంది?  ఎందుకు ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు” అని నిలదీసాడు కోపంగా. 

ఆనంద్ తన చేతిని దామోదర్ భుజం మీద వేసి “నీకో కథ చెబుతాను. ఆ సందర్భంలో నువ్వే ఉంటే ఏమి చేస్తావో చెప్పు” అన్నాడు. “సరేరా చెప్పు” అన్నాడు దామోదర్. 

ఒకవ్యక్తికి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. కాని అతడికి ఏడురోజుల ఆయుష్షు మాత్రమె మిగిలి ఉంది. అప్పుడు అతనికి మిగిలి ఉన్న ఏడురోజుల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలో ఆలోచించాడు. చివరిగా అతడికి రెండు మార్గాలు జ్ఞప్తికి వచ్చాయి. 

మొదటిది తనకు ఉన్న భోగభాగ్యాలను ఆ ఏడురోజులు పూర్తిగా  అనుభవించడం ద్వారా సద్వినియోగం చేసుకోవడం. కానీ ఇన్నేళ్ళు అనుభవించిన భోగభాగ్యాలు ఈ ఏడు రోజులలో సంతృప్తిని కలిగిస్తాయని అతడికి అనిపించలేదు. 

రెండవది మిగిలిన ఏడురోజులు పూర్తిగా  భగవంతుడి ధ్యానంలో పరవశించి తనువు చాలించడం. మొదటి దానికంటే రెండవది అతడికి సంతృప్తిని కలిగిస్తుందని తలచాడు. అనుకున్నట్టుగానే అతడు ఏడురోజుల పాటు తీవ్రమైన వైరాగ్యంతో భగవంతుడి ధ్యానంలో ఉండేందుకు సిద్దపడ్డాడు. 

మొదటి రోజు రాత్రి అతడి వేదన గమనించిన భగవంతుడు ప్రత్యక్షమైయ్యాడు. నాయనా, భక్తులు తీవ్రమైన వైరాగ్యంతో నన్ను ఒక్క క్షణం తలచినా ప్రసన్నం అవుతాను.  నీవు ఆలోచించిన రెండు మార్గాలకు సరిపడే రెండు ప్రత్యామ్నాయాలను నీకు నీకు ప్రసాస్తాను. అందులో ఏది కావాలో నీవు ఎంచుకోవచ్చు అన్నాడు. 

Best Inspirational Real Life Stories

ఆ వ్యక్తి అలా నమస్కరిస్తూ భగవంతుడు చెప్పే రెండు ఎంపికల కోసం వేచియున్నాడు. భగవంతుడు తిరిగి మాట్లాడుతూ మొదటిది నీకు ఏడు నెలల కాలం అష్ట ఐశ్వరాలతో కూడిన జీవితం ప్రసాదిస్తాను. రెండవది నీకు కటిక పేదరికంతో కూడిన  ఏడేళ్ళ ఆయుష్షు ప్రసాదిస్తాను. ఏది కావాలో కోరుకో అన్నాడు. 

దామోదర్ కళ్ళలోకి చూస్తూ “సరిగ్గా అలంటి పరిస్థితి నీకే వస్తే నువ్వు భగవంతుడ్ని ఏది కోరుకుంటావు అని సూటిగా  అడిగాడు ఆనంద్ విక్రమ్. 

దామోదర్ చేతులు జోడించి తన స్నేహితుడికి దణ్ణం పెడుతూ మరో మాట మాట్లాడకుండా వచ్చిన దారిలోనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

  • చివరి బోనస్‍గా క్రింది అద్భుతమైన కొటేషన్స్ చదవండి.
  • 50+ best quotes on life in telugu

ఆనంద్ విక్రమ్ తన జీవితంలో అతడికి ఎలాంటి సంఘటన ఎదురైంది. అతను ఎటువంటి పరిస్థితులలో ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాడో  తెలుసుకోవడం ఇప్పుడు ముఖ్యం కాదు. అలాంటి పరిస్థితి ప్రతి మనిషి జీవితంలోనూ జరిగే ఒక నిరంతర ప్రక్రియ. 

భగవంతుడు ఎప్పుడూ మనిషికి రెండు ఎంపికలను ఇస్తూనే ఉంటాడు. కాని మనిషి ఎల్లప్పుడూ వాటిలో మొదటి ఎంపికను కోరుకోవడానికే ఇష్టపడతాడు. ఎందుకంటే అతడికి భగవంతుడు ఇచ్చిన  రెండు ఎంపికల మధ్య బేధాన్ని గుర్తించడం తెలియదు. రెండవ ఎంపిక ఉద్దేశ్యం పేదరికంలో జీవించమని కాదు. కాలానికి ఉన్న విలువను గుర్తించమని. ఎదురుగా ప్రస్పుటంగా కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని గుర్తించలేనంత కాలం మీకు మీరే “ఆగర్భ శతృవు”. 

“ఎప్పుడైనా మీరు దేనినైనా కోల్పోయి, మీకు మీ జీవితం పట్ల తీవ్రమైన అసంతృప్తి కలిగినప్పుడు మీరు కోల్పోయినదానిని మీరే స్వయంగా, ఇష్టపూర్వకంగా త్యాగం చేసినట్లు భావించండి. అప్పుడు మీరు కోల్పోయింది మీ జీవితం కంటే ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది”. 

-మీ తెలుగు సంహిత

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!