గుప్త నిధి – గుడ్డి లక్ష్యం:-
Best motivational story in telugu
ఒకానొక పురాతన గ్రామంలో విక్రమార్కుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు. అతను ఒక గుప్త నిధిని చేదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే చాలు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మొదటిగా అతని దగ్గర ఉన్న ఆధారంతో తనకు చేరువలోని ఒక గుహలోకి వెళ్ళాడు. అక్కడ రాతి ఫలకం మీద రాసి ఉన్న సూచనలు చదివాడు. అందులో ఇలా రాసి ఉంది.
“రాజధాని నగరానికి తూర్పు దిశగా సరిగ్గా వేయి మైళ్ళు ప్రయాణించి, దుర్భేధ్యమైన అరణ్యంలో అందమైన లోయల నడుమ ఉన్న ఒక కోయగూడేనికి నాలుగు మైళ్ళ దూరంలో కొండ చరియల మీద నుండి జాలువారుతున్న జలధారను ఆనుకుని ఉన్న ఒక అఖండ పర్వత గుహలో అమోఘమైన ధన రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, కాని దానిని సాధించాలంటే విక్రమనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మాత్రమే సాధ్యం, ఆరోజున మాత్రమే నిధి ద్వారాలు తెరుచుకుంటాయి”
విక్రమార్కుడి ఆనందానికి అంతులేదు. ఎందుకంటే రాతి ఫలకం మీద రాసి ఉన్న సమయం అక్కడకి ఇరవై నాలుగు రోజులలో రానున్నది. విక్రమార్కుడు ఇరవై నాలుగు రోజుల్లో ఆ నిధి ప్రదేశాన్ని కనుగొనాలి. అటువంటి గడియలు అరవై ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. అందువలన విక్రమార్కుడు వెంటనే ఇంటికి బయల్దేరాడు.

అప్పటికే బాగా చీకటి పడింది. ఇంటికి చేరుకోగానే తన భార్యా పిల్లలను కలుసుకుని తను మరో ఇరవై నాలుగు రోజుల్లో అఖండ ధన రాసులతో ఇంటికి తిరిగి వస్తానని అంతవరకు జాగ్రత్తగా ఉండమని చెప్పి అలక్ష్యం చేయకూడదని అక్కడ నుండి బయలుదేరాడు. తన అన్వేషణ ప్రారంభించాలని తలచి రాజధాని వైపు అడుగులను కదిపాడు. విక్రమార్కుడు పట్టువదలకుండా ఎంతో ప్రయాసపడి రాజధాని నగరానికి చేరుకున్నాడు. అప్పటికే పన్నెండు రోజులు గడిచింది. ఇంకా తన లక్ష్యసాధనకు అతనికి మిగిలి ఉన్నకాలం కేవలం పన్నెండు రోజులు మాత్రమే. తనకు ఉన్న సమయంలో అర్ధ భాగం కరిగిపోయింది. విక్రమర్కుడిలో కాస్త అలజడి మొదలైంది. ఎందుకంటే ఇంకా తను ప్రయానించాల్సిన దూరం వెయ్యి మైళ్ళు మిగిలి ఉంది. రాజధాని నగరం నుండి తూర్పు దిక్కుగా ప్రయాణాన్ని ప్రారంభించి తన నడక వేగాన్ని పెంచాడు.

తెలియని గమ్యం మనిషికి మరింత దూరంగా అనిపిస్తుంది. మీరు సాధారణంగా ఏదైనా తెలియని ప్రదేశాన్ని వెతుకుతూ వెళ్ళేటప్పుడు అది మీకు ఎంతో ఎక్కువ సమయం తీసుకున్న భావనను కలిగిస్తుంది, మీరు గమ్యం చేరుకున్నాక తిరుగు ప్రయాణం చాలా సజావుగా, సులువుగా, చాలా తక్కువ సమయంలో యథా స్థానానికి చేరుకున్నట్టు అనుభూతి కలుగుతుంది. మీ ఆలోచనలు సందిగ్దతలో ఉన్నప్పుడు మీ గమ్యం మరింత దూరంగా అనిపిస్తూ ఉంటుంది. మీ లక్ష్య సాధనలో మీకు ఎన్నో రకాల ఆందోళనలు ఉండవచ్చును. సాధకుడు ఎల్లవేళలా వాటిని త్యజించాలి. దృష్టి మీ లక్ష్యం మీద ఉండాలి. విజయాపజయాల ప్రస్తావన ప్రయత్నంలో ఉండకూడదు. అటువంటి ప్రస్తావన మిమ్మల్ని మీ ప్రయత్నం నుండి నిరుత్సాహ పరుస్తుంది.
విక్రమార్కుడు కుడా సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అతని శరీరం అతనికి సహకరించడం లేదు. అదే విధంగా విక్రమార్కుడికి కుడా మార్గ మధ్యంలో తన లక్ష్యం మీద ఆశ పూర్తిగా సన్నగిల్లింది.

సరిగ్గా ఇరవై నాలుగో రోజున విక్రమార్కుడు బ్రతుకు జీవుడా అన్నట్టు వెయ్యి మైళ్ళ సమీప దూరానికి చేరుకున్నాడు. అనుకున్నట్టుగానే రాజధానికి తూర్పున ఒక కోయ గూడెం అతనికి కనిపించింది. గూడెంలో కొందరిని కలసి అతనికి కావాల్సిన ఆనవాళ్ళకోసం అడిగాడు. గూడెం ప్రజలు ఆ ప్రదేశం అక్కడకి నాలుగు మైళ్ళ దూరంలో ఉందని చెప్పి ఏ దిశగా ప్రయాణించాలో అతనికి నిర్దేశించారు. విక్రమార్కుడు నిరాశ కొంత వరకు తగ్గింది. గమ్యానికి చేరువ అవుతున్న ఉత్సాహంతో ఆ దిశగా నడక ప్రారంభించాడు.

ఆరోజే చైత్ర శుద్ధ పాడ్యమి. అరవై ఏళ్ళకు ఒకసారి వచ్చే ఆ గడియలు మరో గంట సమయంలో రానున్నాయి. చీకటి పడింది. విక్రమర్కుడకు ఆ నాలుగు మైళ్ళ ప్రయాణం ఆ అటవీ ప్రాంతంలో ఎంతో కష్టంగా ఉంది. ఆ నిశ్శబ్ద నిశి రాత్రిలో గల గల మని సెలయేరు సవ్వడులు అతనికి వినిపించాయి. ఆ సెలయేరు ఆధారంగా చేసుకుని కాస్త ముందుకు వెళ్తే కొండచరియల నుండి జారువాలుతున్న జలధార వెన్నెలలో ముత్యాల వానలా కురుస్తూ ఉంది. ఆహా! ఇంతకంటే గొప్ప నిధులు ఈ ప్రపంచంలో ఉంటాయా!” అని విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. అంతలో అక్కడకి దగ్గరలో ఏవో ప్రకాశవంతమైన వింత కాంతి పుంజాలు ఆకాశానికి తగులుతున్నట్టుగా అద్భుతమైన వెలుగులు కనుచూపు మేరలో కనిపించాయి. నిధి తలుపులు తెరుచుకుంటున్న సమయం ఆసన్నమైందని విక్రమర్కుడకు అర్ధం అయింది.

అడుగులు మరింత వేగంగా అటువైపుగా వేసాడు. అక్కడికి చేరుకునేందుకు ముఫ్ఫై నిముషాలు పట్టింది. ఆ కాంతులు ఒక గుహ నుండి రావడం గమనించాడు. ఆ గుహలోకి వేగంగా ప్రవేశించాడు. గుహ మొత్తం రంగు రంగుల కాంతులతో నిండి ఉంది. విక్రమార్కుడకు ఆ కాంతి తప్ప అక్కడ ఇంకేమీ కనిపించట్లేదు. ఆ గుహ నుండి ఒక ద్వారం తెరచుకుని ఉంది తరువాత అందులోకి ప్రవేశించాడు. అనుకున్నట్టుగానే అక్కడ అశేషమైన ధనరాశులు ఉన్నాయి. తన వద్దనున్న నాలుగు సంచుల నిండా వాటిని నింపుకోవాలనుకున్నాడు. ఒక సంచి నింపే లోపు ద్వారాలు నెమ్మదిగా మూసుకుంటూ ఉండటం గమనించాడు.

విక్రమార్కుడు వెంటనే ప్రతిఘటించి తీసుకున్న కొంత సంపదతో బయటకి పరుగులంకించాడు. ద్వారాలు మూసుకున్నాయి. కాంతులు సన్నగిల్లాయి అంతా చీకటిగా మారింది. ఒక్క క్షణం ముందుగా వస్తే రెండు సంచులు అయినా తీసుకునేవాడ్ని abdominal exercises – maxlabs.co అని బాధపడ్డాడు. కష్టానికి ఎంతో కొంత ఫలితం అయినా దక్కిందని తనను తాను ఓదార్చుకుని ఆ రాత్రికి అక్కడే సేద తీరి ఉదయం ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. రేపటి ప్రయాణం మళ్ళీ ఎంతో కఠినమైనదని తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయం అయింది. విక్రమార్కుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి తన సంచిని చూసుకున్నాడు. ఆ సంపద తనకు బ్రతకడానికి సరిపోతుందని అనుకుంటూ చుట్టూ చూసాడు. ఆ ప్రదేశం తను ఇదివరకే చూసిన ప్రదేశంలా అనిపించింది. ఎందుకో కంగారు పడ్డాడు. వెంటనే బయటకు వచ్చి చూసాడు. పరుగులంకించి మళ్ళీ గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న రాతి శాసనాన్ని చూసాడు. దాని మీద ఇలా రాసి ఉంది.
“రాజధాని నగరానికి తూర్పు దిశగా సరిగ్గా వేయి మైళ్ళు ప్రయాణించి, దుర్భేధ్యమైన అరణ్యంలో అందమైన లోయల నడుమ కోయగూడేనికి నాలుగు మైళ్ళ దూరంలో కొండ చరియల మీద నుండి జాలువారుతున్న జలధారను ఆనుకుని ఉన్న ఒక అఖండ పర్వత గుహలో అమోఘమైన ధన రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, కాని దానిని సాధించాలంటే విక్రమనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మాత్రమే సాధ్యం, ఆరోజున మాత్రమే నిధి ద్వారాలు తెరుచుకుంటాయి.”

మనిషికి పట్టుదల ఆభరణం లాంటిది. మీ కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. కానీ ఫలితం కూడా మనిషికి నిరాశని మిగిల్చేలా ఉండకూడదు. మీరు సమయానికి ఎంతో విలువని ఇచ్చే వాళ్ళు కావచ్చు. కాని మీ లక్ష్యం సాధనకు పూనుకునే ముందు అందులో పదో వంతు సమయాన్ని దాని ప్రణాళికకు కేటాయిస్తే మీకు ఉన్న సమయ పరిధి రెట్టింపు అవుతుంది, ఫలితాలు సంపూర్ణంగా పొందవచ్చు.
మీరు ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణించాలి అనుకుంటున్నప్పుడు ఆ గమ్యం యొక్క దూరం మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ దూరం తెలియకపోతే మీ లక్ష్యం ముందుగా దూరాన్ని తెలుసుకోవడంగా ఉండాలి. దూరం తెలిసినప్పుడు మాత్రమే మీ లక్ష్యానికి ఒక సమయ పరిమితిని పెట్టుకోగలరు. ఉదాహరణకు మీరు ఉన్న ప్రదేశం నుండి ఒక గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మీకు మీ గమ్యం ఎంత దూరంలో ఉంది అని ప్రశ్నించుకోవాలి. మీకు దూరం తెలియకపోయినా కాలాన్ని వృధా చేయకూడదని భావించి వెంటనే మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించి ముందుకు వెళ్తే, మీకు ఎన్నో రకాల సమస్యలు ఎదురుపడవచ్చు. మీ వద్దనున్న సమయానికి పరిమితులు ఉండవచ్చు. మీరు రెండు రోజుల్లో మీ గమ్యానికి చేరుకోవాల్సి ఉన్నప్పుడు మూడు రోజుల్లో చేరుకుంటే ప్రయోజనం ఏముంటుంది. కాబట్టి మీ లక్ష్యంపై మీకు స్పష్టత అవసరం.

మరో కోణంలో, మీరు మీ గమ్యానికి దూరం తెలుసుకునే ముందు మీ ప్రస్తుత ఉనికి మీద కుడా మీకు స్పష్టత ఉండాలి. మీరు ప్రస్తుత ఉనికి మీద స్పష్టత లేని ప్రయాణం వలన మీరు వెళ్ళాల్సిన ప్రదేశానికి ఎంతో శ్రమించి, తెలియని ఎన్నో మార్గాల్లో ప్రయాణించి అంతా తిరిగి చివరికి మీరు నిలిచిన ప్రదేశానికే చేరుకున్నప్పుడు, అదే మీ గమ్యం అని తెలుసుకున్నప్పుడు మీరు సంతృప్తిగా ఉండగలరా? అలా కూడా మీరు లక్ష్యాన్ని సాధించినట్లే. కాని సమయానికి అంత ప్రాధాన్యతను ఇచ్చే మీకు ఈ విజయం ఏ మేరకు సంతృప్తిని ఇస్తుందని అంటారు.
- ఈ కథలను కూడా చదవండి
- క్రోధం – Best motivatonal story
- ఏది విజయం – Inspiring Stories of Success
- ప్రాణం ఖరీదు – Best Self Motivation Story
Hit the paths to your goal

మీరు ఒక లక్ష్య సాధనకు ఒక్కో సోఫానములో ఒక్కో ఉప లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మీ అంతిమ లక్ష్య సాధనకు ఉన్న మార్గాన్ని ఆచరణ యోగ్యంగా మార్చుకోగలిగినప్పుడు మాత్రమే మీరు దానిని సాధించగలుగుతారు. మీరు మీ గమ్యానికి అత్యల్ప దూరాన్ని తెలుసుకోవాలంటే మీ గమ్యానికి ఉన్న వివిధ మార్గాలను ముందు మీరు తెలుసుకోవాలి. మీ గమ్యానికి మీ ప్రదేశం నుండి ఎన్నో మర్గాలు ఉండవచ్చు. ఇప్పుడు మీరు దూరం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అత్యల్ప దూరాన్ని తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మీ గమ్యానికి ఒక మార్గంలో మీ ఊహకు మించిన దూరం ఉండవచ్చు లేదా దగ్గర ఉండవచ్చు. కనుక ఏ మార్గం మీకు అనుకూలంగా ఉంటుందో ఆ మర్గాలన్నిటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మీ గమ్యం యొక్క మార్గాల మీద ఎరుక లేకుండా ఏదో ఒక మార్గంలో మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మీరు ఆ ప్రయాణానికి పరిహారం అధికంగా చెల్లించాల్సి ఉండవచ్చు లేదా చేరుకునే లక్ష్యం యొక్క దూరం పెరగనూవచ్చు. ఒక లక్ష్యానికి మార్గాలు ఎన్నో ఉండొచ్చు, ఆ మార్గాలలో దేనిని మీరు ఎంచుకోవడం ద్వారా మీ గమ్యానికి మీరు చేరువలో ఉంటారో ముందుగా తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రాలను మీ జీవితంలోని ప్రతీ లక్ష్యానికి ఆపాదిస్తూ బేరీజు వేసుకోండి.