భవిష్యవాణి


Short Motivational Story in Telugu

నాలుగేళ్ళ క్రితం శంకరయ్యకు ఒక చిన్న ప్రమాదం జరిగింది. శంకరయ్య ఎంతో అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ ఆ ప్రమాదం జరగడం అతనిని ఎంతో ఆశ్చర్యపరిచింది. చుట్టు ప్రక్కల వాళ్ళు శంకరయ్యకు రోజులు బాగోలేవని, కాస్త జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చారు. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ శంకరయ్య బ్రతుకు జీవుడా అని ఇంటికి చేరుకున్నాడు. 

మరుసటి రోజు నుండి శంకరయ్యకు తన వృత్తి వ్యాపారాలలో అడపా దడపా నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. అతని రోజువారీ కార్యకలాపాలు ఎందులోనూ కలసిరాలేదు. ఫలితంగా దేనిపైనా మనసు నిలపలేకపోయాడు. వరుసగా నష్టాలు వస్తూ ఉండటంతో అతను మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ఏకదాటిగా విధి అతని మీద ప్రతికూలమైన దాడి చేస్తున్నట్టు అర్ధమైయింది. ఆ విధంగా అష్ట కష్టాల మీద రెండేళ్ళ సమయం గడిచింది. ఏమీ తోచక శంకరయ్య ఒకరోజు తన స్నేహితుడు అయిన వెంకన్న వద్దకు వెళ్లి తన గోడుని విలపించాడు. 

పీకలలోతు కష్టాల్లో ఉన్న శంకరయ్యను చూసి వెంకన్న చలించిపోయాడు. వెంటనే అతడి కష్టాలను గట్టెక్కించే మార్గాన్ని శంకరయ్యకు తెలియజేసాడు. వెంకన్నకు గతంలో ఎదురైన కఠిన సమస్యలు ఏ విధంగా పరిష్కరింపబడ్డాయో తెలుసుకుని శంకరయ్య కూడా అదే మార్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తలచాడు. వెంకన్నను వెంటబెట్టుకుని శంకరయ్య అక్కడకు నలభై మైళ్ళ దూరంలో ఉన్న ఒక గడ్డం బాబా దగ్గరకి వెళ్లారు. 

గడ్డం బాబా ఆ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన తాంత్రికుడు. అతడిని కలుసుకోవడానికి జనం తండోప తండాలుగా తరలి వస్తారు. ఆరోజు కూడా దాదాపు ఐదు గంటల నిరీక్షణ అనంతరం గడ్డం బాబాను కలుసుకునే అవకాశం శంకరయ్య మరియు వెంకన్నలకు లభించింది. 

లోపలికి వెళ్ళగానే వెంకన్నను గుర్తించిన గడ్డం బాబా అతని యోగక్షేమాలను అడుగుతూ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అతనిని గుర్తుపెట్టుకుని పలకరించిన గడ్డం బాబా పట్ల వెంకన్నకు మరింత భక్తిభావన పెరిగింది. వెంకన్న వెంటనే తన మిత్రుడు శంకరయ్యని పరిచయం చేసాడు. గడ్డం బాబా శంకరయ్యని చూడగానే గడిచిన కొన్ని ఏళ్లుగా అతనిని వెంటాడుతున్న దురదృష్టాన్ని గురించి అలవోకగా చెప్పేసాడు. 

వెంకన్న ఆశ్చర్యపడుతూ గడ్డం బాబాకి నమస్కరించాడు. మొహం చూడగానే జాతకం చెప్పేయగల గడ్డం బాబా లాంటి మహా తాంత్రికుని వద్దకు తీసుకొచ్చిన వెంకన్న పట్ల శంకరయ్య మరింత కృతజ్ఞతగా చూసాడు. గడ్డం బాబా శంకరయ్య సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ఉపాయాలను, పూజలను సూచించాడు. అందుకోసం కొంత మొత్తంలో సొమ్ముని శంకరయ్య నుండి వసూలు చేసాడు. 

మరుసటి రోజు నుండి శంకరయ్య చేసిన ప్రతీపనిలో లాభసాటి సూచనలు కనిపించసాగాయి. తన రోజువారీ వృత్తి కార్యకలాపాల ప్రారంభానికి గడ్డం బాబాను దైవంగా భావించి పూజించసాగాడు. అప్పటి నుండి శంకరయ్య జీవితంలో దురదృష్టం అనే పదానికి తావు లేకుండా పోయింది. అతను పట్టిందల్లా బంగారం అన్న చందాన అతని జీవితం మలుపు తిరిగింది. 

రెండేళ్ళ క్రితం శంకరయ్యకు జరిగిన ఒక చిన్న ప్రమాదం గురించి అతని అంతరాత్మలో నాటుకుపోయిన ఆలోచనలు అతనిని మరింత పతనం వైపుకి నడిపించాయి. మనసులోని ప్రతికూల ఆలోచనలు, చేసే పనిపట్ల అశ్రద్దను కలిగించి పనిలో నిబద్దతను సడలిస్తాయి. అందువలన శంకరయ్య ఒక వైఫల్యంతో మరొక వైఫల్యానికి వంతెనలు నిర్మిస్తూ దురదృష్టం అనే ధృడమైన భావజాలం వైపుకి ప్రయాణించాడు. చివరికి తీవ్రమైన మానసిక క్షోభతో ఎవరో ఒకరు ఎదో ఒక మాయాజాలం చేసి పరిష్కారం చూపిస్తే తప్ప అతను బయటపడే సూచనలు లేవని ఒక నిర్ధారణకు వచ్చాడు. 

శంకరయ్యకు జరిగిన ప్రమాదం, తృటిలో ఆ ప్రమాదం నుండి అతను బయటపడిన సంఘటన, దానికి శంకరయ్య ప్రతిస్పందించిన తీరు ఒక విధంగా అతడి జీవితాన్ని అతలాకుతలం చేసిందని చెప్పాలి. నిజానికి అటువంటి ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న శంకరయ్యకంటే అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉంటాడా’ అనే ఆలోచన అతడు చేసి ఉంటే గడిచిన రెండేళ్ళ పాటు ఎదుర్కున్న ఇబ్బందులు ఏవీ అతడికి ఉండేవి కాదేమో!

తీవ్రమైన మానసిక బలహీనతతో ఉన్న శంకరయ్య అతడిని అనుకూలతల వైపు నడిపించే ఎదో ఒక బలమైన శక్తి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. సరిగ్గా అటువంటి సమయంలో వెంకన్న ద్వారా గడ్డం బాబాను కలుసుకున్నాడు. అతడు శంకరయ్యని చూడగానే అతడి కష్టాలను చెప్పగలగడంతో శంకరయ్యకు అతడి మీద సంపూర్ణ విశ్వాసం కలిగింది. గడ్డం బాబా సమక్షంలో చేయవలసిన పూజా కార్యక్రమాలను ఆచరించిన తర్వాత రెండేళ్లుగా అతడిని పీడిస్తోన్న దురదృష్టం అనే రాక్షసి భావజాలం అతడిని వీడిపోయిందన్న సంతృప్తి అతనిలో కలిగింది. ఫలితంగా నూతనోత్సాహంతో శంకరయ్య తన వృత్తిపరమైన కార్యకలాపాలపై మనసుని పూర్తిగా కేంద్రీకరించగలిగాడు. తద్వారా సానుకూల ఫలితాలను పొందగలిగాడు.

సాధారణంగా వైద్యుని వద్దకు వెళ్ళిన రోగిని చూసి వైద్యుడు నీ శరీరంలో రుగ్మత ఏమిటి అని ప్రశ్నించడానికి అతడికి ఎటువంటి అద్భుత శక్తులు అవసరంలేదు. అలాగే ఏదైనా కష్టం లేదా సమస్య లేకుండా అటువంటి బాబాలు వద్దకు ఎవ్వరూ వెళ్లరు. ఇదే విషయాన్ని వంటబట్టించుకున్న గడ్డం బాబా శంకరయ్య మొహంలోని నిరాశ, నిశ్ప్రుహలను చూడగానే అతడికి గత కొన్నేళ్ళుగా దురదృష్టం అనే రాక్షసి వెంటాడుతూ ఉందని, అతడు బంగారం పట్టుకున్నా బొగ్గుగా మారిపోతుందని సెలవిచ్చాడు. 

పదేళ్ళ క్రితం గడ్డం బాబా అందరిలాగానే సాధారణమైన జీవితాన్ని గడిపేవాడు. అతనిలోని కొన్ని మానసిక రుగ్మతల కారణంగా సమాజం నుండి కొంత ఎడబాటుకి గురి అయ్యాడు. ఫలితంగా అతడిని సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అన్న ఆలోచనలు అతడిని నిరంతరం క్రుంగదీస్తూ ఉండేవి. కొన్నాళ్ళకు అతడు సమాజంలోని ఇతరులకంటే ప్రత్యేకమైన వాడిని అని, సమాజం అతడి సామర్ధ్యాలను గుర్తించగలిగే పరిణితి స్థితిలో లేదని ఒక కొత్త ఆలోచనకు అతడి మెదడులో బీజం పడింది. 

తర్వాత తన తోటి వారు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నప్పుడు కళ్ళు మూసుకుని వారు గతంలో చేసిన ఏదైనా సాధారణ పొరపాటు లేదా గ్రహాల ప్రతికూలత గురించి ప్రస్తావించేవాడు. తర్వాత పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉండేవాడు. కొంతమంది సమస్యలు నుండి గట్టెక్కిన తర్వాత తిరిగి అతడి వద్దకు వచ్చి అతడిని అద్భుతమైన శక్తులు కలవాడిగా, మార్మికుడిగా, గొప్ప తాంత్రికుడిగా పొగడ్తలను గుప్పించేవారు. 

కాలక్రమేనా గడ్డం బాబాలో అతడికే తెలియని మరొక స్వభావం అతడిని ఆవరించింది. అతడు కళ్ళు మూసుకుని తలచుకుంటే ఎటువంటి వారి కష్టాలు అయినా తీర్చేయగలను అనే ఒక బలహీనమైన మానసిక స్థితి అతడిని లోబర్చుకోవడం ప్రారంభించింది. నిజానికి అతడికి జనాలను మోసం చేయాలన్న ఉద్దేశ్యం ఏమాత్రం లేదు. జనానికి కూడా మోసపోవాలనే ఉదేశ్యమూ లేదు. కానీ ఇక్కడ ఆ రెండూ యథేచ్ఛగా జరుగుతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి అనే సామెత ప్రకారం మానసిక రుగ్మతలని మానసిక రోగితోనే నయం చేసుకోవాలి అనడం బహుశా ఇక్కడ సరిగ్గా సరిపోలుతుందేమో!

ఎటువంటి తాంత్రిక శక్తులు, మార్మిక శక్తులు లేకుండా గడ్డం బాబా అంత మంది ప్రజల కష్టాలకు పరిష్కారాలను చూపించడం, అంత మంది ప్రజల మన్నన పొందగలడం సాధ్యమేనా? వాస్తవానికి ప్రస్తుత ప్రపంచంలో ప్రజాదరణ కలిగిన తొంభై శాతం వ్యక్తులు ఈ కోవకు చెందినవారే. మనుషులలోని బలహీనతలే వారికి బలం అని ఇక్కడ ప్రస్తావించలేము. ప్రజల అజ్ఞానమే వారికి ఆశ్రయాన్ని కల్పిస్తోంది అనడం సబబుగా ఉంటుంది. 

గడ్డం బాబా ఉదాహరణకు మొదట్లో ఒక వంద మంది వ్యక్తుల జీవితాలపై తన భవిష్యవాణి వినిపించడం జరిగి ఉంటుంది అనుకుందాం. అందులో తొంభై ఎనిమిది మంది జీవితాలలో అది ఊహగా మిగిలిపోయి కేవలం ఇద్దరు వ్యక్తుల జీవితంలో అతను చెప్పింది చెప్పినట్టుగా జరిగి ఉంటుంది. అంటే అతని భవిష్యవాణి ఖచ్చితత్వం కేవలం రెండు శాతం మాత్రమే. 

యాదృచ్చికంగా జరిగిన ఆ రెండు శాతం ఖచ్చిత్వం మిగిలిన తొంభై ఎనిమిది శాతాన్ని ప్రభావితం చేసే సామర్ధ్యాన్ని సంతరించుకుంటుంది. ఆ ఇద్దరు మరో రెండు వందల మందిని గడ్డం బాబాపై విశ్వాసాన్ని కలిగించే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. గడ్డం బాబా కూడా తన తొంబై ఎనిమిది శాతం వైఫల్యాన్ని గుర్తించలేని స్థితిలోకి జారుకుంటాడు. తర్వాత వచ్చిన రెండు వందల మందిపై కూడా యథావిధిగా తన భవిష్యవాణిని ప్రయోగిస్తాడు. తర్వాత అతని విశ్వాసపాత్రుల సంఖ్య గొలుసు వలె పెనవేసుకుంటూ ప్రస్తుత భారీ సంఖ్యకు చేరుకుంటుంది.

మన చుట్టు ప్రక్కల సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు లేదా ఆచూకీ లేనప్పుడు వారి కుటుంబ సభ్యులు సాధారణంగా గడ్డం బాబా వంటివారిని సంప్రదించడం మనం తరుచుగా చూస్తూ ఉంటాం. వారు కళ్ళు మూసుకుని, దక్షణం వైపున ఉన్నాడు లేదా ఉత్తరం వైపున ఉన్నాడు. సరిగా ఫలానా తేదీలోపు ఇంటికి చేరుకుంటాడు అని జోస్యం చెబుతారు. అయితే ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు తమ ప్రయత్నంగా కూడా ఆ దిశలో ప్రయాణించి చేయని ప్రయత్నం ఉండదు. కాళ్ళు అరిగేల తిరిగి తిరిగి ఇంటిముఖం పడతారు. ఒకవేళ ఆ వ్యక్తి యాదృచ్చికంగా ఆ తేదీలోపు ఇంటికి చేరుకున్నట్లు అయితే ఆ బాబాకి ఆ కుటుంబం జీవితాంతం పట్టం కడతారు. (తప్పిన వ్యక్తి తీవ్రమైన కాంక్షతో ఇల్లు వదిలితే తప్ప సాధారణంగా అటువంటివారు తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు)

మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు అతను ప్రతిఘటించే తీరు తదుపరి ఫలితాలను నిర్దేశిస్తుంది. మానసిక బలహీనతలు మీతో పాటుగా సమాజం మొత్తాన్ని బలహీనపరుస్తాయి.

మిమ్మల్ని మోసం చేసేవారు ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మోసం చేసేవారిని మీరే స్వయంగా తయారు చేసుకుంటే అదే నిజమైన అజ్ఞానం.

తెలుగు సంహిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!