ఏది విజయం

ఒకానొక చిన్న గ్రామంలో ఒక ధనవంతుడు మరియు ఒక పేద రైతు ఉండేవారు. ఆ చిన్న గ్రామం పట్టణాలకి అత్యంత దూరంలో ఉండటం వలన ధనవంతుడు తన కుమారుడిని అదే గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్పించాడు. అదే పాఠశాలలో పేద రైతు కుమారుడు కూడా చదువుతున్నాడు. అలా ధనవంతుని కుమారుడు పేద రైతు కుమారుడు ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.

                little friends
Little friends

ధనవంతుని కుమారుడు తన ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలుతో పాటు అందరికంటే చదువులో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. రైతు కుమారుడు చదువులో అంతగా రానించలేకపోయినా క్రమ శిక్షణలో ముందు ఉండేవాడు. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అందరూ స్కూలు విడిచిపెట్టే సమయం వచ్చింది. 

పాఠశాల చివరి రోజు అందరి పిల్లలూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నేను డాక్టర్ అవుతాను అంటే నేను లాయర్ అవుతాను అంటూ పోటీ పడుతున్నారు. ధనవంతుని కుమారుడ్ని అడిగారు. తను కూడా అందరి లాగానే నేను ఒక పెద్ద బిజినెస్ మాన్ అవుతాను అని చెప్పాడు. అందరూ కలసి రైతు కుమారుని వైపు చూసి నువ్వు ఏమి అవుతావు అని అడిగారు. దానికి ఆ రైతు కుమారుడు చెప్పిన సమాధానం విని అందరూ అతనిని హేళన చేసారు. 

అయితే ఇప్పుడు మనం మాటలతో పోటీ పడి లాభం లేదు. 40 ఏళ్ల తర్వాత అందరం ఒక చోట కలుద్దాం. అప్పుడు ఎవరు అందరికంటే గొప్ప వాళ్ళు అవుతారో వాళ్ళని అందరం కలసి సన్మానం చేద్దాం అన్న ధనవంతుని కుమారుని తీర్మానానికి అందరూ ఆమోదం తెల్పి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.

The students leaving the school
The students leaving the school

తర్వాత కొందరు ఉన్నత చదువుల బాట పట్టి ఊరు విడిచి పట్టణాలకి వెళ్ళిపోయారు. కొందరు పక్క గ్రామాల్లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాల బాట పట్టారు. కాలం “ఝరీ వేగతుల్యం” అన్నారు. నలభై ఏళ్ళు గడిచాయి. అనుకున్నట్టుగానే ధనవంతుని కుమారుడు ఒకరోజు అందరి వివరాలు కష్టపడి సేకరించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ, దేశ విదేశాలలో ఎక్కడెక్కడో ఉన్న బాల్య మిత్రులందరకీ అక్కడికి హాజరవ్వాలని ఆహ్వానాలు పంపాడు. అందరి లాగానే రైతు కుమారుడికి కూడా ఆహ్వానం అందింది.

Friends meet up together
Friends meet up together

అనుకున్నట్టుగానే అందరూ ఆ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నందువలన ఒకరికొకరు ఆళింగనం చేసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. భోజనం అయ్యాక సభ ప్రారంభం అయ్యింది. ఆ గొప్ప వ్యక్తి నేనే అంటే నేనే అనుకుంటూ వేదిక మీదకి వెళ్లి ప్రతి ఒక్కరూ వాళ్ళు సాధించిన విజయాలు, సంపాదించిన ఆస్తులు, హోదాలు గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించారు. చివరిగా రైతు కుమారుని వంతు వచ్చింది. సభకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి అతన్ని వేదిక మీదకి ఆహ్వానించారు. కానీ ఆ రైతు కుమారుడు “ఇంత గొప్ప వాళ్ళ మధ్య నేను ఏమి మాట్లాడతాను, నేను సాధించినది ఏదీ లేదుగా” అనుకుంటూ, సంకోచిస్తూ వేదిక మీదకి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. అంతలో అతని గురించి తెలిసిన మరో ముగ్గురు స్నేహితులు తను అంతగా చెప్పుకోవడానికి ఏమీలేదు, అతన్ని ఇబ్బంది పెట్టొద్దు, అందరూ అయిపోయారు ఇక సన్మానం ఎవరికి చెయ్యాలో నిర్ణయించండి అని అన్నారు.

Speech about the winner
Speech about the winner

ఇక వ్యాఖ్యాత మాట్లాడుతూ “అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత ఏకగ్రీవంగా ఎన్నుకోదగిన ఆ గొప్ప వ్యక్తి ఎవరో అని నేను చెప్పనవసరంలేదు. దేశ విదేశాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా నిలిచి, తన వ్యాపార సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వ్యాపార దిగ్గజం మన స్నేహితుడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వించదగ్గ విషయం” అని వ్యాఖ్యాత ధనవంతుని కుమారుని కోసం చెప్తూ ఉండగా వేదిక అంతా హర్ష ధ్వానాలతో మారుమ్రోగిపోయింది. అప్పుడు వ్యాఖ్యాత అతన్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడాలని కోరగా ధనవంతుని కుమారుడు వేదిక మీదకి వచ్చి ఇలా మాట్లాడటం ప్రారంభించాడు.

Richman speech
Richman speech

“మై డియర్ ప్రెండ్స్.. ఈరోజు కోసం మనం ఒకరికొకరం పోటీ పడుతూ జీవితంలోఎన్నోసమస్యలను దాటుకుంటూ రాత్రి పగలు నిద్రాహారాలు సైతం త్యాగం చేసి సమాజం గర్వించ తగ్గ స్థానంలో మనందరం ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరందరూ నాకీ స్థానం కల్పించి గౌరవాన్ని ఇస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక గంట క్రితం నాకు తెలిసింది. ఈ నలభై సంవత్సరాల కాలంలో నేను గెలుపు అనే ఓటమితో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాను. నిజానికి ఈ సన్మానానికి నేను అర్హుడను కాను. ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను” అనేసరికి అందరిలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఒక గంట ముందు జరిగిన సంభాషణని ఇలా గుర్తు చేసుకున్నాడు.

పూర్వ విద్యార్ధులంతా మాట్లాడుకుంటూ ఆ ప్రాంగణం మొత్తం హడావిడగా ఉంది. అందరూ డిన్నర్‌కు సిద్ధం అవుతున్నారు. అందులో ఒక వ్యక్తి తన బాల్య ఆప్త మిత్రుడ్ని చూసి అతని వేషధారణ బట్టి అతను సాదా సీదా జీవనాన్ని గడుపుతున్నాడని భావించి గర్వంతో కూడుకున్న దయతో అతన్ని పరామర్శించి వేరుగా ఉన్న ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. అందులో ఒక వ్యక్తి ధనవంతుని కుమారుడు. ఇంకో వ్యక్తి రైతు కుమారుడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరిగింది.

Richman with Farmer's Son
Richman with Farmer’s Son

మొదటి వ్యక్తి : నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు చాలా బాధ గానూ ఉంది.

రెండవ వ్యక్తి : బాధ ఎందుకు?

మొదటి వ్యక్తి : నా ఆప్త మిత్రుడువు అయిన నిన్ను కలుసుకున్నందుకు ఎంతో సంతోషమునూ, నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తున్నందుకు మరింత భాధగానూ.

రెండవ వ్యక్తి : నాపై నీకు ఉన్న అభిమానానికి కృతజ్ఞుడను. కానీ నేను ఇప్పుడు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను . నేను ఈ జీవితం పట్ల ఎంతో సంతృప్తితో ఉన్నాను.

మొదటి వ్యక్తి : కానీ అది ఎలా సాధ్యం. నవ్వు నా దగ్గర చెప్పుకోవడానికి సంకోచిస్తున్నావు.

రెండవ వ్యక్తి : సాధ్యమే. (చిరునవ్వు నవ్వి) ఇప్పుడు చెప్పడానికి కూడా నీరసించి ఉన్నాను. బాగా ఆకలేస్తుంది.

మొదటి వ్యక్తి : ఓహ్, క్షమించు మర్చిపోయాను. ( పక్కకి తిరిగి రెండు చప్పట్లు చరిచాడు)

(క్షణాల్లో టేబుల్ రకరకాల వంటకాలతో నిండిపోయింది).

food arrangements at meetup
food arrangements at meetup

రెండవ వ్యక్తి : (హాయిగా అన్నీ తినడం ప్రారంభించాడు). చాలా బాగున్నాయి. వంటలు చాలా అద్భుతంగా చేసారు. ఈ స్వీట్ చాలా బాగుంది కాస్త రుచి చూడు.

మొదటి వ్యక్తి : క్షమించరా నాకు షుగర్ ఉంది. తినలేను.

రెండవ వ్యక్తి : అవునా, పోనీ ఈ స్నాక్స్ అయినా తిను.

మొదటి వ్యక్తి : సారీ రా, నాకు బీపీ కూడా ఉంది, తినలేను.

రెండవ వ్యక్తి : పోనీ నువ్వు తినేది ఏదైనా కాస్త తిను.

మొదటి వ్యక్తి : సారీ రా . నాకు అజీర్తి వ్యాధి కూడా ఉంది. రోజూ ఒక్క పూట మాత్రమే తింటాను.

రెండవ వ్యక్తి : అంటే నాకు తోడుగా ఏమీ తినలేవా.

మొదటి వ్యక్తి : (నవ్వుతూ) ఎందుకు తినలేను, చాలా టాబ్లెట్స్ తినాలి.

రెండవ వ్యక్తి: నిన్ను చూస్తే నాక్కూడా సంతోషంగానూ, బాధగానూ ఉంది.

మొదటి వ్యక్తి: (తన ధన గర్వానికి సిగ్గుపడుతూ) నువ్వు టాబ్లెట్స్ ఏమీ వేసుకోవా ?

రెండవ వ్యక్తి : (నవ్వుతూ) నాకు డబ్బులు (జబ్బులు) లేవుగా ….

(ప్రస్తుతం) ధనవంతుని కుమారుడు ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకి వచ్చాడు. అందరూ అతని చెప్పే సమాధానం కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..

Farmer's son practicing Yoga
Farmer’s son practicing Yoga

“ఆ వ్యక్తి ఎవరో కాదు నలభై ఏళ్ల క్రితం మనందరం మన భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏమవుతావురా అని అడిగితే మన ఊరిలోనే యోగా వ్యాయామ శాల ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులతో ఉంటూ మన ఊరికి సేవలు చేస్తాను అని చెప్తే మనందరం అతన్ని చూసి నవ్వుకున్నాం కానీ ఈరోజు అతను మనందరికంటే ధనవంతుడు. ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారో వాడే కోటీశ్వరుడు”. 

The ultimate success in the life
The ultimate success in the life

“నేను కోట్లు సంపాదించాను కానీ అంతకంటే విలువైన ఆరోగ్య సంపాదనలో ఓడిపోయాను. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఎదిగిన వాడు అంటే తన నీడలో పది మందికీ ఆశ్రయం కల్పించేవాడు, పదిమందికి పంచే ఆస్తిని సంపాదించేవాడు. మనకి ఆస్తి ఉన్నా పంచలేము. వాడికి ఉన్న ఆస్తి ఆరోగ్య విద్య, తన చుట్టూ ఉన్న వాళ్లకి ఎంత పంచినా తరగని ఆస్తి కలిగి ఉన్నవాడే ధనవంతుడు. మన సంపద పంచితే తరిగేది, వాడి సంపద పంచితే పెరిగేది. దానంలో కెల్లా గొప్పది విద్యా దానం. విద్యల్లో కెల్లా గొప్పది ఆరోగ్య విద్య. వాడు ఆరోగ్య దాత. మన సంపద ఇప్పుడు మనకి సంతృప్తిగా ఒక ముద్ద కూడా పెట్టలేకపోతుంది. వాడి సంపద ఉన్నదాంట్లో సంతృప్తిగా తినిపిస్తోంది. విద్యను పంచితే మనలాంటి వాళ్ళని తయారు చేయగలం, ఆరోగ్య విద్యను పంచితే ఒక సంపూర్ణత కలిగిన సమాజాన్ని చూడగలం”. అంటూ అందరూ సంతోషంతో ఆ సన్మానాన్ని రైతు కుమారుడుకి చేసి సభ ముగించారు.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!