సాలిగ్రామ యోధుని కథ:-

A warrior with plenty of self confidence

సాలిగ్రామపురం అనే ఒకానొక ప్రాంతంలో రామయ్య అనే ఒక తోటమాలి నివసిస్తూ ఉండేవాడు. రామయ్య తన గ్రామానికి సమీపంలోని ఏనుగుల వనం అనే రాజమాన్యంలో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ఉన్న ఏకైక కుమారుడు విజయుడు. విజయుడు అంటే రామయ్యకు అమితమైన ప్రేమ. అయితే ఒకరోజు బలిష్టంగా ఉన్న నలుగురు ప్రాంతీయ అధికారులు రామయ్య ఇంటి గుమ్మం వద్ద నిలిచి కోపంతో ఊగిపోతూ “ఏం రామయ్య, నీ కొడుకుని పిలువు, వాడు మరో రెండు నిముషాల్లో ఇక్కడ ఉండకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించారు. రామయ్యకు ఏమీ అర్ధం కాక భయపడుతూ, “అయ్యా! వాడు ప్రక్క గ్రామానికి పచారీల కోసం వెళ్ళాడు. ఏమి జరిగిందో కాస్త చెప్పండి. వాడు ఏదైనా పొరపాటు చేసి ఉంటే నేను మందలిస్తాను. దయచేసి వాడిని క్షమించి వదిలేయండి” అని ప్రాధేయపడుతూ అడిగాడు రామయ్య. 

Self Confidens and the Success
Strangers attacking

అప్పటికే పట్టరాని ఆక్రోశంలో ఉన్న దిర్బహుడు అనే ఉద్యోగి రామయ్య మెడను పట్టుకుని ప్రక్కకు తోసేసాడు. నేలకొరిగిన రామయ్య లేవలేని స్థితిలో “అయ్యా, వాడు చేసిన తప్పుకి నన్ను శిక్షించండి, దయచేసి వాడ్ని వదిలేయండి” అని ప్రాధేయపడుతూ రోధించాడు. ఆ వ్యక్తులు కర్కసంతో రామయ్యను కాలితో కొట్టారు. రామయ్య నొప్పితో అరుస్తూ కిందపడిపోయాడు. వారు అతన్ని అలాగే వదిలేసి “పదండి, వాడి అంతు చూద్దాం” అని గుర్రాలపై వెళ్ళిపోయారు. 

విజయుడ్ని కలుసుకునేందుకు వస్తున్న బుజ్జప్ప అనే అతని స్నేహితుడు రామయ్యను ఆ స్థితిలో చూసి పరిగెత్తుకుని వచ్చి అతన్ని లేవదీసి “ఏమైంది పెద్దయ్య, వాళ్ళంతా ఎవరు?” అని అడిగాడు. రామయ్య జరిగింది అతనితో చెప్పి “విజయుడు ఎవరితోనైనా ఈ మధ్య తగాదా పడ్డాడా” అని అడిగాడు. “తగాదా అంటే, ఎవర్నో నిన్న తప్పు చేసాడని కొట్టాడు అంతవరకు మాత్రం నాకు తెలుసు పెద్దయ్య” అన్నాడు. “అంటే విజయుడు ఎవరో అధికారం కలిగిన పెద్ద ఇంటి వాడిపై చేయి చేసుకున్నాడన్నమాట. సరే సరే, విజయుడిని అక్కడి నుండి ఎక్కడికైనా పారిపోమని చెప్పు బుజ్జప్ప” అని అతడిని వేగిరపాటుగా పంపించాడు.

బుజ్జప్ప ఎంతో కష్టపడి పరుగున పక్క గ్రామానికి చేరుకున్నాడు. కానీ అక్కడ అతను చేసేది ఏమీ లేని పరిస్థితి. ఆ వ్యక్తులు అప్పటికే విజయుడ్ని చుట్టు ముట్టేసారు. వారిలో ఒకడైన దిర్బహుడు కోపంతో ఊగిపోతూ “నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా” అని పిడికిలి బిగబట్టి మొహం మీద కొట్టాడు. విజయుడు కిందపడి నెమ్మదిగా పైకి లేచాడు. దిర్బహుడు మరింత కోపోద్రుక్తుడై “నువ్వు మా నిగమాధ్యక్షుడి కొడుకు మీదనే చేయిచేసుకునేంత మొనగాడివా?” అని మళ్ళీ బలంగా కొట్టాడు. 

దూరంగా గమనిస్తున్న బుజ్జప్ప పరిగెత్తుకుని వచ్చి దిర్బహుడి కాళ్ళు పట్టుకున్నాడు. “అయ్యా, నా స్నేహితుడు తెలియక పొరపాటు చేసాడు. అతన్ని క్షమించండి. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయడు, దయచేసి ఈ ఒక్కసారికి అతన్ని క్షమించండి” అని వేడుకున్నాడు. దిర్బహుడు బుజ్జప్పని పైకి లేపి “ఓహ్, నీవు ఈ పోగరబోతుకి స్నేహితుడివా, అయితే నీకు కుడా ఇందులో భాగం ఉంటుంది” అని బుజ్జప్ప నడుం విరిగేలా కాలితో గట్టిగా తన్నాడు. 

బాధతో విలవిలలాడుతూ బుజ్జప్ప ఆరు అడుగుల దూరంలో పడ్డాడు. విజయుడికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే లేచి నిల్చున్నాడు. “ఈ గొడవకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. అతన్ని వదిలేయండి. మీకు కావాల్సింది నేనేగా, నన్ను కొట్టండి” అన్నాడు. “ఓహ్, అలా వచ్చావా, అయితే మాకు కావాల్సింది నువ్వు కాదు వీడే” అని దిర్బహుడు బుజ్జప్పని మరోమారు గట్టిగా తన్నాడు. 

విజయుడు మిక్కిలి ఆవేశంతో దిర్బహుడ్ని బాహువులపై గట్టిగా కొట్టాడు. దిర్బహుడు ఆ దెబ్బకి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. వెంటనే మిగిలిన ముగ్గురు వ్యక్తులు భయంకరంగా విజయుడిపై దాడిని ప్రారంభించారు. విజయుడు చాకచక్యంగా తప్పించుకుని ముగ్గురికీ చెరో దెబ్బ వేసాడు. దెబ్బతో ముగ్గురూ ఒకేసారి నేల మీద పడ్డారు. 

చుట్టూ జనం గుమిగూడారు, “అయ్యో! ఇతను రాక్షసుడి లాంటి నిగమాధ్యక్షుని మనుషుల్ని కొట్టాడు, ఇటుపైన ఇతడ్ని ఆ దేవుడే రక్షించాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతా వింటున్న బుజ్జప్ప భయపడుతూ విజయుడి చేయి పట్టుకుని “వెంటనే ఇక్కడ నుండి పారిపోదాం” అని గట్టిగా లాగాడు. అంతలోనే నిగమాధ్యక్షుడు మరియు అతని కుమారుడు సుమారు రెండు వందల మంది అశ్వక దళంతో కలసి విజయుడు, బుజ్జప్పని చుట్టుముట్టారు. 

Self Confidens and the Success
Surrounding with horses

నిగమాధ్యక్షుని కుమారుడు పరీచుడు గుర్రం దిగి విజయుడి దగ్గరకు వచ్చాడు. “ఏరా, బలగం లేని సమయంలో నా మీదే చేయిచేసుకుంటావా?” అని విజయుడ్ని కొట్టబోయాడు. విజయుడు వెంటనే తప్పించుకుని పరీచుడి ఎముకలు విరిగేలా గట్టిగా చరిచాడు. పరీచుడు పెద్దగా అరుస్తూ దూరంగా పడ్డాడు. చుట్టూ జనం ఆశ్చర్యపోయారు. కొందరు ఏం జరుగబోతోందా అని గట్టిగా కళ్ళు మూసుకున్నారు. 

అశ్వక దళంతో సిద్ధంగా ఉన్న నిగమాధ్యక్షుని సైన్యం ఒక్కసారిగా విజయుడిపై విరుచుకు పడింది. విజయుడు ధైర్యంతో పోరాటం చేస్తున్నాడు. ఒకేసారి పదిమందిని చెల్లా చెదురుగా విసిరేస్తున్నాడు. ఒక వ్వైపు తనని తాను రక్షించుకుంటూ మరో వైపు తన స్నేహితుడి ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు. అలా దాదాపుగా యాభై మంది సైన్యాన్ని నేలకొరిగించాడు.

Self Confidens and the Success
Simultaneous attack

విజయుడ్ని కట్టడి చేయడం తమవల్ల కాదు అనుకున్న నిగమాధ్యక్షుడు అతని స్నేహితుడి మీద దాడి చేయమని ఆజ్ఞాపించాడు. అనుకోకుండా బుజ్జప్ప వాళ్ళ చేతికి చిక్కిపోయాడు. వెంటనే పరీచుడు బుజ్జప్ప మెడ మీద కత్తి ఉంచి “మర్యాదగా లొంగిపో, లేదంటే నీ స్నేహితుడు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి” అన్నాడు. ఏమీ చేయలేని స్థితిలో విజయుడు చేతులు చాచి, మోకాలిపై కూర్చున్నాడు. పరీచుడు ఉక్రోషంతో, “చూస్తారేం, వాడి కాళ్ళు చేతులు నరికేసి నరకయాతన పడేలా ప్రాణాలు తీసేయండి” అన్నాడు. చుట్టూ పదిమంది వ్యక్తులు కత్తులతో ఒకేసారి విజయుడి మీద దాడి చేయబోయారు. 

బుజ్జప్ప మరింత శోకంతో గుండెలు బాదుకున్నాడు. విజయుడు గట్టిగా కళ్ళు మూసుకుని చివరి సారిగా తన ఇష్టదైవాన్ని తలచుకున్నాడు. అంతా నిశ్శబ్ధం ఆవరించింది. చుట్టూ ఉన్న ప్రజలు భయంతో కళ్ళు మూసుకున్నారు. రెండు క్షణాలు గడిచింది, మరణించి యుంటాను అనుకుని సందేహంతో విజయుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని మీద దాడిచేయబోయిన పదిమంది వ్యక్తులు బాణాలు తగిలిన గాయాలతో చెల్లా చెదురుగా పడి ఉన్నారు. 

ప్రజలంతా ఒక్కొక్కరిగా కళ్ళు తెరిచారు. ఏదో ఇంద్రజాలం జరిగినట్టు చుట్టూ చూడసాగారు. పరీచుడికి ఏం జరిగుతోందో అర్ధంకాక బుజ్జప్పని మరింత గట్టిగా పట్టుకుని కత్తి ఉంచాడు. మళ్ళీ అంతా నిశ్శబ్ధం ఆవరించింది. భయంకరమైన నిశ్శబ్దంలో అటువైపుగా వస్తున్న గుర్రం డెక్కల శబ్ధం అందరూ గమనించారు. పరీచుని మనుషులు ఒక్కటిగా చేరి స్వారీ చేస్తూ వస్తున్న వ్యక్తిని మట్టు పెట్టాలని కత్తులు తీసి సిద్ధమయ్యారు. 

Self Confidens and the Success
White horse entry with the royal seal

చీకటిని చీల్చుకుంటూ సూర్యభగవానుని శ్వేతాశ్వం ప్రేవేశించినట్టు రాజముద్ర కలిగిన ఒక అధికారిక గుర్రం ప్రజల మధ్యలోంచి వేగంగా దూసుకుంటూ నిగమాధ్యక్షుని రధం ప్రక్క నుండి మెరుపు వేగంతో వెళ్ళిపోయింది. నిగమాధ్యక్షుడికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. పరీచుని అనుచరులు బిక్కు బిక్కుమంటూ అలాగే కదలకుండా ఉండిపోయారు. ఆ ప్రదేశం మళ్ళీ నిర్మానుషంగా మారిపోయింది. 

Self Confidens and the Success
Protecting from attacks

అక్కడకి ఇంకొన్ని క్షణాల్లో గుర్రాలపై ఒక యోధుడ్ని అనుసరిస్తూ ముందుకు వేగంగా వస్తున్న ఒక సమూహాన్ని పరీచుడు అతని పరివారం గమనించారు. విజయుడు బుజ్జప్ప వైపు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అన్నట్టు చూసాడు. బుజ్జప్ప ఏమీ తెలియనట్టు తలని ఊపాడు. జన సమూహాన్ని శ్వేతాశ్వం చీల్చుకుంటూ వెళ్ళిన మార్గంలో గుర్రాలన్నీ మెరుపు వేగంతో ఆ ప్రాంగణంలోనికి ప్రవేశించాయి. పరీచుని అనుచరులు కత్తులను కిందపడేసి తలలు దించుకుని మోకాలిపై వరుసగా కూర్చుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ ఆ యోధుడు పరీచుని వద్దకు క్షణాల్లో వచ్చాడు.

ఆ వ్యక్తిని చూడగానే బుజ్జప్ప మెడ మీద కత్తి ఉంచిన పరీచుడు గడగడ వణికిపోతూ కత్తి కింద పడేసి మోకాళ్ళపై కూర్చున్నాడు. వెంటనే రధం మీద నిల్చున్న నిగమాధ్యక్షుడు పరుగు పరుగున వచ్చి “అఖండ శాతవాహన సామ్రాజ్య మహా సేనాని శ్రీ శ్రీ శ్రీ దండనాయక మీకు నా శిరస్సు వంచి ప్రణామము చేస్తున్నాను” అని కింద వెల్లకిలా పడ్డాడు. 

దండనాయకుడు చుట్టూ పరిశీలించి “నిగమకా, నీవు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. మరోమారు ఇటువంటి ఏదైనా దుశ్చర్యకు పాల్పడినట్టు మాకు తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకో” అని హెచ్చరించాడు. నిగమాధ్యక్షుడు “నన్ను క్షమించండి మహాసేనా” అని ప్రాధేయపడ్డాడు. 

దండనాయకుడు విజయుడి వద్దకు వెళ్లి “ విజయుడా, మిమ్మల్ని సాదరంగా తీసుకురమ్మని రాజ గురువు బృహధృదుని ఆజ్ఞ. ఆజ్ఞను మన్నించి తక్షణమే రాజధానికి చేరుకొండి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈ నిగమాధ్యక్షుడు చేస్తాడు అని చెప్పి అతని వైపు చూసాడు. వెంటనే “చిత్తం మహాసేనా” అని అతను సమాధానం చెప్పాడు. 

విజయుడ్ని ఎందుకు రక్షించారు? (జరిగిన కథ)

అంధ్ర దేశంలో డుంభాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను దండకారణ్యంలో యథేచ్ఛగా సంచరిస్తూ అరణ్యం గుండా రాకపోకలను సాగించే బాటసారులను హింసించి పబ్బం గడుపుకునేవాడు. ప్రజలు ఆ రాక్షసుని అరాచకాలను సహించలేక తమ రాజ్యానికి రాజైన నరసింహపాలుని వద్ద అడపా దడపా తమ గోడును విలపించేవారు. రాక్షసుని శక్తి యుక్తులని అంచనా వేయలేని నరసింహపాలుడు రాక్షసునితో పోరాటానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. చివరికి ఏమీ చేయలేని స్థితిలో ప్రజల సంరక్షణార్ధం నరసింహపాలుడు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. రాక్షసుడిని అంతమొందించిన వారికి తన రాజ్యంలో అర్ధభాగం ఇవ్వడం అందులోని సారాంశం. రాజు ప్రకటన తెలుసుకుని తమ రాజ్యంతో పాటు పొరుగు రాజ్యాల నుండి కూడా ఎంతో మంది వీరులు డుంభాసురుడును అంతమొందించు దిశగా ప్రయత్నించి విఫలమయ్యారు.

Self Confidens and the Success
Defeat of warriors at the hands of the monster

మితి మీరుతున్న రాక్షసుని అరాచకాలను నివారించలేనందున నరసింహపాలుని అంతరాత్మ అతన్ని దహించివేసింది. విజయమో, వీర స్వర్గమో ఏదైనా సరే పాలకునిగా తన ధర్మమని భావించిన నరసింహపాలుడు తానే స్వయంగా రాక్షసునితో పోరాటానికి సిద్ధమయ్యాడు. మరుసటి రోజు నిండు రాజసభలో సభాముఖంగా నరసింహపాలుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాజ గురువులైన బృహధృదుడు రాజ నిర్ణయాన్ని ఖండిస్తూ ఈ విధంగా పలికాడు.

“మహారాజా! ఇది రాజ్యానికి కలిగిన ఒక విపత్తు, ‘విపత్తులు యాదృచ్చికమైనవి. ఎంతటి వీరుడైననూ, పరాక్రమ వంతుడైననూ పరిస్థితులకు కొన్ని సంధర్భాలలో తలొగ్గక తప్పదు’. ప్రకృతి వైపరీత్యాలను మనిషి ఎలాగైతే ఎదుర్కోలేని స్థితిలో ఉంటాడో ప్రస్తుతం రాజ్యానికి ఏర్పడిన ఈ సంక్షోభం అటువంటి సంకట స్థితినే ప్రతిబింభిస్తోంది. ఎందరో శత్రువులను చీల్చి చండాడిన మీ పరాక్రమాన్ని ఈ రాజ్య ప్రజలు ఎన్నడూ చులకన చేయరు. కనుక రాజ గురువు ఆజ్ఞగా ప్రస్తుతం మీరు మీ ప్రయత్నాన్ని విరమించుకోవాలి” అని బృహధృదుడు హితవు పలికాడు. అమితమైన గురు భక్తి కలిగిన నరసింహపాలుడు తన గురువు బృహధృదుని మాట కాదనలేక అయిష్టంగానే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 

మహారాజు తన నిస్సహాయ స్థితికి చింతిస్తూ రాజధాని ప్రాంతానికి సదూరంలో ఉన్న ఏనుగుల వనానికి రహస్యంగా స్వల్ప పరివారంతో మారు వేషంలో వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడు. ఎందరో వీరాధి వీరులకు ప్రసిద్ది చెందిన ఈ రాజ్యంలో ఒక సాధారణ రాక్షసుడి బారి నుండి ప్రజలను కాపాడే యోధులు ఎవరూ లేనందుకు రాజు మనసు ఎంతగానో కుంగిపోతోంది. 

ఉద్యాన వనానికి ఎడమ వైపున మహారాజు ఉనికిని గ్రహించకుండా తోటమాలి రామయ్య సాధారణంగా తన పనిని తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఒక యువకుడు చేతిలో ఒక పొడవైన త్రాడు పట్టుకుని రామయ్య వైపుకి నడుచుకుంటూ దర్జాగా వెళ్ళడం మహారాజు గమనించాడు. “ఇక్కడ ఇంతమంది పరివారం ఉండగా ఓ అపరిచితుడు లోపలకి ఎలా ప్రవేశించాడు” అని మహారాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చేతిలో త్రాడుతో ఆ వ్యక్తి ఎదో పథకరచన చేస్తున్నట్టు చుట్టూ చూస్తున్నాడు.

మహారాజు వెంటనే తన చుట్టూ పరిశీలించి అక్కడ సమీపంలోని ఒక సేవకుడికి సైగ చేసాడు. వెంటనే ఇద్దరు భటులు అక్కడకి పరిగెత్తికుని వచ్చారు. “మీరంతా ఉండగా ఆ అపరిచిత వ్యక్తి లోపలకి ఎలా ప్రవేశించాడు. అతడ్ని చూస్తే పొరుగు రాజ్యపు యోధుడిలా ఉన్నాడు. బహుశా ఒక సాధారణ వ్యక్తిగా మారువేషంలో ఈ కోటలోకి చొరబడి ఇక్కడ ఎదో అఘాయిత్యం చేయడానికి వచ్చినట్లు నా సందేహం” అని అన్నాడు.

వారిలో ఒక సేవకుడు స్పందించి సమాధానంగా “మహారాజా, క్షమించండి. అతను ఇక్కడ తోటమాలిగా పనిచేసే రామయ్య కుమారుడు. అతని పేరు విజయుడు. మన గజ శాలలో ఒక ఏనుగు గత నాలుగు రోజులుగా మదమెక్కి పరివారాన్ని హడలెత్తిస్తోంది. మేము ఏనుగుని నిలువరించే ప్రయత్నంలో ఉండగా నిన్న విజయుడికి అలాగే రామయ్యకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అందుకని విజయుడు రామయ్య చెప్పినా వినకుండా ఈరోజు ఆ ఏనుగుని లొంగ దీసేందుకు మళ్ళీ వచ్చాడు. అయితే మహారాజా! ఇందాక విజయుడు మరోసారి ఆ ఏనుగు చేత భంగపాటుకి గురి అయ్యాడు” అని వారిలో వారు ఒకర్ని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.

జరిగిన విషయం విన్న మహారాజు చిన్నగా నవ్వి “సరే ఇక మీరు వెళ్ళండి” అని వాళ్ళని హుందాగా ఆజ్ఞాపించాడు. భటులు ఇద్దరూ మహారాజుకు శిరస్సు వంచి ప్రణామం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మహారాజు మళ్ళీ చింతన లోనికి జారుకున్నాడు. 

విజయుడ్ని గమనించిన రామయ్య ఆందోళనగా అతని కుమారుడిని వారిస్తూ “ కుమారా, నిన్నటి రోజున ఇదే సమయానికి నీవు ఆ మద ఏనుగు చేత ఊహించని విధంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డావు. ఈ రోజున వృధా ప్రయాసగా లొంగదీసేందుకు ప్రయత్నించి విఫలమైనావు, ఇప్పుడు ఇంకోసారి సిద్ధపడుతున్నావు.

ఎదుటి వారి శక్తి యుక్తులు తెలియకుండా వారితో ద్వంద్వ పోరుకు సిద్ధం కావడం అజ్ఞానం, సాధ్యాసాధ్యాలు చూడకుండా ప్రత్యర్ధి శక్తి యుక్తులు తెలిసి కూడా వారితో పోరుకు సిద్ధపడటం అవివేకం’.

మునుపటి నిర్ణయం అజ్ఞానంతో తీసుకున్న నిర్ణయంగా ప్రస్తుతం అవివేకంతో తీసుకున్న నిర్ణయంగా నాకు గోచరిస్తోంది” అన్నాడు. అప్పుడు విజయుడు అతని తండ్రికి సమాధానంగా ఇలా అన్నాడు.

“తండ్రిగారు, నిన్నటి వరకు ఇది నాకు ఒక విపత్తు, ఎందుకంటే అది యాధృచ్చికమైనది.

‘మనం ఉహించని పరిమాణంలో అకస్మాత్తుగా ఎదుర్కునే నష్టం విపత్తు, రాబోయే నష్టం యొక్క పరిణామం ముందే గ్రహించిననాడు అది సమస్య’.

కాబట్టి తండ్రిగారు, దీనిని కేవలం ఒక సమస్యగా మనం పరిగణించాలి. ప్రమాదం విపత్తుగా ప్రారంభమయ్యి నేడు సమస్యగా పరిణామం చెందింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఒక ప్రమాదం మానవ మాత్రులకు పరిష్కార సాధ్యమయ్యే సమస్యగా మార్పు చెందింది. ఇకపై దీనిని ఎదుర్కోవడం, ఎదుర్కోలేకపోవడం ఆయా వ్యక్తుల సమర్ధత మీద ఆధారపడి ఉంటుంది, ఇప్పుడు పూర్తి స్పృహతో నేను నా సమర్ధతని పరీక్షించదలిచాను” అని విజయుడు తన తండ్రికి సమాధానం చెప్పాడు. 

రామయ్య తన కుమారుని యొక్క జ్ఞాన పరిణితికి మిక్కిలి సంతోషించి “విజయ కుమారా, నీ సమాధానం నా ఆందోళనలను అన్నింటినీ పూర్తిగా శాంతపరిచింది. కనుక నీవు నీకు తోచిన విధంగా కొనసాగవచ్చు” అన్నాడు. విజయుడు మిక్కిలి విధేయతతో తన తండ్రి కాళ్ళకు నమస్కరించి కార్య సిద్దుడై ధైర్యంగా గజ ప్రాంగణం లోనికి వెళ్ళాడు.

Self Confidens and the Success
Entering into elephant enclosure

రాజ గురువు బృహధృదుని కొలువు

బృహధృదుడు రాజకార్యాలను ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అంతలో దండనాయక అనే మహా సేనాని పరిగెత్తుకుని అతని వద్దకు వచ్చి “రాజ గురువులకు ప్రణామాలు, తమరిని కలుసుకునేందుకు మహారాజా వారు స్వయంగా వీచ్చేస్తున్నారు” అని చెప్పి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

మహారాజు నరసింహపాలుడు బృహధృదున్ని వినయంతో నమస్కరించి ఇలా అన్నాడు. “గురుదేవా! విపత్తులు యాధృచ్చికమైనవని, ఎంతటి వారైనా పరిస్థితులకు కొన్ని సంధర్భాలలో తలొగ్గక తప్పదని మీరు చెప్పారు. కానీ ఈరోజున మన ఏనుగుల వనంలో ఒక వీరుడు విపత్తులకు సైతం ఒక సరికొత్త నిర్వచనం ఇవ్వడం నేను చూసాను. అతను బుద్ధిశాలి, అలాగే బలవంతుడు. మొదటిగా అతను తన అంగ బలంతో ఒక మదమెక్కిన ఏనుగుని నిలువరించదలచి విఫలమైనాడు. వెంటనే అతను బుద్ధి బలముతో విపత్తును ఒక సాధారణ సమస్యగా మలుచుకుని ప్రయత్నం చేసి విజయం సాధించాడు. డుంభాసురుడు మనకు యాధృచ్చికంగా కలిగిన ఒక విపత్తు అయినప్పటికీ ప్రస్తుతం అతని ద్వారా మనకి సంభవిస్తున్న నష్టం యాధృచ్ఛికమైనది కాదు కాబట్టి అతడు ప్రస్తుతం మనకి ఒక సాధారణ సమస్య మాత్రమే. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకు ఆ యువకుడు పరిష్కారం చూపించగలడని మా విశ్వాసం” అన్నాడు.

(ప్రస్తుతం)

పరీచుడు తన పరివారంతో కలసి లాంఛనంగా విజయుడు మరియు అతని స్నేహితుడు బుజ్జప్పని అయిష్టంగానే రాజధానికి తీసుకొచ్చాడు. బృహధృదుడుని కలుసుకునేందుకు విజయుడితో పాటుగా బుజ్జప్పా మరియు పరీచుడు మొదలైన వారికి అన్ని ఏర్పాట్లను మహామాత్యులు పూర్తి చేశారు. విజయుడు ఆకాశాన్ని తాకే రాజ సౌధాలను చూసి ఆశ్చర్యపోతూ లోపలకి వెళ్ళాడు.

రాజ గురువు బృదధృదుడి కొలువు ఎంతో ప్రశాంతంగా, విశాలంగా ఉంది. కోట గోడలకు అణువణువునా అద్భుతమైన భారతీయ కళా సంపద. అన్నిటినీ దాటుకుని ఒక విశాలమైన ప్రాంగణం లోనికి ముగ్గురూ చేరుకున్నారు. 

బృహధృదుడిని చూడగానే విజయుడి మనసులో అచంచలమైన వినయ పూర్వక భక్తి భావన కలిగింది. విజయుడు వెంటనే అతని కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. బృహధృదుడు విజయుడిని పైకి లేపి, “చూడు నాయనా, ఈ రాజ్యంలో ఎందరో వీరులు ప్రయత్నించి విఫలమైన ఒక మహత్తర కార్యాన్ని సాధించడానికి మహారాజా వారు స్వయంగా నిన్ను ఎన్నుకున్నారు. అది కష్టతరమైన కార్యము అయినప్పటికీ ప్రభువల అభీష్టము మేరకు కాదనకుండా నెరవేర్చగలవు అని ఆశిస్తున్నాను” అన్నాడు. 

మహారాజా వారు తన మీద ఉంచిన విశ్వాసానికి విజయుడు ఎంతో ఆనందించాడు. మరో మాట లేకుండా “మహానుభావా, నాబోటి అల్పునకు ఇంతటి మహత్కర భాగ్యాన్ని ప్రసాదిస్తుంటే కాదనకుండా ఎలా ఉండగలను. ఈ దేశం, ఈ ప్రజల శ్రేయస్సు కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. దయచేసి నా కర్తవ్యాన్ని నాకు సెలవీయండి గురుదేవా” అని అతను వినయంగా అడిగాడు. 

బృహధృదుడు విజయుని యొక్క రాజ భక్తికి ఎంతో సంతోషించి సుభిక్షమైన తమ రాజ్యానికి డుంభాసురుడు అనే రాక్షసుడి వలన కలుగుతున్న అనర్ధాలను వివరించి చెప్పాడు. విజయుడు శ్రద్దగా విని “గురువర్యా, ఇంతటి ప్రతిష్టాత్మకమైన పనిలో మహారాజా వారు స్వయంగా నన్ను నియమించాలని కోరుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు మీ తక్షణ ఆజ్ఞ కోసం వేచియున్నాను. 

“ఎంతటి వీరుడైననూ అనుభవశాలి ముందు, ఎంతటి బలవంతుడైననూ బుద్ధిశాలి ముందు, ఎంతటి యోధుడైననూ ధైర్యశాలి ముందు తలవంచక తప్పదు” 

గురువర్యా, మీ అనుభవం, జ్ఞానం, ధైర్యం నాలోని పూర్వ లక్షణాలను ధృడపరుస్తాయి. కనుక ఈ ప్రయత్నంలో మీ ఆశీస్సులు నాకు ఎంతో అవసరం. దయచేసి ఆ రాక్షసుడి చర నుండి రాజ్యాన్ని రక్షించుకునే ఉపాయాలను నాకు సూచించండి” అని విజయుడు వినయంగా అడిగాడు.

ఆత్మ విశ్వాసం మనిషికి ఆభరణం. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు. అలాగే కేవలం ఆత్మ విశ్వాసంతో ప్రయత్నించి విఫలమైన యోధుల చరిత్రలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.”

మహాజ్ఞాని అయిన బృహధృదుడు విజయుడి యొక్క ఆత్మ విశ్వాసంతో పాటు ఆచరణకు కావాల్సిన జ్ఞానసముపార్జన సాధనలో అతనికి ఉన్న ఆశక్తిని గ్రహించాడు. 

“విజయ కుమారా, గతంలో ఈ ప్రయత్నం చేసిన వీరులు, యోధులు, ఎవ్వరూ ఇటువంటి సమమైన ఆలోచన చేయలేదు. వారిలో అకుంఠిత ఆత్మ విశ్వాసాన్ని నేను చూసాను. కానీ వారి అపరిమిత ఆత్మ విశ్వాసం మూలంగానే వారి పరాభవం సంభవించడం నా అనుభవంలో నేను గ్రహించాను. ఇటువంటి ఎన్నో అనుభవాల జ్ఞానాన్ని అందులోని సారాన్ని అందిస్తాను. తద్వారా ఒక విపత్తును స్వల్పమైన సాధారణ ప్రయత్నాలతో ఆచరణకు సాధ్యమయ్యే సమస్యగా మార్చవచ్చును, అటువంటి మార్గాలను నేను నీకు సుగమనం చేస్తాను. అటుపైన నీకు ఎంతో సమయం మిగులుతుంది” అని బృహధృదుడు కొన్ని మార్గాలను తెలియజేసాడు.

Self Confidence and the Success

Self Confidens and the Success
Self-confidence alone is not enough to achieve success

ఆ విధంగా విజయుడు రాజ గురువు ఆశీస్సులను తీసుకుని రాక్షసున్ని హతమార్చడానికి బయలుదేరాడు. అయితే ఈ ప్రయత్నంలో అతనికి సహాయంగా తన స్నేహితుడితో పాటు పరీచుడిని కూడా పంపించమని కోరతాడు. బృహధృదుని ఆజ్ఞ మేరకు పరీచుడు కాదనలేక విజయుని వెంట వెళ్ళాల్సి వస్తుంది. ఎందరో యోధులకు అసాధ్యమైన ఈ కార్యాన్ని విజయుడు స్వల్పమైన శ్రమతో, తక్కువ సమయంలో, తక్కువ సహాయంతో సాధించగలిగి శాతవాహన సామ్రాజ్య కీర్తిని నలుమూలలా వ్యాపింపజేశాడు.

“మీ మీద మీకు ఆత్మవిశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్) ఏస్థాయిలో ఉన్నప్పటికే, వినయంతో పొందే ఇతరుల యొక్క అనుభవ జ్ఞానం మీ ప్రయత్నాన్ని సులభతరం చేస్తుంది”

తెలుగు సంహిత

                                                                 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!